ప్రొడ్యూస‌ర్స్‌కి చుక్క‌లు చూపిస్తున్న హీరోయిన్‌!

మ‌నం స‌క్సెస్‌ని వ‌రించిన‌ప్పుడు ప్ర‌పంచం అంతా ఆశ్చ‌ర్యంతో పాటు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ మ‌న వంక చూస్తుంది.;

Update: 2025-06-27 07:30 GMT

మ‌నం స‌క్సెస్‌ని వ‌రించిన‌ప్పుడు ప్ర‌పంచం అంతా ఆశ్చ‌ర్యంతో పాటు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ మ‌న వంక చూస్తుంది. అంతే కాకుండా మ‌నం సాధించిన విజ‌యం మ‌న‌ల్ని ఓ స్థాయిలో నిల‌బెట్టి మ‌నం ఏదైనా డిమాండ్ చేసే స్టేట‌స్‌ని క‌లిగిస్తుంది. అయితే ఇక్క‌డే మ‌న విధేయ‌త‌, మం డిమాండ్ చేస్తున్న తీరుపై మ‌న గుడ్ విల్ ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌నం చేసే డిమాండ్‌ల‌లో న్యాయం ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అవి నెర‌వేర్చ‌డానికి అవ‌త‌లి వారు ఇబ్బందులు ప‌డేవిధంగా ఉంటేనే అస‌లు స‌మ‌స్య‌.

ఇటీవ‌ల ఇదే స‌మ‌స్య‌ కార‌ణంగా సందీప్‌రెడ్డి వంగ 'స్పిరిట్‌' నుంచి దీపిక ప‌దుకునే త‌ప్పుకుంద‌ని, త‌న డిమాండ్‌లని నెర‌వేర్చ‌లేక ద‌ర్శ‌కుడు సందీప్ 'స్పిరిట్‌' నుంచి తొల‌గించాడ‌ని పెద్ద చ‌ర్చ జ‌రిగింది. అంతే కాకుండా హీరోయిన్‌లు చేస్తున్న డిమాండ్‌ల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ మొద‌లైంది. సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌లు స్టే చేయ‌డానికి విలాస‌వంత‌మైన హోట‌ల్‌ల‌ని, ప్ర‌యాణించే స‌మ‌యంలో తన‌తో పాటు త‌న టీమ్‌కు కూడా ప్ర‌త్యేకంగా టికెట్లు వేయాల‌నే డిమాండ్ గ‌త కొంత కాలంగా జ‌రుగుతూ వ‌స్తోంది.

ఆ ఎక్స్‌ట్రా ఖ‌ర్చులు భ‌రించ‌లేకే రాజ‌మౌళి బాహుబ‌లిలో శివ‌గామి పాత్ర కోసం శ్రీ‌దేవిని సంప్ర‌దించి ఆ త‌రువాత విర‌మించుకోవ‌డం తెలిసిందే. ప‌దిహేను మంది సిబ్బందిని భ‌రించాల‌ని శ్రీ‌దేవి కండీష‌న్ పెట్ట‌డం వ‌ల్లే రాజ‌మౌళి త‌న‌ని ప‌క్క‌న పెట్టి ఆ క్యారెక్ట‌ర్‌కు ర‌మ్య‌కృష్ణ‌ని తీసుకున్నారు. ఆ త‌రువాత దీనిపై పెద్ద చ‌ర్చే జ‌రిగింది. తాజాగా ఇలాంటి చ‌ర్చే ఓ హీరోయిన్ విష‌యంలో జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఓ ప్రాజెక్ట్ కోసం ముంబై నుంచి హైద‌రాబాద్‌కు ప్ర‌యాణించింది. రెండు ద‌శాబ్దాలుగా న‌టిగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న త‌ను చేసిన డిమాండ్‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఉత్త‌రాది న‌టి అయినా ద‌క్షిణాలో తెలుగు, త‌మిళ భాష‌ల్లోని అగ్ర క‌థానాయ‌కుల‌తో క‌లిసి న‌టించింది. ముంబైలో ఉంటున్న స‌ద‌రు న‌టి ఓ ద‌క్షిణాది మూవీ కోసం ఇటీవ‌ల ముంబై నుంచి హైద‌రాబాద్ త‌న టీమ్‌తో క‌లిసి ప్ర‌యాణించింది. ఈ టైమ్‌లో త‌న‌తో పాటు ఐదుగురు అసిస్టెంట్‌లు ప్ర‌యాణించారు. ముంబై మిన‌హా ఇత‌ర సిటీస్‌లో షూటింగ్ అంటే స‌ద‌రు న‌టి త‌న మేనేజ‌ర్‌తో పాటు మేక‌ప్‌మెన్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌, హెయిర్ స్టైలిస్ట్‌, స్పాట్ బాయ్‌..ఇలా ఐదుగురు టీమ్ త‌న‌తో ఉండాల్సిందే.

వారి ప్ర‌యాణ ఖ‌ర్చులు, బేటాలు నిర్మాత భ‌రించాల్సిందే. అంతేనా అనుకుంటే హీరోయిన్ మ‌రో డిమాండ్ కూడా చేస్తూ నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. త‌న టీమ్‌కు ఐదు టికెట్‌లు బుక్ చేయ‌డంతో పాటు త‌న‌కు మూడు టికెట్‌లు బుక్ చేయించుకుంటోంది. విండో సీట్‌, సెంట‌ర్ సీట్ అండ్ మ‌ధ్య‌లో ఉండే సీటు..ఇలా త‌న కోసం మూడు సీట్ల కోసం టికెట్లు బుక్ చేయిస్తోంద‌ట‌. ఇది నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పిగా మారిన‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా త‌న మేనేజ‌ర్ కూడా విండో సీట్‌లో కూర్చోవాల‌ని, ఇత‌ర స‌భ్యులు మ‌ధ్య‌లో కూర్చోవాల‌ని డిమాండ్‌చేస్తోంద‌ట‌.

ఇక ట్రావెల్ చేస్తున్న స‌మ‌యంలో ఫుడ్ ఖ‌ర్చుతో పాటు, ఎక్స్‌ట్రా ల‌గేజీ ఖ‌ర్చులు, పోర్ట‌ర్ స‌ర్వీస్ ప‌లు ల‌గ్జ‌రీ స‌ర్వీసుల‌ని కూడా డిమాండ్ చేస్తూ నిర్మాత‌ల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తోంద‌ట‌. ఒక హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లోనే కాకుండా ముంబై ఏయిర్ పోర్ట్‌లోనూ త‌న‌కు ఇదే త‌ర‌హా సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని కోరుతున్న‌ట్టుగా చెబుతున్నారు. అంతే కాకుండా త‌న తిరుగు ప్ర‌యాణ ఖ‌ర్చుల‌ని కూడా నిర్మాతే భ‌రించాల‌ని కోరుతుండ‌టం నిర్మాత‌ల‌కు ఒళ్లుమండేలా చేస్తోంది. గ‌త ఐదేళ్లుగా ద‌క్షిణాదిలో హిట్లులేని న‌టి ఈ స్థాయిలో డిమాండ్ చేయ‌డంతో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. డిమాండ్ చేయ‌డంలో త‌ప్పులేద‌ని, అయితే అవి ఆమోద యోగ్యంగా ఉండాల‌ని అంటున్నారు. ఇదే ప‌ద్ద‌తిని స‌ద‌రు హీరోయిన్ కంటిన్యూ చేస్తే రానున్న రోజుల్లో అస‌లుకే మోసం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, క్రేజ్ ఉందని అతిగా డిమాండ్ చేయ‌కుండా ఓ ప‌ద్ద‌తిని ప‌టించాల‌ని, రోమ్‌లో ఉన్న‌ప్పుడు రోమ‌న్‌లా ఉండాల‌న్న‌ట్టు ప్ర‌వ‌ర్తించాల‌ని సినీ వ‌ర్గాలు కామెంట్‌లు చేస్తున్నారు.

Tags:    

Similar News