రియల్ టు రీల్.. మెగాస్టార్ ఫ్యాన్స్ రాకతో..
అయితే సినిమాలోని టెర్రస్ సీన్ మాత్రం ఇప్పటికీ ప్రత్యేకంగా గుర్తుండిపోయే సన్నివేశాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఆ సన్నివేశంలో ప్రకాష్ రాజ్, మోహన్ లాల్ ను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తారు.
సినిమాల్లో కనిపించే కొన్ని సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అవి దర్శకుల రైటింగ్ లోనే పుట్టాయని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో నిజ జీవితంలో జరిగిన సంఘటనలే సిల్వర్ స్క్రీన్ పై కొత్త రూపంలో కనిపిస్తాయి. అలాంటి ఆసక్తికరమైన సంఘటనే దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఇద్దరు సినిమాలో చోటుచేసుకుందని సినీ ప్రియులు అప్పుడప్పుడు చెబుతుంటారు. ఇప్పుడు అదే నిజమని తెలిసింది.
మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. షూటింగ్ స్పాట్ అయినా, ఏ ఈవెంట్ అయినా చిరంజీవిని ఒకసారి చూసేందుకు గంటల తరబడి ఎదురు చూసే అభిమానులు వేల సంఖ్యలో కనిపిస్తుంటారు. ఫ్యాన్స్ కు చిరంజీవి చేతులు ఊపుతూ అభివాదం చేయడం కూడా ఎన్నోసార్లు కనిపించిన దృశ్యమే.
అలాంటి ఓ సందర్భమే మణిరత్నం సినిమాలోని కీలక సన్నివేశానికి ఇన్స్పిరేషన్ గా మారిందని ప్రచారం ఉంది. తమిళ సినీ, రాజకీయ రంగాల్లో ప్రముఖులైన ఎంజీఆర్, కరుణానిధి జీవితాల ఆధారంగా మణిరత్నం తెరకెక్కించిన చిత్రం ఇద్దరు. ఆ సినిమాలో మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక డిజాస్టర్ గా నిలిచింది.
అయితే సినిమాలోని టెర్రస్ సీన్ మాత్రం ఇప్పటికీ ప్రత్యేకంగా గుర్తుండిపోయే సన్నివేశాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఆ సన్నివేశంలో ప్రకాష్ రాజ్, మోహన్ లాల్ ను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తారు. తాను ఓ సినిమా నటుడినని, రాజకీయాల్లోకి రావడం ఎలా సాధ్యమని మోహన్ లాల్ సందేహం వ్యక్తం చేస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు నడుస్తుండగా కింద పెద్ద ఎత్తున ప్రజలు కనిపిస్తారు.
ఆ తర్వాత మోహన్ లాల్ అభిమానులకు అభివాదం చేయగానే అక్కడి ప్రజలు ఓ రేంజ్ లో సంబరాలు చేసుకుంటారు. ప్రజల్లో నీకు ఉన్న ఈ రెస్పాన్స్ చూస్తే రాజకీయాల్లోకి వస్తే చరిత్ర సృష్టిస్తావంటూ ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్ తో ఆ సన్నివేశం ముగుస్తుంది. అయితే ఆ సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి అభిమానులే ఇన్స్పిరేషన్ గా నిలిచారనే విషయం అప్పట్లో చర్చనీయాంశమైంది.
తిరుపతిలో చిరంజీవి కోసం భారీ సంఖ్యలో అభిమానులు ఎదురు చూస్తున్న విషయాన్ని సుహాసిని డైరెక్టర్ గా చూశారట. ఆ సమయంలో ఆమె చిరంజీవితో పాటు ఉన్నట్లు సమాచారం. అభిమానుల్లో జోష్ ను, చిరంజీవిపై వారికి ఉన్న అభిమానాన్ని ఆమె తన భర్త మణిరత్నంకు వివరించగా, అదే ఫీలింగ్ ను ఇద్దరు సినిమాలో టెర్రస్ సీన్ రూపంలో ఉపయోగించుకున్నారు. సుహాసినినే ఇప్పుడు ఆ విషయం చెప్పారు.
నిజ జీవితంలో మెగాస్టార్ అభిమానులు చూపించిన ప్రేమ, అభిమానం.. సిల్వర్ స్క్రీన్ పై ఓ గుర్తుండిపోయే సన్నివేశంగా మారడం విశేషం. అయితే ఆ సీన్ ఎంతగా ప్రశంసలు అందుకున్నా, అది ఉన్న ఇద్దరు సినిమా మాత్రం ఆడియన్స్ ను అనుకున్నట్లు ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఏదేమైనా రియల్ టు రీల్ గా మారిన ఆ సంఘటన ఇప్పుడు మరోసారి ఆసక్తికర చర్చకు కారణమైంది.