వాటర్ బాటిల్స్ ఖర్చుతో ఓ చిన్న సినిమా తీయొచ్చు
సినీ ప్రపంచం కేవలం రంగుల మయం మాత్రమే అని ఇండస్ట్రీలో ఉండే ఎవరిని అడిగినా చెప్తారు. ఇండస్ట్రీలో ఉండే ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.;
సినీ ప్రపంచం కేవలం రంగుల మయం మాత్రమే అని ఇండస్ట్రీలో ఉండే ఎవరిని అడిగినా చెప్తారు. ఇండస్ట్రీలో ఉండే ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. కొందరు ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో కష్టాలు పడుతుంటే, మరికొందరు ఇండస్ట్రీలో కొనసాగడానికి కష్టాలను బయటకు చెప్పుకోలేక ఇంకా ఇబ్బంది పడుతుంటారు. ఇవన్నీ చూసి ఇండస్ట్రీలో అందరికంటే నిర్మాతలే పనే బావుంటుందనుకుంటారు చాలా మంది. కానీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఉండటమన్నంత నరకం మరోటి ఉండదు. ఎటు నుంచి ఏ సమస్య వస్తుందో తెలియక ప్రతీ క్షణం టెన్షన్ పడుతూనే ఉంటారు నిర్మాతలు. కేవలం డబ్బు ఒక్కటే ఉంటే నిర్మాతలు కాలేరు, ఎంతో ఓర్పు, సహనం కూడా కావాలి. ఎలాంటి సిట్యుయేషన్ ను అయినా ఫేస్ చేసే గట్స్ ఉండాలి. అలాంటి వాళ్లే సినీ నిర్మాణానికి కరెక్ట్.
అయితే అంత కష్టపడి సినిమా తీస్తే ఆఖరికి అది హిట్ అవుతుందని గ్యారెంటీ ఉండదు. కొన్నిసార్లు ఊహించిన దానికంటే బడ్జెట్ పెరిగిపోయి, సినిమాను పూర్తి చేయడానికి కొత్తగా అప్పు చేయాల్సి వస్తుంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన బోనీ కపూర్ కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నట్టు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఫుట్ బాల్ కోచ్ కథ ఆధారంగా తెరకెక్కిన మైదాన్
బోనీ కపూర్ నిర్మాతగా వచ్చిన ఆఖరి సినిమా మైదాన్. హైదరాబాద్ కు చెందిన ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ లైఫ్ స్టోరీ ఆధారంగా మైదాన్ రూపొందింది. అజయ్ దేవగణ్ హీరోగా అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం మైదాన్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
ముందే 70% షూటింగ్ పూర్తి
మైదాన్ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ రూ.120 కోట్లు. కానీ అది సినిమా పూర్తయ్యే నాటికి రూ.210 కోట్లు అయింది. కరోనాకు ముందే మైదాన్ షూటింగ్ 70% ఫినిష్ అయిందట. కానీ 2020 మార్చిలో ఫుల్ బాల్ మ్యాచ్‌లకు సంబంధించిన కొన్ని సీన్స్ ను షూట్ చేయాలని విదేశాల నుంచి ఇంటర్నేషనల్ టీమ్స్ ను రప్పించామని, ఈ లోపు లాక్ డౌన్ రావడంతో వారందరినీ ముంబైలో ఉంచాల్సి వచ్చిందని చెప్పారు బోనీ కపూర్.
రోజూ సెట్స్ లో 800 మంది
ఆ తర్వాత మ్యాచ్ లు జరిగే సమయంలో రోజూ సెట్స్ లో 800 మంది వరకు ఉండేవారని, వారందరికీ తాజ్ హోటల్ నుంచి ఫుడ్ తెప్పించే వాడినని చెప్పారు బోనీ కపూర్. కోవిడ్ లో ఉన్న రూల్స్ వల్ల అందరూ ఒకే సారి భోజనాలు చేయడం కుదిరేది కాదని, దాని కోసం ఎక్కువ టెంట్లు వేయించామని, కోవిడ్ నుంచి జాగ్రత్తగా ఉండటానికి నాలుగు అంబులెన్సులు, డాక్టర్లను పక్కనే ఉంచుకున్నామని, ఇంకా చెప్పాలంటే వాటర్ బాటిల్స్ కోసమే సపరేట్ బడ్జెట్ ను కేటాయించామని, ఆ డబ్బుతోనే ఓ చిన్న సినిమా తీయొచ్చన్నారు బోనీ కపూర్. ఆ తర్వాత కొన్ని సీన్స్ షూట్ చేయడానికి బ్యాంకాక్ వెళ్తే అక్కడ కూడా ఖర్చు పెరిగిపోయిందని, ముంబైలో స్టేడియం కోసం సెట్ వేస్తే అది తుఫానుకి కొట్టుకుని పోయిందని.. ఇలా మైదాన్ సినిమాకు ఒకదానికి ఒకటి ఊహించని విధంగా ఖర్చులొచ్చాయని, అనుకున్న దాని కంటే అక్షరాలా రూ.90 కోట్లు బడ్జెట్ ఎక్కువైందని, ఇంత చేసినా సినిమా ఫ్లాప్ గా నిలిచిందని, మైదాన్ ఆశించిన రిజల్ట్ ను ఇవ్వకపోవడంతో కొందరు తమ రెమ్యూనరేషన్ ను 15% తగ్గించుకున్నారని, అయితే ఇందులో ఎవరినీ నిందించలేమని బోనీ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు.