రణవీర్ సింగ్ షాకింగ్ నిర్ణయం.. రెండేళ్ల పాటూ మీడియాకు దూరం?
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన కొత్త సినిమా లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం కాదు.
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన కొత్త సినిమా లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం కాదు. ఇటీవల బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన డాన్3 వివాదం నేపథ్యంలో రణవీర్ తీసుకున్నట్లు చెబుతున్న నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజా నివేదికల ప్రకారం, రణవీర్ సింగ్ దాదాపు వచ్చే 18 నెలల నుంచి రెండేళ్ల వరకు మీడియా ఇంటర్వ్యూలు, పబ్లిక్ స్టేట్‌మెంట్లు, మీడియా ఇంటరాక్షన్లకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
డాన్3 ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ స్థానంలో రణవీర్ సింగ్‌ను హీరోగా ఎంపిక చేయడంపై అభిమానులు, సినీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ వివాదానికి సంబంధించిన చర్చలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అంశంపై పలువురు సినీ ప్రముఖులు, విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడించినప్పటికీ, రణవీర్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ రాలేదు.
ఇటీవల ఓ ప్రముఖ ట్రేడ్ జర్నలిస్ట్ రణవీర్ సింగ్‌ను వ్యక్తిగతంగా కలిసినట్లు వెల్లడించారు. ఆ సందర్భంగా డాన్3 వివాదంపై స్పందించాలంటూ అడిగితే, తాను ఈ విషయంపై ఎలాంటి కామెంట్స్ చేయాలనుకోవడం లేదని రణవీర్ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా, ఫ్యూచర్ లో కూడా కొంతకాలం మీడియా ఇంటర్వ్యూలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ డెసిషన్ వెనుక ఉన్న కారణాలపై ఇంకా అధికారిక స్పష్టత లేకపోయినా, ప్రస్తుతం తన పనిపై పూర్తి దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే రణవీర్ ఈ మార్గాన్ని ఎంచుకున్నారని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ గతంతో పోలిస్తే తక్కువగా కనిపిస్తున్న రణవీర్, వ్యక్తిగత జీవితం మరియు కెరీర్‌పై మరింత ఫోకస్ చేయాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇక రణవీర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ధురంధర్‌తో పాటు జై మెహతా దర్శకత్వంలో రూపొందుతున్న ప్రళయ్ కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్ టైమ్ లోనే రణవీర్ మరోసారి పెద్ద ఎత్తున మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అప్పటి వరకు ఆయన లో ప్రొఫైల్‌ను మెయిన్‌టెయిన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై రణవీర్ సింగ్ లేదా ఆయన టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ క్లారిటీ వెలువడలేదు. అయినప్పటికీ, ప్రస్తుతం బాలీవుడ్‌లో వినిపిస్తున్న ఈ ప్రచారం నిజమైతే, మీడియాతో ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే రణవీర్ సింగ్‌లో ఇది ఒక పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయం ఆయన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.