పాత పాటలు.. కొత్త హంగులు!

మరోవైపు పాత పాటలను రీమేక్ చేయడం వెనుక కాపీరైట్స్, రాయల్టీల వివాదాలు కూడా తలెత్తుతున్నాయి.

Update: 2026-06-08 08:30 GMT

కొంత‌కాలంగా బాలీవుడ్‌లో రీమిక్స్ ..రీక్రియేషన్ల ట్రెండ్ అంత‌కంత‌కు పెరిగిపోతుంది. ఒకప్పటి క్లాసిక్ హిట్స్ అయిన `చున్నరి చున్నరి`, `సందేసే ఆతే హై`, `ఊంచా లంబా కద్` వంటి పాత సూపర్ హిట్ పాటలను ఆధునిక సంగీత హంగులతో.. సరికొత్త బీట్లతో రీమిక్స్ చేసి నేటి సినిమాల్లో ప్రయోగిస్తున్నారు. ఈ ధోరణి యూట్యూబ్, రీల్స్ వేదికలపై మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబ‌డుతున్నా? దీనిపై చిత్ర పరిశ్రమలో ..సంగీత ప్రియులలో పెద్ద చర్చకు భిన్నాభిప్రాయాలకు దారి తీస్తుంది. ఈ రీమిక్స్ ధోరణిని సమర్థించే వారు ఓ వాదనను వినిపిస్తున్నారు.

పాత కాలపు అద్భుతమైన పాటలు, మెలోడీలు నేటి తరం యువతకు అంతగా పరిచయం ఉండకపోవచ్చని.. వాటిని ఆధునిక శైలిలో రీక్రియేట్ చేయడం వల్ల ఆ క్లాసిక్ సాంగ్స్ ప్రస్తుత తరానికి కూడా చేరువవుతాయని కొందరు సంగీత దర్శకులు, నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఇప్పటికే జనాదరణ పొందిన ఒక ట్యూన్‌ను ఉపయోగించడం వల్ల సినిమా ప్రమోషన్లకు ..డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌లో ఇన్‌స్టంట్ హిట్ సాధించడానికి సులువ వుతుందని భావిస్తున్నారు.

అయితే ఈ ధోరణిపై చిత్ర పరిశ్రమలోని సీనియర్ సంగీత ద‌ర్శ‌క‌.. రచయితలు .. ఒరిజినల్ కంపోజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాత పాటలను రీమిక్స్ చేసే ప్రక్రియలో అసలైన పాటలోని ఆత్మ , మెలోడీ , భావోద్వేగాలు కనుమరుగవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. కేవలం క్లబ్ డ్యాన్స్‌లకు, ఫాస్ట్ బీట్లకు అనుగుణంగా మార్చే క్రమంలో ఒరిజినల్ సాంగ్స్ క్లాసిక్ హోదా దెబ్బతింటోందని ఇది సృజనాత్మకత లేమికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.

మరోవైపు పాత పాటలను రీమేక్ చేయడం వెనుక కాపీరైట్స్, రాయల్టీల వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. అసలు పాటను సృష్టించిన మ్యూజిక్ డైరెక్టర్లు, గీత రచయితల అనుమతి లేకుండా వారికి తగిన గుర్తింపు, ఆర్థిక లబ్ధి చేకూర్చకుండా మ్యూజిక్ లేబుల్స్ హక్కులను కొనుగోలు చేసి రీమిక్స్ చేయడం నైతికంగా సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. తమ కష్టాన్ని ఇతరులు కేవలం కొన్ని మార్పులు చేసి సొమ్ము చేసుకుంటున్నారని నిన్నటితరం సృష్టికర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ చర్చల మధ్య ప్రేక్షకుల అభిరుచి కూడా రెండుగా చీలిపోతుంది. ఒక వర్గం ప్రేక్షకులు పాత పాటలను కొత్తగా వినడానికి ఇష్టపడుతుండగా, సంగీతాన్ని గాఢంగా ప్రేమించేవారు మాత్రం రీమిక్స్ పాటలను తిరస్కరిస్తున్నారు. బాలీవుడ్‌లో కొత్తదనం కొరవడిందని, విభిన్నమైన ఒరిజినల్ ట్యూన్స్ సృష్టించే ధైర్యం లేకే మేకర్స్ సేఫ్ గేమ్‌గా పాత హిట్స్ వెనుక పడుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రీమిక్స్ ట్రెండ్ అనేది తాత్కాలిక వ్యాపార సూత్రమే తప్ప కాలపరీక్షకు నిలిచే సంగీతం దీని ద్వారా రావడం లేదని విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

పరిశ్రమలో ఉన్నతమైన సంగీత సాంప్రదాయాన్ని కాపాడుకోవాలంటే రీమిక్స్‌ల కంటే సొంతంగా ఒరిజినల్ కంపోజిషన్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు ఇళ‌య‌రాజా, ఏఆర్ రెహమాన్, నదీమ్-శ్రవణ్, జతిన్-లలిత్ వంటి వారు ఇచ్చిన ఒరిజినల్ ఆల్బమ్స్ దశాబ్దాలు దాటినా ఎలా నిలిచిపోయాయో నేటి సంగీత దర్శకులు గుర్తుంచుకోవాలి. పాత పాటలను గౌరవిస్తూనే కొత్త ప్రతిభను .. వినూత్నమైన మెలోడీలను శ్రోత‌ల‌కు అందించినప్పుడే బాలీవుడ్ సంగీతానికి పూర్వ వైభవం వ‌స్తుంద‌ని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News