ఆమెతో డాన్స్ అంటే కాళ్లు...చేతులు ఒణికాయ్!
యశ్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన `దిల్ తో పాగల్ హై` బాలీవుడ్ చిత్ర చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాల్లో ఒకటి.
యశ్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన `దిల్ తో పాగల్ హై` బాలీవుడ్ చిత్ర చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాల్లో ఒకటి. షారుఖ్ ఖాన్- మాధురీ దీక్షిత్- కరిష్మా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుని నేటికీ ఐకానిక్ క్లాసిక్‌గా నిలిచింది. అయితే సినిమాలో ముఖ్యమైన పాత్ర అయిన `నిషా` పాత్ర కోసం నటీనటుల ఎంపిక సమయంలో తెరవెనుక ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పాత్రలో నటించడానికి బాలీవుడ్‌లోని అగ్ర కథానాయికలు ఎవరూ ముందు కు రాలేదని.. అందరూ భయపడ్డారని ఓ ఇంటర్వ్యూలో కరిష్మా కపూర్ వెల్లడించారు.
ఆ సమయంలో మాధురీ దీక్షిత్ బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా.. డాన్సింగ్ స్టార్ గా అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె అద్భుతమైన నటన తోపాటు .. డాన్స్ కు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉండేది. అలాంటి గొప్ప డాన్సర్ పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవడం..ఆమెతో నేరుగా పోటీ పడుతూ డాన్స్ చేయడం అంటే ఆనాటి అగ్ర హీరోయిన్లు ఎంతో సంకోచించారు. మాధురి పక్కన నటిస్తే తాము ఎక్కడ తక్కువగా కనిపిస్తామోననే ఆందోళన ..డాన్స్ వేగాన్ని అందుకోలేమనే భయం చాలా మందిలో ఉండేదని కరిష్మా పేర్కొన్నారు.
ఈ పాత్ర కోసం దర్శకుడు యష్ చోప్రా అప్పట్లో ఎంతో మంది టాప్ హీరోయిన్లను సంప్రదించినప్పటికీ వారంతా వివిధ కారణాలతో ప్రాజెక్ట్‌ను తిరస్కరించారు. చివరకు ఈ ఆఫర్ కరిష్మా కపూర్ వద్దకు వచ్చింది. ఆ సమయంలో కరిష్మా తల్లి, మాజీ నటి బబితా కపూర్ ఆమెకు ధైర్యం చెప్పారు. మాధురి దీక్షిత్ వంటి గొప్ప నటి, డాన్సర్ పక్కన నటించే అవకాశాన్ని సవాల్‌గా స్వీకరించాలని.. ఆమెతో కలిసి పనిచేయడం ద్వారా వృత్తిపరంగా ఎంతో నేర్చుకోవచ్చని తల్లి ఇచ్చిన సలహా కరిష్మాలో నమ్మకాన్ని నింపింది. దీంతో కరిష్మా ఏమాత్రం వెనుకాడకుండా
ఆ పాత్రను చేయడానికి ఒప్పుకున్నారు.
షూటింగ్ ప్రారంభమైన తర్వాత మాధురీ దీక్షిత్‌తో కలిసి డాన్స్ కాంపిటీషన్ సీన్లలో నటించడం కరిష్మాకు అంత సులువు కాలేదు. కొరియోగ్రాఫర్ షియామక్ దావర్ అందించిన క్లిష్టమైన వెస్ట్రన్ - సమకాలీన నృత్య రీతులను నేర్చుకోవడానికి రాత్రింబవళ్లు కష్టపడాల్సి వచ్చింది. మాధురి స్థాయికి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం గంటల తరబడి ప్రాక్టీస్ చేశానని కరిష్మా గుర్తు చేసుకున్నారు. తెరపై వారిద్దరి మధ్య కనిపించిన ఆ పోటీ కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా వారిద్దరి మధ్య వచ్చే డాన్స్ ఆఫ్ ఎన్వీ సీన్ ఇప్పటికీ సినీ ప్రియుల మనస్సుల్లో నిలిచిపోయింది.
కరిష్మా కపూర్ నమ్మకం, కఠోర శ్రమ వృథా పోలేదు. `దిల్ తో పాగల్ హై` చిత్రం విడుదలయ్యాక కరిష్మా పోషించిన నిషా పాత్రకు ప్రేక్షకుల నుండి.. విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. మాధురి వంటి అగ్ర నటి పక్కన ఉన్నప్పటికీ తనదైన శైలిలో నటన, నృత్యంతో కరిష్మా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో ఆమె కనబరిచిన అద్భుతమైన నటనకు గాను ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డు తో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కడం విశేషం.