న‌డ‌క మార్గంలో తిరుమ‌లేశుని చెంత‌కు టాప్- 5 సెల‌బ్రిటీస్

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి సామాన్య భక్తులతో పాటు సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.

Update: 2026-07-18 03:45 GMT

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి సామాన్య భక్తులతో పాటు సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు విలాసవంతమైన వాహనాలను పక్కనబెట్టి.. ఎంతో భక్తిశ్రద్ధలతో కాలినడకన తిరుమల కొండకు చేరుకుంటున్నారు. అలిపిరి లేదా శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా నడుస్తూ వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం ద్వారా తిరుమలేశునిపై తమకున్న అపారమైన భక్తిని చాటుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఇలా నడక మార్గంలో తిరుమలకు చేరుకుని వార్తల్లో నిలిచిన టాప్-5 సెలబ్రిటీల విశేషాలు ఇవే.

ఈ జాబితాలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. తన తల్లి దివంగత అతిలోక సుందరి శ్రీదేవి లాగే జాన్వీ కపూర్‌కు తిరుమల శ్రీవారంటే ఎంతో భక్తి. ఈ యువ‌న‌టి తరచుగా తన సినిమాలు విడుదలయ్యే ముందు లేదా విడుదలైన తర్వాత స్వామివారి ఆశీస్సులు పొందేందుకు అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన... కొన్నిసార్లు పవిత్రంగా చెప్పులు లేకుండా కొండపైకి వెళ్తుంటారు. సాంప్రదాయ వస్త్రధారణలో జాన్వీ తిరుమలకు చేరుకున్న విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో పలుమార్లు వైరల్ అయ్యాయి. శ్రీవారిపై త‌న‌కున్న ఈ నిష్కల్మషమైన భక్తి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఇటీవలే తిరుమల నడక మార్గంలో ప్రత్యేకంగా నిలిచారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి `అన్నా లెజినోవా` అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. తన భర్త పవన్ కళ్యాణ్‌కు సర్జరీ విజయవంతం కావడంతో.. శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు అన్నా అలిపిరి నడక మార్గాన్ని ఎంచుకున్నారు. సాంప్రదాయబద్ధంగా దారి పొడవునా భక్తిశ్రద్ధలతో కొబ్బరికాయలు కొడుతూ ఆమె కొండపైకి చేరుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఒక డెప్యూటీ సీఎం భార్య అయినా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సామాన్య భక్తురాలిలా అన్నా లెజినోవా నడక సాగించడం విశేషం.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు తిరుమ‌ల సెంటిమెంట్ బ‌ల‌మైన‌దే. సామ్ కూడా తిరుమల నడక మార్గంలో ప్రయాణించి ప‌లుమార్లు త‌న‌ భక్తిని చాటుకున్నారు.స‌మంత న‌టించిన `మజిలీ` చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ తిరుమల కొండకు ఉన్న దాదాపు 3,500 మెట్లను కాలినడకన ఎక్కారు. ఇటీవ‌ల `మా ఇంటి బంగారం` విడుద‌ల స‌మ‌యంలోను త‌న భ‌ర్త రాజ్ నిడిమోరుతో క‌లిసి తిరుమ‌లేశుని సంద‌ర్శించారు సామ్. ఈ సెంటిమెంట్ ని ఇక‌పైనా స‌మంత కొన‌సాగించ‌నున్నారు.

అలాగే బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొణె కూడా అలిపిరి మెట్ల మార్గం ద్వారానే కాలినడకన తిరుమల కొండకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు టాలీవుడ్ యంగ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా తన మొక్కును తీర్చుకోవడానికి సాంప్రదాయబద్ధంగా కాలినడకన ప్రయాణాన్ని ఎంచుకుని... సుమారు 5 గంట‌ల స‌మ‌యం ప‌ట్టే ఈ మార్గంలో కేవలం 2.5 గంటల్లోనే కొండపైకి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ జాబితాలో యువ హీరో అక్కినేని అఖిల్, సీనియర్ నటి భాగ్యశ్రీ వంటి వారు కూడా ఉన్నారు. ఇటీవ‌ల లెనిన్ విడుద‌ల స‌మ‌యంలో త‌మ సినిమా స‌క్సెస‌వ్వాల‌ని అక్కినేని అఖిల్ బృందం మొక్కులు తీర్చుకుంది.

సెలబ్రిటీలు ఇలా నడక మార్గంలో తిరుమలకు వెళ్లడం సాధారణ భక్తులలో కూడా ఎంతో స్ఫూర్తిని నింపుతోంది. ఎంతటి హోదాలో ఉన్నా భగవంతుని ముందు అందరూ సమానమే అనే భావనను వీరి ప్రయాణం చాటిచెబుతోంది. సినిమా సక్సెస్ సాధించినప్పుడో లేదా జీవితంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందో వీరంతా కాలినడకన శ్రీవారి సన్నిధికి చేరుకుని స్వామివారి ఆశీస్సులు కోరుతుంటారు. తిరుమలేశుని పాదాల చెంతకు చేరేందుకు ఈ సెలబ్రిటీలు చూపిస్తున్న భక్తి శ్రద్ధలు నిజంగా అభినందనీయం.

Tags:    

Similar News