హనుమాన్ జయంతి.. మెగాస్టార్ చిరంజీవి ఇంటి పూజగదిలో అద్భుతం!

ఈ అద్భుతాన్ని వివరిస్తూ చిరంజీవి గారు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ప్రతి ఏటా డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో ఈ అద్భుతం తన ఇంట్లో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.;

Update: 2026-04-02 08:24 GMT

హనుమాన్ జయంతి వేళ మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులతో ఒక మర్చిపోలేని మధుర స్మృతిని పంచుకున్నారు. తన ఇంటి పూజా మందిరంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సూర్య కిరణాలు ముద్దాడుతున్న అపురూప దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ భక్తి పారవశ్యం లో మునిగిపోతున్నారు. అసలు ఆ పూజ గదిలో ఏం జరిగింది? ఆ సూర్య కిరణాల ప్రత్యేకత ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

పూజా మందిరంలో సూర్య కిరణాల అభిషేకం:

మెగాస్టార్ చిరంజీవికి అయన కుటుంబానికి హనుమంతుడంటే ఎంత భక్తి అనేది మనందరికీ తెలిసిందే. ఎక్కువగా ఆయన కుమారుడు రాంచరణ్, అలాగే తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆంజనేయుడి గురించి పలు సందర్భాలలో చెప్పటం మనం విన్నాం..ఇక అయితే ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన తన నివాసంలోని పూజా గదిలో చోటు చేసుకున్న ఒక వింతను ప్రపంచానికి చూపించారు. సూర్య భగవానుడి కిరణాలు నేరుగా వచ్చి ఆయన ఇలవేల్పు అయిన హనుమంతుడి విగ్రహాన్ని తాకడం విశేషం. ఆ కిరణాలు కూడా మామూలుగా కాకుండా సప్త వర్ణాలుగా (రెయిన్బో కలర్స్) మారి స్వామివారిని పై నుంచి కింద వరకు స్పృశిస్తున్న తీరు చూస్తుంటే ఏదో ఒక దైవిక శక్తి అక్కడ ఉన్నట్లు అనిపిస్తోంది.

అయోధ్య రామలల్లాను గుర్తు చేసిన దృశ్యం:

ఈ అద్భుతాన్ని వివరిస్తూ చిరంజీవి గారు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ప్రతి ఏటా డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో ఈ అద్భుతం తన ఇంట్లో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇది చూస్తుంటే మనకు ఇటీవల అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్య కిరణాలు పడి 'సూర్య తిలకం'గా మారిన సన్నివేశం గుర్తొస్తుంది. అలాగే అరసవల్లి, కోణార్క్ వంటి పురాతన ఆలయాల్లో సూర్య కిరణాలు గర్భగుడిలోని దైవాన్ని తాకడం మనం వింటుంటాం, కానీ ఇప్పుడు స్వయంగా చిరంజీవి ఇంట్లోనే ఇలా జరగడం విశేషం.

వైరల్ అవుతున్న మెగాస్టార్ భక్తి వీడియో:

చిరంజీవి ఈ వీడియోను 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా షేర్ చేయగానే అది క్షణాల్లో వైరల్ అయిపోయింది. "మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు.. నా ఇలవేల్పు హనుమంతుడిని ఇలా పూజించడం నా పూర్వజన్మ సుకృతం" అని చిరు భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి గారికి ఆ ఆంజనేయ స్వామి మీద ఉన్న అపారమైన భక్తికి ప్రతిఫలంగానే ప్రకృతి ఇలా స్పందించిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

చిరంజీవి గారికి ఆధ్యాత్మిక విషయాలపై ఉన్న మక్కువ మనకు తెలిసిందే. షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా ఆయన పూజా కార్యక్రమాలకు సమయం కేటాయిస్తుంటారు. తాజాగా జరిగిన ఈ అద్భుతం మెగా కుటుంబానికే కాకుండా, ఆయన అభిమానులకు కూడా పెద్ద బూస్ట్ ఇచ్చింది. ప్రకృతి సహకరించిన ఈ ఆధ్యాత్మిక దృశ్యం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఏది ఏమైనా మెగాస్టార్ ఇంట్లో జరిగిన ఈ వింత నిజంగానే ఒక 'మిరాకిల్' అని చెప్పక తప్పదు..


Tags:    

Similar News