మీరేంటి నాకు నేర్పించేది? కల్కి మేకర్స్‌పై దీపిక పరోక్షంగా విసుర్లు!
ఇప్పుడు భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న రెండు భారీ పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశాలను కోల్పోయింది.;
ప్రభాస్ సరసన బ్యాక్ టు బ్యాక్ రెండు అవకాశాల్ని కోల్పోయింది దీపిక పదుకొనే. సందీప్ వంగా తెరకెక్కించే స్పిరిట్ నుంచి తొలగించిన తర్వాత, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ రూపొందిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'కల్కి 2898 ఏడి' సీక్వెల్ నుంచి తొలగిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ రెండూ దీపికకు ఊహించని బ్లో. కెరీర్ సాఫీగా సాగుతున్న ఈ సమయంలో ఇది ఊహించనిది. ఓవైపు రణ్ వీర్ సింగ్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. అదే సమయంలో దీపిక తలపెట్టిన ఇతర వ్యాపారాలు కూడా లాభాల్లేక చతికిలబడ్డాయని వార్తలు వచ్చాయి.
ఇప్పుడు భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న రెండు భారీ పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశాలను కోల్పోయింది. ఇది సహజంగానే దీపిక మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీపిక మామ్ అయ్యాక సెట్లో 6 గంటలు మించి సహకరించలేని పరిస్థితి ఉందని చెప్పింది. ఎనిమిది గంటల పనిదినాన్ని వ్యతిరేకించింది. పైగా షూటింగులకు మేకర్స్ ఆశించిన విధంగా సహకరించేందుకు కూడా ఏమాత్రం సుముఖంగా లేదని స్పిరిట్ నుంచి తొలగించిన సమయంలో ప్రచారమైంది. కానీ తాను వైజయంతి మూవీస్ లో కల్కి 2898 ఏడి సీక్వెల్ లో కొనసాగుతున్నానని దీపిక నమ్మకాన్ని వ్యక్తం చేసింది. అదే సమయంలో అల్లు అర్జున్ - అట్లీ చిత్రంలో నటిస్తూ బిజీ అయింది.
కారణం ఏదైనా ఇప్పుడు వైజయంతి సంస్థ ప్రతిష్ఠాత్మక సీక్వెల్ నుంచి దీపికను తొలగిస్తున్నట్టు ప్రకటించడం ఊహించని మలుపు. ఇది దీపికకు పెద్ద కుంగుబాటు. ``జాగ్రత్తగా పరిశీలించాక మేం ఎవరి దారిన వారు వెళ్లాలనుకున్నాం. మొదటి సినిమా కోసం చాలా దూరం కలిసి ప్రయాణించినా, మేం సరైన భాగస్వామ్యాన్ని కనుక్కోలేకపోయాం. కల్కి 2898 AD చిత్రం నిబద్ధతతో పాటు ఎన్నిటికో అర్హమైనది. ఆమె(దీపిక) భవిష్యత్ విషయంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం`` అని వైజయంతి సంస్థ ప్రకటించింది. దీపిక నిబద్ధత గురించి వైజయంతి సంస్థ సూటిగానే పంచ్ వేసింది.
అయితే ఈ ప్రకటన వెలువడిన 48 గంటల్లోపు దీపిక స్పందించలేదు. అదే సమయంలో షారూఖ్ తో సిద్ధార్థ్ ఆనంద్ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని ధృవీకరిస్తూ కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడు తన ఇన్‌స్టాలో తొలి పోస్ట్ లో దీపిక గుంబనగా మాట్లాడింది. దాదాపు 18 సంవత్సరాల క్రితం ఓం శాంతి ఓం చిత్రీకరణ సమయంలో షారుఖ్ ఖాన్ నుండి నేర్చుకున్న పాఠం గురించి దీపిక వల్లించింది. ``ఒక సినిమా తీసే అనుభవం.. ఆ సినిమా చేసే వ్యక్తులు, దాని విజయం కంటే చాలా ముఖ్యం. నేను అంతకుమించి అంగీకరించలేను. అప్పటి నుంచి నేను ఇదే నియమాన్ని అనుసరిస్తున్నాను`` అని క్రిప్టిక్ పోస్ట్‌తో ఆశ్చర్యపరిచింది. కల్కి విజయం గురించి కాదు.. సినిమా కల్కి టీమ్ గురించి, వారితో తన అనుభవం గురించి దీపిక పదుకొనే ప్రస్థావించిందా? అనే అనుమానం రేకెత్తించేలా మాట్లాడింది. దీపిక మొదటి నుంచి ఇదే పంథాలో ఉంది. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లు విధానాన్ని అనుసరిస్తున్నానని స్పష్ఠంగా చెప్పకనే చెప్పింది. ప్రభాస్ లాంటి ఇండియా బిగ్గెస్ట్ హీరోనే కాదని అనుకుంది. తన పద్ధతిని మార్చుకునేందుకు సిద్ధంగా లేనని స్పష్ఠంగా చెబుతోందని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.