క్రేజీ కల్యాణం రివ్యూ

Update: 2026-10-16 04:34 GMT

'క్రేజీ కళ్యాణం' మూవీ రివ్యూ

నటీనటులు: అనుపమ పరమేశ్వరన్ - నరేష్ వీకే - తరుణ్ భాస్కర్ - అఖిల్ రాజ్- కిరీటి తదితరులు

సంగీతం: సురేష్ బొబ్బిలి

ఛాయాగ్రహణం: శ్యామ్ దూపాటి

నిర్మాత: బూసం జగన్ రెడ్డి

రచన - దర్శకత్వం: భద్రప్ప గాజుల

గత ఏడాది ‘పరదా’ అనే సీరియస్ లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మలయాళ అమ్మాయి అనుపమ పరమమేశ్వరన్. అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఇప్పుడామె తెలంగాణ పెళ్లి బ్యాక్ డ్రాప్ లో ‘క్రేజీ కళ్యాణం’ అనే ఎంటర్టైనర్ చేసింది. దసరా కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుపమకు ఎలాంటి ఫలితాన్నిచ్చేలా ఉందో చూద్దాం పదండి.

కథ:

పర్వతాలు (నరేష్)కు ఇద్దరు కూతుళ్ళు. తన అన్న మాట విని ఇల్లరికం తెచ్చుకున్న పెద్దల్లుడు బాలరాజు (తరుణ్ భాస్కర్) తాగుబోతుగా.. తిరుగుబోతుగా ఊళ్ళో బాగా చెడ్డపేరు తెచ్చుకుంటాడు. దీంతో తన చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్)కి అయినా బాగా డబ్బున్న మంచి సంబంధం తేవాలని చూస్తాడు పర్వతాలు. ఐతే స్వతంత్ర భావాలు కలిగిన కీర్తి.. తనతో పాటు చదువుకున్న ఉదయ్ (అఖిల్ రాజ్)ని ప్రేమిస్తుంది. పర్వతాలు మాత్రం తన అన్న కూతురికి వచ్చిన సంబంధాన్ని చెడగొట్టి మరీ.. ఆ సంబంధమే కీర్తికి కుదిరేలా చేస్తాడు. మరి కీర్తి తండ్రి మాటను అనుసరించి ఆ పెళ్ళి చేసుకుందా.. తన కలలు ఏమయ్యాయి.. ఆమె ప్రేమించిన వాడి సంగతేంటి.. చివరికి ఈ పెళ్ళి వ్యవహారం ఏ మలుపు తిరిగింది.. అన్నది తెరపై చూడాల్సిందే.

కథనం - విశ్లేషణ:

సమాజంలో ఎంత ఆధునికత సంతరించుకున్నా.. ఆడపిల్లల విషయంలో ఆలోచనలు ఎంతగా మారినా.. ఇప్పటికీ వాళ్లను గుండెల మీద బరువులాగే భావించే కుటుంబాలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. ఒక వయసు రాగానే తల్లిదండ్రుల ఆలోచనలు వారి పెళ్ళి చుట్టూ తిరుగుతుంటాయి. ఆడపిల్ల పెళ్ళిని ప్రతిష్ఠాత్మకంగా భావించి అందుకోసం ఎంతదూరం అయినే వెళ్లే కుటుంబాలు ఎన్నో. ఐతే ఆడపిల్ల అంటే బరువు కాదు.. కుటుంబానికి గర్వకారణం అని చెప్పే ప్రయత్నం జరిగింది ‘క్రేజీ కళ్యాణం’లో. వాళ్ల పెళ్లి కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యే తల్లిదండ్రులు.. ఆ డబ్బులో కొంత వారి చదువు కోసం పెడితే.. వారి మనసును అర్థం చేసుకుని ప్రవర్తిస్తే సమాజంలో గొప్ప మార్పును చూస్తామంటూ మంచి సందేశాన్నే ఇచ్చారీ చిత్రంలో. కానీ ఈ సందేశం బాగున్నా.. కొంతమేర వినోదం.. కొంత వరకు ఎమోషన్లు పండినా.. పూర్తి స్థాయిలో ప్రేక్షకులను రంజింపజేయడంలో ‘క్రేజీ కళ్యాణం’ విఫలమైంది.

హీరోయిన్ బాగా చదివి జాబ్ చేసి ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. కానీ పేరెంట్స్ బాగా డబ్బున్న అబ్బాయికి మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటారు. ఈ కాన్ఫ్లిక్ట్ నేపథ్యంలో తెరపై చాలా కథలు చూశాం. ఐతే ఈ పాయింటు మీద కొంచెం క్రేజీగా ఉండే మలుపులతో ‘క్రేజీ కళ్యాణం’ను నడిపించాలని చూశాడు దర్శకుడు భద్రప్ప గాజుల. కానీ ఈ సినిమాను క్రేజీగా మార్చే కథనం అయితే ఇందులో మిస్సయింది. తరుణ్ భాస్కర్ పాత్రతో చేయించిన కామెడీ.. వీకే నరేష్ క్యారెక్టర్ ద్వారా పండించిన ఎమోషన్ కొంత వరకు క్లిక్ అయినా.. మిగతా వ్యవహారమంతా బోరింగ్ గా తయారైంది. మధ్యతరగతి కుటుంబాలు బాగా రిలేట్ చేసుకునే కథాంశమే అయినా.. కథనంలో ఆ ఎంగేజ్మెంట్ ఉండేలా సరైన సిచువేషన్లు.. సన్నివేశాలు క్రియేట్ చెయ్యలేక పోవడం 'క్రేజీ కళ్యాణం'కి ప్రతికూలతగా మారింది.

'క్రేజీ కళ్యాణం' ఆరంభంలో పాత్రల పరిచయంతో కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది. బాలరాజు పాత్రలో తరుణ్ భాస్కర్ పంచే వినోదం కొంత నవ్విస్తుంది. కానీ కీర్తి - ఉదయ్ లవ్ స్టోరీ మాత్రం రొటీన్ గా అనిపిస్తుంది. ఇక్కడే క్రేజీ కళ్యాణం ట్రాక్ తప్పుతుంది. కూతురికి ఇష్టం లేని పెళ్లి చెయ్యడానికి పర్వతాలు సిద్ధమయ్యాక అసలు కథ మొదలవుతుంది. తన అన్న కూతురుకు వచ్చిన సంబంధాన్ని తన కూతురుకు వచ్చేలా చేయడంతో ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ సమయానికి కథ రసకందాయలో పడుతుంది. సెకండ్ హాఫ్ అంతా ఆ పెళ్లిని ఆపడానికి కీర్తి చేసే పనులు.. పెళ్లి తంతు.. అందులో కొన్ని సంఘటనలతో చాలా మామూలుగా సాగిపోతుంది క్రేజీ కళ్యాణం. పెళ్లి తప్పించుకోవడానికి కీర్తి పెద్దగా చేసేదేమీ ఉండదు. ద్వితీయార్థం మొత్తంలో నరేష్ ఎమోషనల్ సీన్ ఒకటి అద్భుతంగా పండింది. అక్కడక్కడా తరుణ్ భాస్కర్ చేసే కామెడీ వర్కౌట్ అయింది. కూతురుకి పెళ్లి చేయాలి, తండ్రి పరువు అనే ఎమోషన్స్ రొటీన్ అయిపోయాయి. చాలా సన్నివేశాల్లో ఎమోషన్స్ పెద్దగా పండలేదు. సీన్స్.. డైలాగ్స్ రొటీన్ అయిపోయాయి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ వల్ల కొంచెం వైవిద్యం వచ్చింది తప్పితే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. అఖిల్ - అనుపమ జోడీ కూడా సరిగ్గా సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. వాళ్ళ లవ్ ట్రాక్ కూడా సరిగ్గా రాసుకోలేదు. అక్కడక్కడా కొన్ని సీన్స్ తప్పితే ఓవరాల్ గా 'క్రేజీ కళ్యాణం' మెప్పించలేక పోయింది.

నటీనటులు:

కీర్తి పాత్రకు అనుపమ పరమేశ్వరన్ న్యాయం చేసింది. ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా పెర్ఫామ్ చేసింది. తన లుక్ పర్వాలేదు. సీనియర్ నటుడు నరేష్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యారు. ఆయన అవార్డ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అన్ని రకాల ఎమోషన్లను అద్భుతంగా పండించాడు. ప్రి క్లైమాక్స్ లో నరేష్ సింగిల్ టేక్ లో ఒకేసారి రకరకాల ఎమోషన్స్ చూపిస్తూ అదరగొట్టేశాడు. తరుణ్ భాస్కర్ కూడా బాగా చేశాడు. సినిమాలో నవ్వించే బాధ్యత అతనే తీసుకున్నాడు. అఖిల్ రాజ్ పర్వాలేదు. అనుపమ అక్క పాత్రలో మౌనిక బూసం కూడా బాగా నటించింది. కిరీటి.మిగతా నటీనటులు ఓకే.

సాంకేతిక వర్గం:

కెమెరామన్ శ్యామ్ దూపాటి విజువల్స్ బాగున్నాయి. సురేష్ బొబ్బిలి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. అతడి పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు అవసరం అయిన స్థాయిలో ఉన్నాయి. రైటర్ కం డైరెక్టర్ భద్రప్ప గాజుల ఎంచుకున్న పాయింట్ మెజారిటీ ప్రేక్షకులు రిలేట్ చేసుకునేదే కానీ.. కథనం మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దుకోవాల్సింది. కొంత మేర కామెడీ.. కొన్ని ఎమోషనల్ సీన్లు బాగా డీల్ చేసినా.. చాలావరకు సినిమాను రొటీన్ గా.. ఫిల్లింగ్ సీన్లతో నడిపించారు.

చివరగా: క్రేజీ కళ్యాణం..మంచి సందేశం.. మామూలు కథనం!

రేటింగ్ : 2.25/5

Tags:    

Similar News