చిరంజీవి 'MSG'.. సేఫ్ ప్లాన్ తోనే రావిపూడి బరిలోకి!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ రిలీజ్ కు రంగం సిద్ధమవుతోంది.;
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ రిలీజ్ కు రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన సినిమా విడుదల కానుండగా.. ముందు రోజు అంటే నేడు ప్రీమియర్స్ పడనున్నాయి. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉండగా.. సూపర్ హిట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి కోసం జోరుగా డిస్కస్ చేసుకుంటున్నారు. గత ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం మూవీతో వచ్చి బాక్సాఫీస్ ను ఒక్కసారిగా షేక్ చేసిన ఆయన.. ఇప్పుడు 2026లో మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో సందడి చేయనున్నారు. అయితే ఆ సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
నిజానికి.. అనిల్ రావిపూడి ఎప్పుడూ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు తీస్తుంటారు. క్రింజ్ అనే విమర్శలు వస్తున్నా.. పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటారు. లెక్కల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. షూటింగ్స్ ను తక్కువ టైమ్ లో పూర్తి చేయడమే కాకుండా.. ప్లాన్ ప్రకారం కానిస్తారు. బడ్జెట్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. దాని వల్ల నిర్మాతలకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా.. రిలీజ్ కు ముందే లాభాల్లో ఉంటారు.
రిజల్ట్ పక్కన పెట్టి.. ఎప్పుడూ సేఫ్ గేమ్ తోనే ముందుకు వెళ్లే అనిల్ రావిపూడి.. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు మూవీకి కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అవసరం లేని హంగులు, ఆర్భాటాలకు పోకుండా.. చిరంజీవి సినిమాకు గాను ఆడియన్స్ కు నచ్చే విధంగా స్టోరీని సెలెక్ట్ చేసుకున్నట్లు కనిపిస్తున్నారని ఇప్పుడు అంతా చెబుతున్నారు.
ముఖ్యంగా చిరంజీవిని ఎలా చూపించాలో అనిల్ రావిపూడికి బాగా తెలుసు. అభిమానులు ఏం కోరుకుంటారో, సాధారణ ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో అర్థం చేసుకుని సినిమాను రూపొందించారని టాక్. అందుకే సినిమా మొత్తంలో చిరంజీవి క్యారెక్టర్ చాలా సహజంగా, అభిమానులకు దగ్గరగా ఉండేలా డిజైన్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్టార్ హీరో సినిమా అంటే ఏం కావాలో తెలుసుకుని, రిస్క్ తీసుకోకుండా ముందుకు వెళ్లడమే అనిల్ రావిపూడి స్ట్రెంత్ అంటూ కొనియాడుతున్నారు. ఫ్యాన్సీ జిమ్మిక్స్, అతి ప్రయోగాల కంటే కథ, హీరో ఇమేజ్, ఎంటర్టైన్మెంట్ పై ఫోకస్ పెడతారని చెబుతున్నారు. అలా అనిల్ రావిపూడిని మాత్రం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరి ఇప్పుడు మరోసారి సేఫ్ గేమ్ తో ఆయన రూపొందించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.