బొబ్బిలి పులి రిలీజ్ కోసం దాసరి పడ్డ కష్టాలు !
బొబ్బిలి పులి. బ్లాక్ బస్టర్ మూవీ. 1982 జూలై 9న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు చలన చిత్ర సీమలో అప్పటిదాకా ఉన్న రికార్డులను అన్నింటినీ బ్రేక్ చేసింది.
బొబ్బిలి పులి. బ్లాక్ బస్టర్ మూవీ. 1982 జూలై 9న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు చలన చిత్ర సీమలో అప్పటిదాకా ఉన్న రికార్డులను అన్నింటినీ బ్రేక్ చేసింది. ఎన్టీఆర్ దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన అయిదవ చిత్రం. ఇదే చివరి చిత్రం కూడా. అంతకు ముందు ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలలో సర్దార్ పాపారాయుడు సూపర్ డూపర్ హిట్ అయింది. తొలి చిత్రం మనుషులంతా ఒక్కటే ఘన విజయం సాధించింది. ఇక ఈ మధ్యలో వచ్చిన విశ్వరూపం, సర్కస్ రాముడు వంటివి బాగానే ఆడాయి అనిపించుకున్నాయి.
అత్యంత ప్రతిష్టాత్మకంగా :
బొబ్బిలి పులి చిత్రాన్ని విజయ మాధవి ప్రొడక్షన్స్ మీద వడ్డే కిషోర్ నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అప్పటికే క్రిష్ణంరాజుతో ఈ బేనర్ మీద కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడి వంటి మాస్ హిట్స్ తో ఈ బానర్ కి ఎంతో క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ తో మొదటిసారి వడ్డే కిషోర్ సినిమా తీయడం అప్పటికే సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు దాసరి డైరెక్షన్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ప్రకటన నేపథ్యంలో ఈ మూవీ మీద అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. అనుకున్న సమయానికే షూటింగ్ మొదలెట్టి చకచకా చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయింది. అయితే అనూహ్యంగా సెన్సార్ దగ్గరే సమస్యలు వచ్చారు మద్రాస్ లో సెన్సార్ అయిన ఈ మూవీని చూసిన కమిటీ మూడు వేల అడుగులు తీసేయాలని చిత్ర యూనిట్ ని ఆదేశించింది. ఈ సినిమాలో ప్రభుత్వాన్ని విమర్శించే రాజకీయ డైలాగులు ఉన్నాయని సెన్సార్ కమిటీ ఓకే చేసేందుకు తిరస్కరించింది అని ప్రచారం సాగింది. దాంతో దర్శకరత్న దాసరి పూర్తిగా డీలా పడ్డారు.
ఎన్టీఆర్ సలహాతో :
ఈ విషయాన్ని చిత్ర కథానాయకుడు ఎన్టీఆర్ దృష్టికి దాసరి తీసుకుని వెళ్ళారు, ఆయన రివిజన్ కమిటీకి చూపించమని సలహా ఇచ్చారు. దానికి చైర్మన్ ఎల్వీ ప్రసాద్ కాబట్టి ఇబ్బందులు ఉండవని అనుకున్నారు. ఎల్వీ ప్రసాద్ మూవీ చూసి మూడు వేల అడుగులు కట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ క్లైమాక్స్ మొత్తం తీసేయండి అని చెప్పారు. దాంతో ఏమిటిలా అని దాసరి పూర్తి అయోమయంలో పడిపోయారు. ఎందుకంటే బొబ్బిలి పులికి ఆయువు పట్టు క్లైమాక్స్ అందులోనే కోర్టు సీన్లు ఉంటాయి. ఎన్టీఆర్ డైలాగులు ఒక హైలెట్ గా ఉంటాయి. దాంతో ఈ సినిమా రిలీజ్ మీద చిత్ర యూనిట్ కి కూడా డౌట్ వచ్చేసింది. అయితే దాసరి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిగా తన ప్రయత్నాలను చేశారు.
పీవీ చూసి ఓకే :
ఇక ఢిల్లీకి ఈ సినిమా ప్రింట్స్ ని తీసుకెళ్ళి అప్పటి కేంద్ర మంత్రి పీవీ నరసింహారావుకు చూపించారు. ఈ మూవీలో కాంగ్రెస్ ని కానీ కేంద్రాన్ని కానీ విమర్శించే సీన్లు లేవని దాసరి పెద్దలకు చెప్పారట. ఆ తరువాత పలువురు కేంద్ర పెద్దలకు ఈ మూవీ చూపించి ఎట్టకేలకు వారంతా ఓకే అన్న మీదట ఎంతో కష్టం మీద సెన్సార్ సర్టిఫికేట్ ఈ మూవీకి వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ సమయానికి ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆయన చైతన్య రధం మీద ఒక వైపు ఉమ్మడి ఏపీ అంతా చుట్టుముట్టేస్తూ ఉంటే మరో వైపు బొబ్బిలి పులి ధియేటర్లలో రిలీజ్ అయి సంచలన విజయం మమోదు చేసింది. ఈ సినిమాలో దాసరి రాసిన డైలాగులు ఎన్టీఆర్ నోట డైనమేట్లుగా పేలాయి. ముఖ్యంగా ఆనాటి వ్యవస్థ మీద ఎన్టీఆర్ వేసిన సెటైర్లు ప్రశ్నించిన తీరు అన్నీ కూడా ఈ చిత్ర విజయానికి కారణం అయ్యాయి. సరిగ్గా 46 ఏళ్ళ క్రితం విడుదల అయిన బొబ్బిలి పులి ఎన్టీఆర్ సినీ చరిత్రలో ఒక లాండ్ మార్క్ మూవీ అని చెప్పాల్సి ఉంటుంది. అంతే కాదు ఆయన రాజకీయ జీవితానికి కూడా పూర్తిగా కలసి వచ్చింది.