ప్రభాస్ కంటే నేనే గొప్పంటున్న దీపిక

స్పిరిట్ సినిమాకు మొదట కథానాయికగా ఎంపికైన దీపిక పదుకొనే.. తర్వాత ఆ సినిమా నుంచి తప్పుకోవడం మీద దాదాపు రెండేళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2026-08-28 02:59 GMT

స్పిరిట్ సినిమాకు మొదట కథానాయికగా ఎంపికైన దీపిక పదుకొనే.. తర్వాత ఆ సినిమా నుంచి తప్పుకోవడం మీద దాదాపు రెండేళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మధ్యలో గొడవ సద్దుమణిగినట్లే కనిపించినా.. ఇటీవల ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ప్రణయ్ రెడ్డి వంగ (సందీప్ రెడ్డి సోదరుడు) ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో మళ్లీ అగ్గి రాజుకుంది. దీపిక సినిమా లాభాల్లో పది శాతం వాటా కింద అడిగిందని.. ఇంకా కొన్ని కండిషన్లు పెట్టిందంటూ అతను చెప్పాడు. దీంతో సోషల్ మీడియాలో మరోసారి దీపిక మీద నెటిజన్లు విరుచుకుపడ్డారు.

అలా అని దీపిక టీం కూడా ఏమీ తగ్గలేదు. తన పీఆర్ టీంను, జర్నలిస్టులను సందీప్ అండ్ టీమ్ మీద దీపిక ఉసిగొల్పి ఎటాక్ చేయించినట్లు సోషల్ మీడియా పోస్టులను బట్టి చూస్తే అర్థమైంది. ఐతే దీపిక ఈ వ్యవహారాన్ని అంతటితో వదిలిపెట్టట్లేదు. తాజాగా ఒక కార్యక్రమంలో దీపిక.. ‘స్పిరిట్’ టీం మీద పరోక్షంగా విమర్శలు గుప్పించింది.

ఫిలిం ఇండస్ట్రీలో పురుషులు, మహిళల మధ్య పారితోషకాల్లో అంతరం గురించి ఆమె మాట్లాడుతూ.. ఒక సినిమా విషయంలో ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. ఆ సినిమాలో నటిస్తున్న స్టార్ హీరోకు టీం ఒక పారితోషకాన్ని ఫిక్స్ చేశారని.. ఆ నంబర్ ఎంత అన్నది తనకు తెలుసని.. కానీ ఆ హీరో కంటే తాను ఎక్కువ సక్సెస్ ఫుల్ అని తాను భావిస్తానని.. అతడి కంటే ఎక్కువ సినిమాల్లో నటించానని దీపిక పేర్కొంది. కాబట్టి తనకు ఇంత పారితోషకం ఇవ్వాలని అని కోట్ చేయగా.. తాము హీరోకు ఇంత డబ్బులు ఇస్తున్నామని, నీకివ్వడానికి మా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పారని దీపిక వెల్లడించింది. దీంతో సరే అని తాను ఆ సినిమా నుంచి తప్పుకున్నానని దీపిక చెప్పింది.

ఆ సినిమా పేరేదో చెప్పండి అంటే తాను అలా చెప్పే రకం కాదని దీపిక అంది. పారితోషకాల విషయంలో హీరోయిన్లు ఎందుకు మరి పట్టుదలగా ఉండరు అని అడిగితే.. అవకాశం పోతుందనే భయంతో రాజీ పడతారని దీపిక పేర్కొంది. ఐతే ఈ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో గట్టిగానే వ్యతిరేకత వస్తోంది. స్పిరిట్ అని పేరు చెప్పకపోయినా.. ఆమె మాట్లాడింది ‘స్పిరిట్’ సినిమా గురించే అన్నది స్పష్టం. ప్రభాస్ కంటే తానే పెద్ద స్టార్, తన మార్కెటే ఎక్కువ అన్నట్లు దీపిక మాట్లాడ్డంతో రెబల్ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు ఆమె మీద మండిపడుతున్నారు.

Tags:    

Similar News