ధురంధర్.. మళ్లీ నాగవంశీని కెలకడమెందుకు?
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన ధురంధర్ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన ధురంధర్ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా ఆదిత్య ధర్ రూపొందించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మిక్స్ డ్ టాక్ వచ్చినా దానితో సంబంధం లేకుండా కలెక్షన్స్ ను సాధిస్తోంది.
డిసెంబర్ 5వ తేదీన ధురంధర్ మూవీ రిలీజ్ అవ్వగా.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరింది. రణవీర్ సింగ్ కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు కూడా ధురంధర్ భారీ వసూళ్లను సాధిస్తుండగా.. అనేక చోట్ల హౌస్ ఫుల్స్ నమోదు చేసుకుంటోంది. బాలీవుడ్ సినీ వర్గాల్లో ఉత్సాహం కూడా నింపుతోంది.
అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ పేరు వినిపిస్తోంది. ధురంధర్ మూవీ సక్సెస్ అయిన నేపథ్యంలో ఓ బీటౌన్ యూజర్.. నాగవంశీ ఫోటోను షేర్ చేశారు. అంతే కాదు.. ఆ పర్సన్ ఇప్పుడు ఎక్కడ అంటూ క్వశ్చన్ చేశారు. దీంతో బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ రెస్పాండ్ అయ్యారు.
ఎక్కడో నిద్ర పట్టక బాధపడుతున్నాడు అంటూ నాగవంశీ పాత వ్యాఖ్యలను గుర్తు చేస్తూ రిప్లై ఇచ్చారు. కానీ కొంతసేపటికే రిప్లైను డిలీట్ చేసినా.. అప్పటికే అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్.. సోషల్ మీడియాలోకి వచ్చేసింది. దీంతో ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అన్నట్లు నెట్టింట కామెంట్స్ వార్ జరుగుతోంది.
నిజానికి పుష్ప-2 గురించి ఒక రౌండ్ టేబుల్ చర్చలో మాట్లాడుతూ, ఒక రోజులో రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో ఆరోజు ముంబై మొత్తం నిద్రపోయిందని తాను అనుకోనంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆ వ్యాఖ్య అప్పట్లో బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీయగా.. అక్కడి ఆడియన్స్ నాగవంశీపై ఫైర్ అయ్యారు.
ఆ తర్వాత మెల్లగా ఆ వివాదం ముగిసింది. ఇప్పుడు నాగవంశీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ డైరెక్టర్ రిప్లై ఇవ్వడంతో మళ్లీ కథ ముందుకు వచ్చింది. దీంతో ఇప్పుడు పలువురు టాలీవుడ్ నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు ఎందుకు కెలకాలని క్వశ్చన్ చేస్తున్నారు. మళ్లీ అప్పుడు వివాదాన్ని గుర్తు చేయడం అవసరమా అని అడుగుతున్నారు. ఎలాంటి సంబంధం లేకుండా ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నిస్తున్నారు. అయితే నాగవంశీ ఇప్పుడు స్పందిస్తారేమో వేచి చూడాలి.