అవమానించిన ఆ డైరెక్టర్ ఇండస్ట్రీకి దూరంగా!
ఇండస్ట్రీలో అవమానాలు, అవహేళనలు సహజం. బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారు ఇవన్నీ ఎదుర్కోవాల్సిందే.;
ఇండస్ట్రీలో అవమానాలు, అవహేళనలు సహజం. బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారు ఇవన్నీ ఎదుర్కోవాల్సిందే. ఎదిగే వరకూ అన్నింటిని సహజంగా భరించాల్సిందే. నేడు లెజెండ్స్ గా ఉన్న వారు సైతం ఆరంభంలో ఇలాంటి అవమానాలు ఎదుర్కున్నవారే. నాడు శాంతంగా ఉన్నారు కాబట్టే నేడు నిలబడ్డారు. అందుకే చిత్ర పరిశ్రమలో రాణించాలంటే ప్రతిభ కంటే ముందు క్రమశిక్షణ అవసరమని చాలా మంది చెబుతుంటారు. ఇక ఎదిగిన తర్వాత అతడి సక్సెస్ చూసి ఏడ్చేవాళ్లు కూడా చుట్టు పక్కలే ఉంటారు. ఎదగకుండా కాళ్లు పట్టుకుని లాగే వాళ్లు కూడా పక్కనే ఉంటారు.
స్టోరీ రైటర్ గా ప్రయాణం:
వాళ్లతో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారితో స్నేహాలు క్యాన్సర్ కన్నా ప్రమాదకరమని ఆ మధ్య ఓ అనుభవజ్ఞుడు సూచించాడు. తాజాగా యువ డైరెక్టర్ జయశంకర్ కూడా అదే చెబుతున్నాడు. `పేపర్ బోయ్` తో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు జయశంకర్. తొలి సినిమా మంచి విజయం అందించింది. ఇటీవలే అతడు దర్శకత్వం వహించి `అరి` అనే సినిమా కూడా చేసాడు. ఈ సినిమా కూడా చక్కని విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాలకంటే ముందే అతడు స్టోరీ రైటర్ గా పని చేసాడు. కొన్ని లఘు చిత్రాలు కూడా తెరకెక్కించాడు. చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా సక్సస్ అవ్వడం కోసం చేయాల్సినవన్నీ చేసాడు.
స్టైల్ మాత్రం వదల్లేదు:
అయితే కెరీర్ ఆరంభంలో ఓ టాప్ డైరెక్టర్ తనని అవమానించిన ఘటన తాజాగా గుర్తు చేసుకున్నాడు. `ఓ సినిమా కోసం డైలాగులు రాస్తే ఇవేం డైలాగులు. డైలాగులు అంటే? ఇలా ఉంటాయా? అని అందిరి ముందు తిట్టాడుట. కానీ ఆ అవమానాన్ని తాను మాత్రం ఓ ఛాలెంజ్ గా తీసుకుని పని చేసానన్నాడు. తన బలం ఏంటో తనకు తెలుసని...ఎవరో ఏదో అన్నారని బాధపడలేదన్నాడు. అతడు తిట్టాడని తన స్టైల్ వదలుకోలేదన్నాడు. `గౌతమ్ నంద` సినిమాకు డైలాగులు రాస్తే అవి థియేటర్లో పేలడంతో ప్రేక్షకులంతా చప్పట్లు కోట్టారన్నారు.
వచ్చే ఏడాది మరో చిత్రం:
కానీ తనని అవమానించిన డైరెక్టర్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే లేరన్నాడు. అందుకే ఎప్పుడూ తాను అనుకున్నదే కరెక్ట్ అని గుడ్డిగా నమ్మడం కరెక్ట్ కాదన్నారు. ప్రస్తుతం జయశంకర్ తదుపరి సినిమా పనుల్లో నిమగ్నమవ్వడానికి రెడీ అవుతున్నాడు. తర్వాత చిత్రం కూడా `అరి` తరహాలోనే డిఫరెంట్ జానర్లో ఉంటుందన్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ ఉంటుందని తెలిపాడు. జయశంకర్ `అపరంజి` ,`ముద్దుబిడ్డ`, `అభిషేకం`, `మావిచిగురు` `చిన్న కోడలు` లాంటి సీరియళ్లకు కథలు అందించారు. ఆరు లఘు చిత్రాలు తెరకెక్కించగా వాటిలో ఒకటి మాత్రం రిలీజ్ చేయలేదు.