నార్త్ హీరోయిన్.. సౌత్ హీరో! ఇండియన్ సినిమాలో మారిపోయిన కాంబినేషన్ ఫార్ములా

ఒకప్పుడు సినిమా అంటే భాషల వారీగా విడిపోయిన మార్కెట్లు. ముఖ్యంగా హీరోహీరోయిన్ల కాంబినేషన్ల విషయంలో ఈ విభజన మరింత స్పష్టంగా కనిపించేది.

Update: 2026-08-27 10:30 GMT

ఒకప్పుడు సినిమా అంటే భాషల వారీగా విడిపోయిన మార్కెట్లు. ముఖ్యంగా హీరోహీరోయిన్ల కాంబినేషన్ల విషయంలో ఈ విభజన మరింత స్పష్టంగా కనిపించేది. హిందీ సినిమాల్లో బాలీవుడ్ స్టార్లకే ప్రాధాన్యం ఉండేది. సౌత్ సినిమాల్లోనూ స్థానిక హీరోయిన్లు లేదా ఆయా భాషల్లో గుర్తింపు ఉన్న వారికే ఎక్కువ ఛాన్సులు దక్కేవి. కానీ ఇప్పుడు పరిస్థితి వేగంగా మారుతోంది. కథకు సరిపోయే నటుడు ఎవరు? మార్కెట్‌ను ఎవరు విస్తరించగలరు? అనే లెక్కలే కీలకంగా మారుతున్నాయి.

ఈ మార్పుకు ఇటీవలి కాలంలో కనిపిస్తున్న నార్త్ హీరోయిన్- సౌత్ హీరో కాంబినేషన్స్ మంచి ఉదాహరణగా నిలుస్తున్నాయి. బాలీవుడ్‌లో ఇప్పటికే స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరోయిన్లు ఇప్పుడు మలయాళం, తమిళం, తెలుగు ఇండ‌స్ట్రీలకు చెందిన అగ్ర నటులతో కలిసి పనిచేస్తున్నారు. అదే సమయంలో సౌత్ హీరోలు కూడా కేవలం తమ భాషా సినిమాల‌కే పరిమితం కాకుండా హిందీ సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. దీంతో ఒకప్పుడు అరుదుగా కనిపించిన క్రాస్ ఇండస్ట్రీ జోడీలు ఇప్పుడు సాధారణంగా మారుతున్నాయి.

దీనికి పాన్ ఇండియా మార్కెట్ ఒక మెయిన్ రీజ‌న్. ఒక సినిమా ఒకే భాష ఆడియ‌న్స్ ను టార్గెట్ గా చేసుకుని ఆగిపోకుండా దేశవ్యాప్తంగా రిలీజ్ కావాలంటే, వివిధ ప్రాంతాల్లో గుర్తింపు ఉన్న నటీనటులు అదనపు బలంగా మారుతున్నారు. అయితే కేవలం మార్కెట్ కోసమే నటీనటులను ఎంపిక చేయడం కాకుండా, కథకు తగ్గ పాత్ర, నటుడి ఇమేజ్, భాషల మధ్య సహజమైన కనెక్షన్ వంటి అంశాలను కూడా దర్శకనిర్మాతలు పరిగణనలోకి తీసుకుంటున్నారు.

ఓటీటీ విస్తరణ కూడా ఈ మార్పుకు మరో కారణం. వివిధ భాషల సినిమాలు ఒకే వేదికపై అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులకు నటీనటులపై ప్రాంతీయ హద్దులు తగ్గిపోయాయి. నిన్నటి వరకు ఒక భాషకు చెందిన స్టార్‌గా కనిపించిన నటుడు, ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిచయమైన ఫేస్ గా మారిపోతున్నారు. మరోవైపు, ప్రేక్షకుల ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు కూడా కీలకమే. మంచి కంటెంట్ ఉంటే హీరో ఏ భాషకు చెందినవాడు? హీరోయిన్ ఏ ప్రాంతానికి చెందినది? అనే ప్రశ్నలకు ప్రాధాన్యం తగ్గుతోంది. కాంబినేషన్ కొత్తగా ఉంటేనే ఆసక్తి పెరుగుతోంది. కరీనా కపూర్ వంటి బాలీవుడ్ హీరోయిన్లు సౌత్‌కు చెందిన ప్రముఖ హీరోలతో కలిసి పనిచేయడానికి ముందుకు రావడం ఈ మారుతున్న పరిస్థితికి మరో సంకేతం. ఫ్యూచ‌ర్ లో ఇలాంటి క్రాస్ ఇండస్ట్రీ కాంబినేషన్స్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇండియ‌న్ సినిమా ఇప్పుడు బాలీవుడ్ వర్సెస్ సౌత్ అనే దాన్నుంచి నుంచి ఇండియన్ సినిమా అనే పెద్ద మార్కెట్ వైపు అడుగులు వేస్తోంది.

Tags:    

Similar News