శ్రీను గారు ఇక రూట్ మార్చాల్సిందే?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన డైరెక్టర్ బోయపాటి శ్రీను.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎలివేషన్స్, కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో శ్రీను సృష్టించిన ప్రభంజనం అద్భుతం. అయితే కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుల అభిరుచులు కూడా మారుతున్నాయి. దశాబ్దాలుగా బోయపాటి అనుసరిస్తున్న అదే పాత ఫార్ములా ఇప్పటి ఆధునిక ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వెనుకబడుతోందనేది వాస్తవం. ఈ నేపథ్యంలో బోయపాటి శైలిని మార్చుకోవాల్సిన సమయం అస్నమైందనే చర్చ ఫిలిం సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.
ప్రస్తుత ప్రేక్షకులు కథలో సహజత్వం, పాత్రల్లో లోతు, లాజిక్‌తో కూడిన యాక్షన్‌ను ఇష్టపడుతున్నారు. విలన్‌ను ఎగరకొట్టడం, అతిశయోక్తితో కూడిన పరాక్రమాలు చూపించడం కాలం చెల్లిన పద్ధతులుగా మారుతున్నాయి. ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ల ప్రభావంతో గ్లోబల్ కంటెంట్‌ను చూస్తున్న నేటి తరం సినిమాల్లో కూడా అదే స్థాయి కథా కథనాలను ఆశిస్తోంది. ఈ మార్పును గమనించకుండా? పాత పద్ధతులకే కట్టుబడితే బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడం సవాలుగా మారుతుంది.
బోయపాటి శ్రీను సినిమాల్లో ప్రత్యేకమైన ఉద్వేగం ఉంటుంది. కానీ ఆ ఉద్వేగం కథాంశం కంటే యాక్షన్ సీక్వెన్స్‌లకే పరిమితం కావడం ఆయన సినిమాల్లో ప్రధాన బలహీనతగా మారతోంది. దర్శకుడిగా ఆయనకు అపారమైన అనుభవం ఉంది. దానిని ఇప్పుడు కొత్త తరహా కంటెంట్‌కు అనుసంధానించాలి. భావోద్వేగాలను పండించడంలో ఆయనకు ఉన్న నేర్పును యాక్షన్ ఎలిమెంట్స్‌తో సమపాళ్లలో కలిపితే ఖచ్చితంగా కొత్త రకమైన బోయపాటి మార్క్ సినిమా పుట్టుకొస్తుంది.
ప్రస్తుతం పరిశ్రమలో రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంటి దర్శకులు కంటెంట్ పరంగా ప్రయోగాలు చేసి గ్లోబల్ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నారు. అదే సమయంలో మాస్ హీరోలను కూడా వినూత్నంగా చూపించ గలుగుతున్నారు. బోయపాటి కూడా అదే బాటలో ప్రయాణించి పాత ఇమేజ్‌ని పక్కన పెట్టి డిఫరెంట్ స్క్రిప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలి. ఆయనలోని మాస్ పల్స్ ని కోల్పోకుండా? ఆధునికతను జోడిస్తే అది ప్రేక్షకులకు కొత్త విందు అవుతుంది.
దర్శకుడు కెరీర్‌లో ఎప్పుడూ ఒకే విధమైన పంథాలో వెళ్తే? అది ఒకానొక దశలో విసుగు తెప్పిస్తుంది. బోయపాటి కూడా ఆ దశలోనే ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే మారిన ట్రెండ్‌ను పట్టుకోవాలంటే ఆయన మేకింగ్ స్టైల్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసుకోవాలి. ఒక కొత్త జోనర్‌ను టచ్ చేయడం లేదా కమర్షియల్ ఎలిమెంట్స్‌ను మరింత అర్థవంతంగా చెప్పడం ద్వారా ఉనికిని చాటుకోవచ్చు. లేని పక్షంలో? ఈ గ్యాప్ మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు .
బోయపాటి శ్రీను లాంటి ప్రతిభావంతుడైన దర్శకుడు శైలిని మార్చుకోవడం అంటే తనని తాను మరొకసారి ఆవిష్కరించుకోవడమే. మార్పు అనేది ప్రతి కళాకారుడికి అవసరం. ఆయన తన అనుభవాన్ని, కొత్త ఆలోచనలతో జత చేస్తే ఖచ్చితంగా మరొక మాస్టర్ పీస్ అందించగలరు. పాత పంథాను వీడి మారుతున్న కాలానికి తగ్గట్టుగా రూట్ మార్చడమే ఆయనకున్న ఏకైక పరిష్కారం.