చివరి నిమిషంలో హీరోల హ్యాండ్.. నిర్మాత‌ల‌కు కోట్లలో కోలుకోలేని దెబ్బ‌!

సినిమా పరిశ్రమలో ఒక ప్రాజెక్ట్ పట్టాలెక్కడం వెనుక ఎందరో వ్యక్తుల కష్టం దాగి ఉంటుంది.

Update: 2026-05-26 04:30 GMT

సినిమా పరిశ్రమలో ఒక ప్రాజెక్ట్ పట్టాలెక్కడం వెనుక ఎందరో వ్యక్తుల కష్టం దాగి ఉంటుంది. ఎన్నో నెలల- సంవత్సరాల త‌ర‌బ‌డి చర్చల తర్వాత అంతా సిద్ధమై మరో మూడు రోజుల్లోనో లేదా వారంలోనో సెట్స్ పైకి వెళుతుందనగా కొందరు స్టార్ హీరోలు అకస్మాత్తుగా సినిమా నుండి తప్పుకోవడం పరిశ్రమల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన సంద‌ర్భాలున్నాయి. కథానాయకులు చివరి నిమిషంలో ఇచ్చే ఇటువంటి షాక్‌ల వల్ల నిర్మాతలు కోట్లాది రూపాయల బడ్జెట్‌ను నష్టపోవడమే కాకుండా.. ఆ ప్రాజెక్ట్‌ను నమ్ముకున్న వందలాది మంది దినసరి కార్మికులు, సాంకేతిక నిపుణులు ఉపాధి కోల్పోయే ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయి.

ఇటీవల బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్‌వీర్ సింగ్ ప్రతిష్టాత్మక చిత్రం `డాన్ 3` నుండి అకస్మాత్తుగా తప్పుకోవడం ఉత్తరాది సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఆకస్మిక ఎగ్జిట్ వల్ల దర్శకనిర్మాత ఫరాన్ అక్తర్ సుమారు 45 కోట్ల రూపాయల భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పటికే షూటింగ్ సెటప్ అంతా సిద్ధం చేయడం వల్ల రణ్‌వీర్ చివ‌రి నిమిషంలో వైదొల‌గ‌డం వ‌ల్ల కెమెరామెన్లు, స్పాట్ బాయ్స్, ఇతర టెక్నీషియన్లు అందరూ ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోయారని ఫ‌ర్హాన్ ఆరోపిస్తున్నారు. మూడు సంవత్సరాలుగా ఎంతోమంది కష్టపడి రూపుదిద్దిన ప్రాజెక్ట్‌ను ఇలా వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిబంధనల కంటే ఏ స్టార్ కూడా ఎక్కువ కాదంటూ సీరియ‌స్ అయ్యాడు. అయితే ఇది భార‌తీయ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఒక ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇంకా చాలా ఉన్నాయి.

ఉత్తరాదినే కాకుండా.. దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో (టాలీవుడ్) ఎంతో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో లాంచింగ్ జరుపుకున్న చిత్రాలు.. ఆ తర్వాత స్టార్ హీరోలతో ద‌ర్శ‌కుడు లేదా నిర్మాత‌ల విభేధాల కార‌ణంగా ఆగిపోయిన సినిమాలున్నాయి. ఫ‌ర్హాన్ స్థాయిలో ప్రీప్రొడ‌క్ష‌న్ కే 45 కోట్లు ఖ‌ర్చు చేయ‌క‌పోయినా కానీ స‌ద‌రు సినిమాల నిర్మాత‌ల‌కు అంతో ఇంతో న‌ష్టం అయితే జ‌రిగింది. మ‌న హీరోలు మ‌హేష్‌, చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్, బ‌న్ని, ఎన్టీఆర్, నాని స‌హా ఇత‌రులు నిర్మాతల ఫ్రెండ్లీ గ‌నుక అన‌వ‌స‌ర‌మైన వృథా ఖ‌ర్చులు ఉండేందుకు ఛాన్స్ లేదు. అందుకు వీళ్లు ఎవ‌రూ అవ‌కాశం క‌ల్పించ‌రు. కానీ కొన్నిసార్లు సినిమా ఆగిపోతే అయ్యే చిన్న పాటి ఖ‌ర్చులు నిర్మాత‌కు న‌ష్ట‌మేన‌నేది గమ‌నించాలి.

దక్షిణాది చిత్ర పరిశ్రమలైన టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్‌లలో ర‌క‌ర‌కాల‌ కారణాల వల్ల.. అంటే స్క్రిప్ట్ నచ్చకపోవడం... కాల్షీట్ల సమస్యలు.. సృజనాత్మక విభేదాల కారణంగా హీరోలు చివరి నిమిషంలో షూటింగ్‌కు వెళ్లకుండా హ్యాండిచ్చిన సంద‌ర్భాలున్నాయి. కొన్నిసార్లు అధికారికంగా అనౌన్స్ అయ్యాక మధ్యలోనే ఆగిపోయిన క్రేజీ ప్రాజెక్ట్‌లు ఎన్నో ఉన్నాయి. టాలీవుడ్‌లో మహేష్ బాబు, సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉండగా... చివరి నిమిషంలో కథా పరమైన విభేదాల వల్ల తప్పుకున్నారు. ఆ కథే తర్వాత అల్లు అర్జున్‌తో `పుష్ప`గా రూపాంతరం చెందింది. అయితే మ‌హేష్ ఏదైనా బౌండ్ స్క్రిప్ట్ లాక్ చేయ‌కుండా ఇత‌ర ప్రొడ‌క్ష‌న్ కోసం ఖ‌ర్చు పెట్ట‌రు గ‌నుక ఆర్థికంగా న‌ష్టం అయితే లేదు. అలాగే పవన్ కళ్యాణ్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ ఏఎమ్ రత్నం నిర్మాణంలో ఎంతో గ్రాండ్‌గా పూజ జరుపుకున్న `సత్యాగ్రాహి` సినిమా, ఎన్టీఆర్-వక్కంతం వంశీ కాంబినేషన్‌లో కళ్యాణ్ రామ్ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్‌, చ‌ర‌ణ్ - కొర‌టాల మూవీ కూడా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక స్క్రిప్ట్ అసంతృప్తి, ఇతరత్రా కారణాల వల్ల షూటింగ్ దశకు వెళ్లకుండానే నిలిచిపోయాయి. అయితే వీటికి లాంచింగ్ వ‌గైరా కార్య‌క్ర‌మాల కోసం బోలెడంత కాలం, శ్ర‌మ వృథా అయ్యాయి. ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు కూడా మిగిలింది.

తమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్) విషయానికి వస్తే.. కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ `మరుదనాయగం` బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించినా.. బడ్జెట్ ఇబ్బందుల వల్ల షూటింగ్ మధ్యలోనే ఆగిపోవడం ఒక పెద్ద ట్ర‌బుల్ గా మిగిలింది. ఇదే తరహాలో విక్రమ్ హీరోగా భారీ బడ్జెట్‌తో అనౌన్స్ అయిన పీరియాడిక్ చిత్రం `మహావీర్ కర్ణ` పూజ జరుపుకున్నా విక్రమ్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఆయన చివరి నిమిషంలో వైదొలిగారు. నిర్మాత‌ ఖ‌ర్చు పెట్టాక హీరో వైదొల‌గాల్సి వ‌చ్చింది. ఇక నటుడు శింబు కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న వివాదాల వల్ల `మహా మగడు` వంటి పలు సినిమాలు అనౌన్స్ అయి సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయాయి. మాలీవుడ్‌లో మోహన్ లాల్ భీముడిగా దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో ప్రకటించిన ప్రతిష్టాత్మక చిత్రం `ది మహాభారత` (రండమూజం) రచయిత ఎమ్.టి. వాసుదేవన్ నాయర్‌తో కోర్టు సమస్యలు-స్క్రిప్ట్ వివాదాల వల్ల నిలిచిపోగా.. యువ‌హీరో దుల్కర్ సల్మాన్ బహుభాషా చిత్రాల వల్ల ఏర్పడిన డేట్ల సమస్యలతో కొన్ని మలయాళ సినిమాలు పూజ పూర్తయినా ప్రారంభం కాలేదు.

కన్నడ చిత్ర పరిశ్రమ (శాండల్‌వుడ్) కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. రియల్ స్టార్ ఉపేంద్ర కెరీర్‌లో ఎన్నో వినూత్నమైన ఆలోచనలతో అనౌన్స్ అయిన `మహమ్మద్ బిన్ తుగ్లక్` కథలో మార్పుల వల్ల.. బడ్జెట్ సమీకరణాలు కుదరక సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. మరో అగ్ర హీరో కిచ్చా సుదీప్ సైతం కొన్ని సినిమాలకు సైన్ చేసిన తర్వాత మేకర్స్‌తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా షూటింగ్ మొదటి షెడ్యూల్ ముందే ఆయా మల్టీస్టారర్ ప్రాజెక్టుల నుండి తప్పుకున్నారు. ఇలా స్టార్ హీరోల కాల్షీట్లు.. సృజనాత్మక అభిప్రాయాలు.. నిర్మాణ వ్యయాల చుట్టూ తిరిగే సమీకరణాల వల్ల దక్షిణాదిలో ఎన్నో అద్భుతమైన కాంబినేషన్లు కేవలం ప్రకటనలకే పరిమితమై ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాయి. అయితే ఇలా అర్థాంత‌రంగా ఆగిపోతే క‌చ్ఛితంగా నిర్మాత‌కు చాలా పెద్ద న‌ష్టం వాటిల్లుతుంది. ప్రీప్రొడ‌క్ష‌న్ కోస‌మే ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల పారితోషికాల కోసం ఇత‌ర అనుమ‌తుల కోసం, హీరోల అడ్వాన్సులు ఇత‌ర‌త్రా చాలా పెద్ద మొత్తాల‌ను నిర్మాత వెచ్చిస్తారు గ‌నుక‌.. అదంతా న‌ష్ట‌పోయిన‌ట్టే.

Tags:    

Similar News