దేవర 2 ఆగిపోతే.. ఆ పందెం వాళ్ళే గెలిచినట్లా?
'దేవర 1' రిలీజ్ టైంలో సోషల్ మీడియాలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ సంబరపడితే, అసలు మేటర్ లేదని మరో వర్గం తేల్చేసింది.;
'దేవర 1' రిలీజ్ టైంలో సోషల్ మీడియాలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ సంబరపడితే, అసలు మేటర్ లేదని మరో వర్గం తేల్చేసింది. ఆనాడు జరిగిన ఆ వాదోపవాదాలు ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే ఇప్పుడు ఆ పాత గొడవ మళ్ళీ తెరపైకి వచ్చింది. సీక్వెల్ ఉంటుందా ఉండదా అనే సస్పెన్స్ నడుస్తున్న వేళ, ఒకవేళ సినిమా ఆగిపోతే గెలుపు ఎవరిది అనే చర్చ ఆసక్తికరంగా మారింది.
అప్పట్లో ఒక వర్గం ఆడియెన్స్ ఈ సినిమా భవిష్యత్తుపై గట్టిగానే జోస్యం చెప్పారు. పార్ట్ 1 ఏదో అలా నెట్టుకొచ్చారు కానీ, పార్ట్ 2 వచ్చే ఛాన్సే లేదని బల్లగుద్ది మరీ వాదించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, వినిపిస్తున్న గుసగుసలు చూస్తుంటే.. వాళ్ళు ఊహించిందే నిజం కాబోతోందా? అనే అనుమానం కలుగుతోంది. కొరటాల శివ మౌనం కూడా దీనికి బలం చేకూరుస్తోంది.
అసలు విషయం ఏంటంటే.. 'దేవర' హిట్ అయ్యింది కేవలం ఎన్టీఆర్ స్టార్ డమ్, అనిరుధ్ మ్యూజిక్ వల్లే అనేది క్రిటిక్స్ ప్రధాన వాదన. కొరటాల టేకింగ్ లో పాత వాసనలు ఉన్నాయని, కథలో కొత్తదనం లేదని అప్పట్లోనే విమర్శించారు. అంత వీక్ కంటెంట్ తో రెండో భాగం తీయడం సాధ్యం కాదని, ఆ విషయం ఎన్టీఆర్ కు కూడా తెలుసుని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు ఒకవేళ 'దేవర 2' ఆగిపోతే, ఆ విమర్శకుల మాటే నిజమైనట్లు ఒప్పుకున్నట్టే అవుతుంది. కథలో దమ్ము లేకపోవడం వల్లే సీక్వెల్ ఆగిపోయిందనే నెగటివ్ కామెంట్స్ కు అది ఊతమిస్తుంది. ఎన్టీఆర్ వేరే ప్రాజెక్టులతో బిజీ అవ్వడం, కొరటాల స్క్రిప్ట్ పై నమ్మకం లేకపోవడం.. ఇవన్నీ అప్పుడు వినిపించిన లోపాలను ఇప్పుడు పరోక్షంగా నిజం చేస్తున్నట్లే ఉన్నాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ చూస్తే ప్రశాంత్ నీల్ 'డ్రాగన్'తో బిజీగా ఉన్నారు. కొరటాల వైపు నుంచి ఎలాంటి సౌండ్ లేదు. నమ్మకం ఉంటే ఈపాటికే అనౌన్స్ మెంట్ వచ్చేది. కానీ ఆ దిశగా అడుగులు పడకపోవడం చూస్తుంటే, అప్పట్లో నెగటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళ విశ్లేషణే కరెక్ట్ అనిపిస్తోందనే వాదన మళ్లీ పెరగవచ్చు. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ ఇక వర్కవుట్ కాదని మేకర్స్ రియలైజ్ అయ్యారా అనే సందేహాలు వస్తున్నాయి.
మొత్తానికి 'దేవర 2' రాకపోతే మాత్రం, ఆనాడు విమర్శించిన వర్గమే గెలిచినట్లు లెక్క. "మేం అప్పుడే చెప్పాం కదా" అని వాళ్ళు కాలర్ ఎగరేసే ఛాన్స్ ఇచ్చినట్లవుతుంది. ఈ ప్రచారానికి చెక్ పెట్టాలంటే తారక్ లేదా కొరటాల నోరు విప్పాల్సిందే. లేదంటే ఆ 'నెగటివ్' జోస్యమే నిజమవుతుంది.