బాలీవుడ్ బతకాలంటే క్లైమాక్స్ హిట్...!
కాల గర్భంలో 2025 కూడా కలువబోతుంది. మరో నాలుగు రోజుల్లో డిసెంబర్ నెల రాబోతుంది. 2025లో 11 నెలలు పూర్తి కాబోతున్నాయి.;
కాల గర్భంలో 2025 కూడా కలువబోతుంది. మరో నాలుగు రోజుల్లో డిసెంబర్ నెల రాబోతుంది. 2025లో 11 నెలలు పూర్తి కాబోతున్నాయి. ఈ 11 నెలల్లో బాలీవుడ్ నుంచి వందల కొద్ది సినిమాలు వచ్చాయి. కానీ నెలకు ఒక్కటి చొప్పున కనీసం పది పదకొండు సినిమాలు కూడా సూపర్ హిట్‌గా నిలవలేదు. సూపర్ హిట్ సంగతి అలా ఉంచితే కనీసం గుర్తుండి పోయే సినిమాలు కూడా రాలేదు అని సినీ ప్రేమికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఈ నెంబర్స్ అద్దం పడుతున్నాయి. బాలీవుడ్‌లో ఈ ఏడాదిలో చెప్పుకోదగ్గ హిట్స్ చెప్పాలి అంటే ఆరు ఏడు మాత్రమే ఉన్నాయి. అందులో ఛావా, సయ్యారా సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుని వందల కోట్ల వసూళ్లు రాబట్టాయి. మిగిలిన సినిమాలు కాస్త పర్వాలేదు అనిపించే విధంగా హిట్ అయ్యాయి.
బాలీవుడ్ నుంచి రాబోతున్న సినిమాలు...
సౌత్ ఇండియన్ సినిమాలతో పోల్చితే బాలీవుడ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌లో సినిమాల మేకింగ్ ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా తక్కువ హిట్స్ వస్తున్నాయి. దాంతో చాలా మంది ఓటీటీ స్ట్రీమింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరూ ఓటీటీ వైపు చూస్తున్న నేపథ్యంలో థియేటర్ల పరిస్థితి ఏంటో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. 2025 డిసెంబర్‌లోనూ బాలీవుడ్ నుంచి దాదాపుగా అర డజను పేరున్న సినిమాలు రాబోతున్నాయి. అందులో కనీసం రెండు మూడు అయినా హిట్ అయితే బాలీవుడ్ పరువు నిలుస్తుంది. ముందు ముందు రాబోయే కాలంలో బాలీవుడ్ సినిమాలకు జీవం లభించాలంటే, అసలు బాలీవుడ్ థియేట్రికల్ రిలీజ్‌లు కొనసాగాలంటే ఖచ్చితంగా ఈ ఇయర్ క్లైమాక్స్ సినిమాలు హిట్ కొట్టాల్సిందే.
ధురంధర్ మూవీ...
బాలీవుడ్ నుంచి డిసెంబర్‌లో రాబోతున్న సినిమాల విషయానికి వస్తే రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్, ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన మొదటి లేడీ స్పై థ్రిల్లర్ ఆల్ఫా, ధనుష్ హీరోగా నటించిన తేరే ఇష్క్ మే, అమీర్ ఖాన్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్న మేరే రహో సినిమాలతో పాటు తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ, దుర్లభ్ ప్రసాద్ కీ దూస్రీ షాదీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాల్లో ఆల్ఫా, ధురంధర్ సినిమాలతో పాటు ధనుష్ హీరోగా కృతి సనన్ హీరోయిన్‌గా నటించిన తేరే ఇష్క్ మే సినిమాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ మూడు సినిమాలు హిట్‌గా నిలిస్తే 2026 సంవత్సరం చాలా ఆశాజనకంగా మొదలు అవుతుంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాల విషయంలో మేకర్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.
టాలీవుడ్‌లో సూపర్ హిట్...
సౌత్ ఇండియన్ సినిమాలు ముఖ్యంగా టాలీవుడ్, కన్నడ, మలయాళ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేస్తున్నాయి. కన్నడ నుంచి వచ్చిన కాంతార చాప్టర్ 1 సినిమా వందల కోట్ల వసూళ్లు నమోదు చేయడం ద్వారా బాలీవుడ్ కంటే తామే గొప్ప అన్నట్లుగా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు తెలుగు నుంచి బ్యాక్ టు బ్యాక్ పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు వస్తూ సక్సెస్ రేటు విషయంలో చాలా మంచి నెంబర్‌ను దక్కించుకుంది. అందుకే ఇతర సినిమా ఇండస్ట్రీలతో పోల్చిన సమయంలో బాలీవుడ్ చాలా వెనుకబడి ఉంది. అందుకే ఈ సినిమాలతో అయినా బాలీవుడ్ హిట్ దక్కించుకుని పరువు నిలుపుకుంటుందా అనేది చూడాలి. బాలీవుడ్ వచ్చే ఏడాది ఒక పాజిటివ్ హోప్‌తో మొదలు పెట్టాలంటే ఈ ఏడాది క్లైమాక్స్ హిట్ కావాల్సిందే అనేది సినీ విశ్లేషకుల మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.