దురంధర్ లాజిక్కు.. లియారీ వీధుల్లో మినీస్కర్ట్ బ్యూటీ ఎలా బాబూ?
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన `దురంధర్ 2` బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.;
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన `దురంధర్ 2` బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టించింది. ఈ సినిమా మేకింగ్ శైలి, ఆదిత్యాధర్ దర్శకత్వ ప్రతిభపై ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా, అతడు కథను కన్వే చేసిన తీరును ప్రశంసించని వారు లేరు. అయితే ఇది నాణేనికి ఒక కోణం మాత్రమే. పాకిస్తాన్ లియారీ ప్రజలు ఏమంటున్నారు? అంటే దానికి సమాధానం వేరే ఉంది. దురంధర్ భారీ విజయం మధ్యలో సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా పాకిస్థాన్‌కు చెందిన నెటిజన్లు ఈ సినిమాలో లాజిక్ మిస్సయిందంటూ.. లోపాలను ఎత్తిచూపుతూ పోస్ట్‌లు పెడుతున్నారు.
ఈ సినిమాలో పాకిస్థాన్ కరాచీలో ఉన్న `లియారీ` అనే ప్రాంతాన్ని కథలో భాగంగా చూపించారు. ఈ నేపథ్యంలో నటి సారా అర్జున్ పోషించిన పాత్ర ధరించిన దుస్తులపై ప్రధానంగా వివాదం నెలకొంది. అత్యంత సంప్రదాయబద్ధంగా ఉండే లియారీ వీధుల్లో సారా అర్జున్ `మినీ స్కర్ట్` ధరించి తిరగడం హాస్యాస్పదంగా ఉందని పాకిస్థానీ నెటిజన్లు విమర్శిస్తున్నారు. అక్కడ స్థానిక మహిళలు ఎవరూ అలాంటి మోడ్రన్ దుస్తులు వేసుకోరని వారు గుర్తు చేస్తున్నారు.
ఒక రహస్య ఏజెంట్ శత్రువుల మధ్య ఉన్నప్పుడు అందరిలో కలిసిపోయేలా ఉండాలి. కానీ ఇలా ప్రత్యేకంగా కనిపించేలా మినీ స్కర్ట్ ధరిస్తే ఎవరైనా సులభంగా గుర్తుపట్టేస్తారని నెటిజన్లు లాజిక్ తీస్తున్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ కేవలం `సినిమాటిక్ లిబర్టీ` పేరుతో వాస్తవికతను పక్కన పెట్టేశారని విమర్శలు వస్తున్నాయి. కరాచీ సంస్కృతిపై సరైన రీసెర్చ్ చేయకుండానే ఈ సన్నివేశాలను తీశారని వారు ఆరోపిస్తున్నారు.
ఈ విమర్శలపై భారతీయ నెటిజన్లు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇది కేవలం ఒక ఫిక్షన్ సినిమా మాత్రమేనని దీన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని వారు వాదిస్తున్నారు. ఇది కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందించిన ఫిక్షన్ సినిమా అని దర్శకుడు ముందే చెప్పారు. ఇప్పుడే కొత్తగా గుర్తు చేయాల్సిన పని లేదని కూడా కొందరు వాదిస్తున్నారు. గ్లామర్ ఎలివేషన్ కోసం లేదా సినిమాటిక్ ఎఫెక్ట్ కోసం అలా చూపించి ఉండవచ్చని కొందరు సమర్థిస్తున్నారు. అయితే మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలో ఇలాంటి లాజిక్స్ తక్కువయ్యాయని కొందరు సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
వివాదాలు ఎలా ఉన్నా `దురంధర్ 2` క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ కొనసాగుతోంది. వివాదాలు, చర్చల వల్ల సినిమాకు మరింత పబ్లిసిటీ లభిస్తోంది. సారా అర్జున్ దుస్తుల విషయం పక్కన పెడితే తన నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. `యూరి` తర్వాత ఆదిత్య ధర్ తీసిన ఈ సినిమా కూడా పొలిటికల్ కోణంలో సోషల్ మీడియాల్లో వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఈ `మినీ స్కర్ట్` వివాదం సినిమా వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.