ఆ జంతువుల మాంసం తిన్నట్లు చెప్పిన నటిపై తీవ్రమైన కేసులు
బాలీవుడ్ నటి అడ్డంగా బుక్ అయ్యారు. లాపతా లేడీస్ మూవీలో దేశ వ్యాప్తంగా ఓవర్ నైట్ స్టార్ డంను సొంతం చేసుకున్న నటీమణుల్లో ఛాయా కదమ్ ఒకరు.;
బాలీవుడ్ నటి అడ్డంగా బుక్ అయ్యారు. లాపతా లేడీస్ మూవీలో దేశ వ్యాప్తంగా ఓవర్ నైట్ స్టార్ డంను సొంతం చేసుకున్న నటీమణుల్లో ఛాయా కదమ్ ఒకరు. ఈ మూవీలో ఆమె నటనకు పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒక్క మూవీతో ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి వేళ.. ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు.. ఆమెను అడ్డంగా బుక్ చేశాయి. తీవ్రమైన కేసులు ఇప్పుడు బుక్ అయ్యాయి. దీంతో.. ఆమె రానున్న రోజుల్లో చట్టపరమైన చిక్కుల్ని ఎదుర్కోనున్నట్లుగా చెప్పాలి.
ఇంతకూ ఏం జరిగిందంటే.. ఇటీవల ఆమె మాట్లాడుతూ.. తాను జింక.. కుందేళ్లు.. అడవి పంది.. మానిటర్ లిజర్డ్.. ముళ్లపంది మాంసాల్ని తిన్నట్లుగా పేర్కొన్నారు. ఈ మాటలే ఆమె కొంప ముంచేలా చేశాయి. ఆమెపై వైల్డ్ లైఫ్ చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. తాను తిన్నట్లుగా చెప్పిన జంతువులన్నీ కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్టు కింద రక్షణ పొందుతున్నవే. అంటే.. అలాంటి జంతువుల మాంసాన్ని తినటం చట్టవిరుద్ధం.
అలాంటిది ఆ జంతువుల మాంసాన్ని తాను తిన్నట్లుగా చాయా కదమ్ తనకు తానే వెల్లడించటంతో ఆమె వ్యాఖ్యలపై ది ప్లాంట్ అండ్ అనిమల్ వెల్ఫేర్ సొసైటీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వారి ఫిర్యాదు మేరకు ఆమెపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్టును అనుసరించి కేసులు నమోదు చేశారు. అంతేకాదు.. ఈ కేసు విచారణ కోసం ఒక టీంను ఏర్పాటు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమా? అబద్ధమా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఆమెకు సహకరించిన వేటగాళ్లను సైతం గుర్తించే పనిలో పడ్డారు.
ఈ కేసు విచారణలో భాగంగా కదమ్ ఆచూకీ కోసం అటవీ శాఖాధికారులు ఆరా తీశారు. ఆమె ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం వేరే నగరానికి వెళ్లారని.. నాలుగు రోజుల్లో వస్తారని.. ఆ వెంటనే ఆమెను విచారణకు హాజరవుతారని చెబుతున్నారు. చట్ట విరుద్ధంగా తప్పులు చేసి ఉంటే మాత్రం కఠిన శిక్షలు ఉంటాయని అటవీ శాఖాధికారులు స్పష్టం చేస్తున్నారు. నోరు విప్పి.. కష్టాల్ని కొని తెచ్చుకోవటం అంటే ఇదే.. అంటూ నటి తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఎంత జిహ్వా చాపల్యమైతే.. మరీ ఇంత క్రూరంగా తినేయటమా? అన్నది ప్రశ్నగా మారింది. ఒకవేళ ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమని తేలితే జరిమానాతో పాటు జైలుశిక్ష పక్కా అని చెబుతున్నారు.