వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా రికార్డ్: 1400 కోట్ల బ‌డ్జెట్.. 6 కోట్ల వ‌సూళ్లు!

సినిమా రంగంలో బడ్జెట్లు పెరిగిపోతున్న కాలమిది. బాహుబ‌లి, 2.0, కేజీఎఫ్, క‌ల్కి 2898 ఏడి, స‌లార్ లాంటి భారీ బ‌డ్జెట్ సినిమాలు సౌతిండియా నుంచి వ‌చ్చాయి.;

Update: 2026-05-07 22:30 GMT

సినిమా రంగంలో బడ్జెట్లు పెరిగిపోతున్న కాలమిది. బాహుబ‌లి, 2.0, కేజీఎఫ్, క‌ల్కి 2898 ఏడి, స‌లార్ లాంటి భారీ బ‌డ్జెట్ సినిమాలు సౌతిండియా నుంచి వ‌చ్చాయి. ఇప్ప‌టి వారణాసి, రామాయణ వంటి భారీ చిత్రాలతో భారతీయ సినిమా ప్రపంచాన్ని జయించాలని చూస్తోంది. అయితే భార‌త‌దేశం నుంచి సినిమా బ‌డ్జెట్ల ప‌రంగా, సాంకేతిక‌త వినియోగంలో అంత‌కంత‌కు రైజ్ అవుతుంటే.. అటు చైనా, కొరియా దేశాలు కూడా భారీ బ‌డ్జెట్ సినిమాల‌ నిర్మాణాలతో పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో సౌదీ అరేబియా హాలీవుడ్ స్టార్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఒక చిత్రం బాక్సాఫీస్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

ఈరోజుల్లో భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుండి 4000 కోట్ల బ‌డ్జెట్‌తో ఒక సినిమా తెర‌కెక్కుతుంద‌ని ఎవ‌రైనా ఊహించ‌గ‌లిగారా? కానీ అది `రామాయణ` ఫ్రాంఛైజీతో సాధ్య‌మ‌వుతోంది. రెండు భాగాలుగా రూపొందుతున్న రామాయ‌ణ కోసం న‌మిత్ మ‌ల్హోత్రా ఏకంగా 4000 కోట్లు పెడుతున్నారు. ఒక్కో భాగానికి భార‌తీయ సినీప‌రిశ్ర‌మలో ఏకంగా 2000 కోట్ల బ‌డ్జెట్ ని కేటాయించ‌డం అనేది అసాధార‌ణ ప‌రిణామం. మ‌రోవైపు ఎస్.ఎస్.రాజ‌మౌళి `రామాయ‌ణ‌` ఏకంగా 1300 కోట్లు పైబ‌డిన బ‌డ్జెట్ తో వార‌ణాసి చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌డం మ‌రో అద్భుతంగా ప‌రిగ‌ణించాల్సి ఉంది.

అయితే భార‌త‌దేశం నుంచి భారీ చిత్రాలు అంతర్జాతీయ స్థాయిని లక్ష్యంగా చేసుకుని తెర‌కెక్కుతుంటే చైనా, కొరియా వంటి దేశాలు కూడా వేల కోట్ల రూపాయలతో విజువల్ వండర్స్‌ను నిర్మిస్తున్నాయి. ఇటీవ‌ల భారీత‌నం నిండిన‌ చైనీ సినిమాల బ‌డ్జెట్లు వేల కోట్లుగా చెబుతున్నారు. అయితే ఈ పోటీలో భాగంగా సౌదీ అరేబియా హాలీవుడ్ స్టార్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం `డెసర్ట్ వారియ‌ర్` బాక్సాఫీస్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచి ప్రపంచ రికార్డు సృష్టించింది.

సౌదీ మీడియా దిగ్గజం ఎంబీసీ గ్రూప్ నిర్మించిన `డెసర్ట్ వారియర్` చిత్రం భారీ కాస్టింగ్ తో రూపొందినా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫ‌ల‌మైంది. సుమారు 150 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.1400 కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 6 కోట్లు (665కే డాల‌ర్లు) మాత్రమే వసూలు చేయగలిగింది. అంటే పెట్టిన పెట్టుబడిలో 0.4 శాతం కూడా తిరిగి రాకపోవడం తీవ్రమైన నిరాశ‌ను మిగిల్చింది. ప్ర‌పంచ సినిమా చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ఏకంగా 99.6 శాతం నష్టాన్ని చవిచూడటం ద్వారా చలనచిత్ర చరిత్రలోనే `బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఫ్లాప్`గా ఈ సినిమా రికార్డుల్లో నిలిచింది.

`రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్` ఫేం, ప్రముఖ దర్శకుడు రూపెర్ట్ వ్యాట్ దర్శకత్వంలో 7వ శతాబ్దపు అరేబియా నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించారు. మార్వెల్ కొత్త `కెప్టెన్ అమెరికా` ఫేం ఆంథోనీ మాకీ కథానాయకుడిగా నటించగా ఆస్కార్ విజేత బెన్ కింగ్‌స్లీ కీలక పాత్ర పోషించారు. భారీ సెట్లలో ప్రతిరోజూ 500 మందికి పైగా సిబ్బందితో జరిగిన సుదీర్ఘ చిత్రీకరణ.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో బ్రేక్ షూట్లతో తిప్ప‌లు.. అలాగే నటీనటుల భారీ పారితోషికాల వల్ల కూడా ఈ సినిమా బడ్జెట్ అదుపు తప్పి రూ.1400 కోట్లకు చేరుకుంది. నిర్మాణ పనులకే రెండేళ్ల సమయం పట్టడం సినిమాపై ఉన్న ఆసక్తిని తగ్గించింది.

అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 2026లో విడుదలైన ఈ సినిమాకు అమెరికాలో కూడా దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. చివరకు సొంత దేశమైన సౌదీ అరేబియాలో సైతం ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించడం గమనార్హం. అక్కడ కేవలం ఎనిమిదో స్థానానికి పరిమితమై కేవలం రూ. 80 లక్షలు (87కే డాల‌ర్లు) మాత్రమే రాబట్టింది. సినిమా విడుదలలో జరిగిన జాప్యం.. హీరో ఆంథోనీ మాకీ ప్రచారానికి దూరంగా ఉండటం.. మార్కెటింగ్ వైఫల్యాలు ఈ భారీ చిత్రానికి శనిలా దాపురించాయి.

కేవలం ఆర్థికంగా న‌ష్టాలే కాదు... సమీక్షల పరంగా కూడా ఈ సినిమా తీవ్ర‌ విమర్శల పాలైంది. ప్రముఖ వెబ్‌సైట్ `రాటెన్ టొమాటోస్` కేవలం 28 శాతం రేటింగ్ ఇవ్వ‌డం అతి పెద్ద నిరాశ‌. కథలో పస లేకపోవడం.. నెగటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సినిమా ఘోర ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఈ సినిమా ఫ‌లితం చూశాక‌.. భారీ బడ్జెట్ ఉన్నంత మాత్రాన విజయం వరించదని.. సరైన కథ, కాన్ ఫ్లిక్ట్, భావోద్వేగాల‌ను పండించే ఎలిమెంట్స్ వీటికి తోడు ప్రచారం లేకుంటే రూ. 1400 కోట్ల సినిమా కూడా ఇంత‌టి డిజాస్ట‌ర్ అవుతుంద‌ని `డిసర్ట్ వారియర్` ప్రపంచానికి గుణపాఠం నేర్పింది.

Tags:    

Similar News