డివోషనల్ సినిమాలకు కొత్త బిజినెస్ మోడల్?

సినిమా అంటే స్టార్ హీరో, భారీ బడ్జెట్, యాక్షన్ ఎలిమెంట్స్, గ్రాండ్ విజువల్స్.. ఇవే బాక్సాఫీస్ స‌క్సెస్‌కు ప్రధానమైన అంశాలుగా చాలాకాలంగా భావిస్తున్నారు.

Update: 2026-08-27 05:57 GMT

సినిమా అంటే స్టార్ హీరో, భారీ బడ్జెట్, యాక్షన్ ఎలిమెంట్స్, గ్రాండ్ విజువల్స్.. ఇవే బాక్సాఫీస్ స‌క్సెస్‌కు ప్రధానమైన అంశాలుగా చాలాకాలంగా భావిస్తున్నారు. అయితే మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు ఈ లెక్కలను క్రమంగా మార్చుతున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మికత, భక్తి, నిజ జీవితంలోని ఆధ్యాత్మిక వ్యక్తుల కథలను ఆధారంగా చేసుకున్న సినిమాలు సైతం థియేటర్లలో తమకంటూ ప్రత్యేకమైన ఆడియన్స్‌ను సంపాదించుకుంటుండటం ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.

డివోషనల్ సినిమాల ప్రత్యేకత వాటికి ముందుగానే ఒక నిర్దిష్ట ప్రేక్షక వర్గం ఉండటం. ఓ స్టార్ హీరోకు అభిమానులు ఉన్నట్టే, ఒక ఆధ్యాత్మిక గురువు లేదా విశ్వాసానికి సంబంధించిన కథకు భక్తుల్లో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఈ కనెక్షన్‌ను సరిగ్గా తెరపైకి తీసుకురాగలిగితే భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్లపై ఆధారపడకుండానే ఆడియ‌న్స్ ను థియేటర్లకు రప్పించే అవకాశం ఉంటుంది. ఇదే ఇప్పుడు నిర్మాతలకు కొత్త బిజినెస్ మోడల్‌పై ఆలోచించేలా చేస్తోంది.

ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు ఓపెనింగ్ కంటే లాంగ్ రన్ కీలకంగా మారుతోంది. మొదటి రోజే భారీ క‌లెక్ష‌న్లు సాధించడం కంటే.. టాక్ ద్వారా ప్రేక్షకుల సంఖ్య క్రమంగా పెరగడం ఈ సినిమాల‌ బలంగా కనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియ‌న్స్, భక్తులు, ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి ఉన్నవారు టార్గెట్ ఆడియన్స్‌గా మారడంతో సినిమా రిలీజైన తర్వాత కూడా డిమాండ్ కొనసాగించే అవకాశం ఉంటుంది.

మరోవైపు, భారీ యాక్షన్ సినిమాలకు అవసరమయ్యే స్థాయిలో ఖర్చుతో కూడిన నిర్మాణం లేకుండానే కథకు అనుగుణంగా సహజమైన లొకేషన్లు, నటీనటుల పెర్ఫార్మెన్స్, బలమైన ఎమోషనల్ కంటెంట్‌పై దృష్టి పెట్టడం ద్వారా బ‌డ్జెట్ ను కూడా కొంత‌వ‌ర‌కు కంట్రోల్ చేయొచ్చు. అయితే తక్కువ బడ్జెట్ అంటే తక్కువ ప్రమాణాలు అనే భావనకు తావివ్వకుండా కథనంలో నమ్మకం కలిగించడం మాత్రం కీలకం.

ఇక్కడే డివోషనల్ కంటెంట్‌కు కొత్త మార్కెట్ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక నిర్దిష్ట భక్త సమూహాన్ని టార్గెట్ గా చేసుకుని సినిమాను రూపొందించడం, ప్రాంతీయంగా బలమైన విశ్వాసాలను గుర్తించడం, సరైన భాషల్లో రిలీజ్ చేయడం వంటి స్ట్రాట‌జీలు నిర్మాతలకు కొత్త అవకాశాలను తెరవొచ్చు. అంటే ఇకపై బాక్సాఫీస్‌ను నడిపించేది ఫ్యాన్ బేస్ మాత్రమే కాకుండా ఫెయిత్ బేస్ కూడా కావచ్చన్న మాట. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే ప‌లు సినిమాలు ప్రూవ్ చేయ‌గా తాజాగా బాలీవుడ్ లో రిలీజైన‌ హ‌నుమాన్ అంశ్ అనే సినిమా మ‌రోసారి నిరూపించింది. సరైన కథ, టార్గెటెడ్ ఆడియన్స్, బ‌డ్జెట్ కంట్రోల్ తో డివోషనల్ సినిమా కూడా కమర్షియల్‌గా నిలబడగలదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు భక్తి సినిమాలను చూసే లెక్కలు మారే అవకాశం లేకపోలేదు.

Tags:    

Similar News