'వాల్ ఆఫ్ ఇండియన్ హాకీ' స‌వితా పునియా బ‌యోపిక్‌లో ప్రియాంక చోప్రా?

బాక్స‌ర్ మేరీకోమ్ బ‌యోపిక్ లో నటించారు ప్రియాంక చోప్రా. మ‌రో క్రీడాకారిణి బ‌యోపిక్ లో పీసీ న‌టిస్తుందా? అన్న‌ది ప్ర‌స్తుతం హాట్ టాపిగ్గా మారింది.

Update: 2026-10-17 17:07 GMT

బాక్స‌ర్ మేరీకోమ్ బ‌యోపిక్ లో నటించారు ప్రియాంక చోప్రా. మ‌రో క్రీడాకారిణి బ‌యోపిక్ లో పీసీ న‌టిస్తుందా? అన్న‌ది ప్ర‌స్తుతం హాట్ టాపిగ్గా మారింది. భారత మహిళల హాకీ జట్టు స్టార్ గోల్‌కీపర్, `వాల్ ఆఫ్ ఇండియన్ హాకీ`గా ప్రఖ్యాతి గాంచిన సవితా పునియా తన జీవితంపై ఒక బయోపిక్ (జీవిత చరిత్ర చిత్రం) వస్తే.. ఆ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ తన పాత్రలో నటించాలని కోరుకున్నారు. తన జీవిత ప్రయాణాన్ని తెరపైకి తీసుకురావాలనే ఆలోచన ఎప్పుడూ చేయకపోయినా. ఒకవేళ సినిమా తెరకెక్కితే ప్రియాంక చోప్రా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయగలరని స‌వితా పునియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

భారత హాకీ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్‌ను కలిగి ఉన్న సవితా పునియా.. దేశం తరపున 326 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళా హాకీ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు. ఆసియా క్రీడలలో బంగారు పతకం సాధించడంతో పాటు.. భారత మహిళల హాకీ పురోగతిలో కీలక పాత్ర పోషించిన పునియా అంకితభావానికి గాను దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన `పద్మశ్రీ` అవార్డును కూడా అందుకున్నారు.

ప్రియాంక చోప్రా గతంలో ప్రఖ్యాత‌ భారతీయ బాక్సర్ మేరీ కోమ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ చిత్రంలో అద్భుతంగా నటించి మెప్పించారు. ప్రియాంక సినీ ప్రయాణం తనకు ఎంతో స్ఫూర్తినిస్తుందని సవితా పునియా పేర్కొన్నారు. క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ఒక మహిళా అథ్లెట్ బయోపిక్‌లో నటించడానికి ప్రియాంక చోప్రా సరైన ఎంపిక అనే అభిప్రాయం ప్రస్తుతం క్రీడా, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

లాస్ ఏంజెల్స్‌లో పీసీ వైబ్స్:

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ ఇటీవ‌ల `వార‌ణాసి` చిత్రీక‌ర‌ణ‌లో బిజీ బిజీగా గ‌డిపిన సంగ‌తి తెలిసిందే. ఓవైపు భ‌ర్త‌తో స‌మ‌యం గ‌డ‌ప‌డం కోసం పీసీ అమెరికా ప్ర‌యాణాలు చేస్తూనే, భార‌త‌దేశంలో న‌టిగా కెరీర్ ని చ‌క్క‌దిద్దుకుంటున్నారు. తాజాగా లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన 2026 `ఇన్‌స్టైల్ ఇమేజ్‌మేకర్ అవార్డ్స్` వేడుకలో అరుదైన ఘనత సాధించారు. వినోద రంగంలో పీసీ చేసిన విశేష కృషితో పాటు.. హాలీవుడ్‌లో మహిళల గొంతును వినిపించేందుకు.. మహిళలకు నూతన అవకాశాలు కల్పించేందుకు పీసీ చేసిన ప్రయత్నాలను గుర్తిస్తూ ఈ కార్యక్రమంలో ఆమెను `వుమన్ ఆఫ్ ఇంపాక్ట్` అవార్డుతో సత్కరించారు. కాలిఫోర్నియాలోని బెల్-ఎయిర్‌లో అక్టోబర్ 15న జరిగిన ఈ మూడో వార్షిక వేడుకలో పారిస్‌కు చెందిన `మాటియర్స్ ఫెకలేస్` స్ప్రింగ్ 2027 కలెక్షన్‌కు చెందిన పింక్ టూ-పీస్ డ్రెస్ లో ఆమె అద్భుతమైన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.

భారతీయ సంతతికి చెందిన నటీమణులు అవంతిక వందనపు, అమితా రావులతో పాటు మేగన్ సూరి కలిసి ప్రియాంకకు ఈ అవార్డును అందజేశారు. ఈ వేడుకలో భర్త, ప్రముఖ గాయకుడు నిక్ జోనాస్ అందించిన సర్ప్రైజ్ వీడియో ట్రిబ్యూట్ ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చింది. ఈ కార్యక్రమంలో హైడీ క్లమ్, మెగాన్ థీ స్టాలియన్ తదితర ప్రముఖ అంతర్జాతీయ సెలబ్రిటీలు పాల్గొనగా, తెలుగు మూలాలున్న అవంతిక వందనపు సహా సౌత్ ఏషియన్ టాలెంట్ అంతర్జాతీయ వేదికలపై తన ప్రాతినిధ్యాన్ని చాటడం విశేషంగా నిలిచింది.

Tags:    

Similar News