ఆస్కార్ కంటే ముందు ఫార్మర్.. చంద్రబోస్ సింప్లిసిటీకి ఫిదా!

ఈ సందర్భంగా చంద్రబోస్ తన మూలాలను గుర్తు చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు గుండెలకు హత్తుకునేలా ఉన్నాయి.;

Update: 2026-03-25 17:05 GMT

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంపత్ నంది రూపొందిస్తున్న తాజా చిత్రం `భోగి`. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ఈ సినిమా కోసం ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే పాటను రాస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు సంపత్ నంది నేరుగా చంద్రబోస్ ని కలిసినప్పుడు జరిగిన సంభాషణ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

వీడియోలో సంపత్ నంది ఒక గదిలోకి ప్రవేశించగా.. చంద్రబోస్ సౌకర్యవంతమైన కుర్చీని వదిలేసి.. కిటికీ దగ్గర ఉన్న అరుగుపై పడుకుని ట్యాబ్‌లో పాట రాస్తూ కనిపించారు. ``ఏంటన్న.. కుర్చీ వదిలేసి అక్కడ అరుగు మీద పడుకుని రాస్తున్నారు?`` అని సంపత్ నంది ఆశ్చర్యంగా అడగ్గా దానికి చంద్రబోస్ ఇచ్చిన సమాధానం ఆయన సహజత్వ ఫిలాస‌ఫీని బ‌హిర్గ‌తం చేసింది. పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా పాట రాయాలని దర్శకుడు కోరడంతో ఆ మూడ్‌లోకి వెళ్లడానికే తాను ఇలా సెట‌ప్ చేసానని ఆయన వివరించారు.

``మీరు నన్ను పల్లెటూరి పాట రాయమన్నారు కదా! అందుకే ఆ వాతావరణాన్ని ఇక్కడే సృష్టించుకుంటున్నాను. సాధారణంగా పల్లెటూర్లలో అరుగుల మీద, రచ్చబండల మీద ఇలాగే ఒరుగుతారు (పడుకుంటారు). అందుకే ఆ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లి మన పల్లెటూరి పాటను అక్షరీకరిస్తున్నాను`` అని చంద్రబోస్ చెప్పారు. కేవలం ఒక పాట కోసం ఆయన చూపిస్తున్న ఈ అంకితభావం చూసి సంపత్ నంది ప్రశంసల వర్షం కురిపించారు. ఆస్కార్ గెలిచిన స్థాయి వ్యక్తి ఇలాంటి సాదాసీదా వాతావరణంలో కూర్చుని పని చేస్తారని ఎవరైనా నమ్ముతారా అని కొనియాడారు.

ఈ సందర్భంగా చంద్రబోస్ తన మూలాలను గుర్తు చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు గుండెలకు హత్తుకునేలా ఉన్నాయి. ఆస్కార్ కంటే ముందు మాది ఒక వ్యవసాయ కుటుంబం. నేను ప్రాథమికంగా ఒక రైతుని. రైతు స్థాయి నుంచి ఆస్కార్ వేదిక వరకు వెళ్లినా.. నాలోని ఆ రైతు ఇంకా అలాగే ఉన్నాడు! అని చాలా వినమ్రంగా చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా తన మూలాలను, తన మట్టి వాసనను మర్చిపోని ఆయన వ్యక్తిత్వం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

చివరగా సంపత్ నంది `ఫార్మర్ టు ఆస్కార్` అంటూ చంద్రబోస్ గారిని అభినందించారు. `భోగి` సినిమా నుంచి రాబోతున్న ఈ `రా అండ్ రియల్` సాంగ్ కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. భోగి ని శ‌ర్వా - సంప‌త్ బ్ల‌డ్ ఫెస్ట్ అని సూత్రీక‌రించారు కాబ‌ట్టి ఇందులో పెచ్చుమీరిన యాక్ష‌న్ ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే దురంధ‌ర్ రిజ‌ల్ట్ త‌ర్వాత మారిన సినారియాలో సంప‌త్ నంది కూడా కొత్త ప్ర‌మాణాల‌తో సినిమాల‌ను రూపొందించాల్సి ఉంటుంది. శ‌ర్వా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News