ధురంధర్ టీమ్ ఇంటర్వ్యూలేవి? నెట్ ఫ్లిక్స్ కండిషన్ పెట్టిందా?
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తప్పించి, ఆ చిత్రాలకు సంబంధించి ఎక్కడా పెద్దగా ఇంటర్వ్యూలు లేకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.;
సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరోలు, దర్శకులు, నటీనటులు వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం సాధారణంగా చూస్తుంటాం. కానీ ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న ధురంధర్ 1, ధురంధర్ 2 సినిమాల విషయంలో మాత్రం ఇది కనిపించలేదు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తప్పించి, ఆ చిత్రాలకు సంబంధించి ఎక్కడా పెద్దగా ఇంటర్వ్యూలు లేకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆ విషయంపై తాజాగా ఒక ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆ రెండు సినిమాల డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఒప్పందంలో భాగంగా ఓ ప్రత్యేక క్లాజ్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ క్లాజ్ ప్రకారం, సినిమా విడుదలకు ముందు లేదా తర్వాత కూడా యూట్యూబ్, టీవీ చానెల్స్ లేదా ఇతర మీడియా వేదికల్లో నార్మల్ ఇంటర్వ్యూలను మూవీ టీమ్ ఇవ్వకూడదని నిబంధన ఉన్నట్లు సమాచారం.
అందుకే దర్శకుడు ఆదిత్య ధర్, హీరో రణవీర్ సింగ్, అలాగే ఇతర నటీనటులు ఎక్కడా ఇంటర్వ్యూలలో కనిపించలేదని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. సాధారణంగా సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ ధురంధర్ టీమ్ మాత్రం ఈసారి భిన్నంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. మరో ముఖ్యమైన విషయం కూడా ఉందట.
ధురంధర్ 1,2 సినిమాలకు సంబంధించిన బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియోలు, ప్రత్యేక ఇంటర్వ్యూలు, మేకింగ్ వీడియోలు అన్నీ నెట్ ఫ్లిక్స్ లో మాత్రమే విడుదల చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంటే ప్రేక్షకులు ప్రత్యేక కంటెంట్ ను చూడాలంటే కచ్చితంగా నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ నే ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే ఆ వ్యూహం వెనుక పెద్ద ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది.
థియేటర్ రిలీజ్ తర్వాత కూడా సినిమాపై అసలు ఆసక్తి తగ్గకుండా ఉండటానికి, అలాగే ఓటీటీ విడుదలకు భారీ హైప్ తీసుకురావడానికి ఆ విధానం ఉపయోగపడుతుందని నెట్ ఫ్లిక్స్ భావించినట్లు సమాచారం. మరోవైపు సోషల్ మీడియా కాలంలో ఇంటర్వ్యూలు లేకపోవడం సినిమాపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
కానీ ధురంధర్ సినిమాలు మాత్రం ఆ ట్రెండ్ ను బ్రేక్ చేసి, కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ప్రమోషన్ విధానం పెద్దగా ప్రభావం చూపదని నిరూపించాయి. మొత్తానికి, ధురంధర్ 1, ధురంధర్ 2 సినిమాల విషయంలో ఇంటర్వ్యూలతో మూవీ టీమ్ సందడి చేయకపోవడం వెనుక నెట్ ఫ్లిక్స్ క్లాజ్ కారణమనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇది ఫ్యూచర్ లో మరిన్ని సినిమాలకు కూడా ఫాలో అయ్యే కొత్త ట్రెండ్ గా మారుతుందా లేదా అనేది అంతా వేచి చూడాలి.