ఏపీలో టాలీవుడ్‌ని అభివృద్ధి చేయాల్సి ఉంది: నందమూరి బాలకృష్ణ
ప్రకటనలు ఘనంగా ఉన్నా పనులు మాత్రం శూన్యంగా మిగిలిపోవడంతో ఏపీలో సరికొత్త టాలీవుడ్ ఏర్పాటు ఒక కలగానే మిగిలిందనే విమర్శలు ఎదురవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దశాబ్దం కావస్తున్నా నవ్యాంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి రాజకీయ నాయకులు చేసిన ప్రకటనలు కేవలం నీటి మూటలుగానే మిగిలాయనే అభిప్రాయం ప్రజల్లో, సినీ వర్గాల్లో బలంగా ఉంది. అమరావతి, విశాఖపట్నం లేదా శ్రీసిటీ (నెల్లూరు) ప్రాంతాలకు హైదరాబాద్ నుండి చిత్ర పరిశ్రమను తరలించాలనే ప్రతిపాదనలు గతంలో గట్టిగా వినిపించినా క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రకటనలు ఘనంగా ఉన్నా పనులు మాత్రం శూన్యంగా మిగిలిపోవడంతో ఏపీలో సరికొత్త టాలీవుడ్ ఏర్పాటు ఒక కలగానే మిగిలిందనే విమర్శలు ఎదురవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లో టాలీవుడ్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోయినా.. ఇప్పటికీ తెలుగు సినిమాలకు లభించే మొత్తం వసూళ్లలో దాదాపు 60 నుండి 70 శాతం కలెక్షన్లు కేవలం ఏపీ నుంచే వస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇంతటి భారీ మార్కెట్ - ఆదరణ ఉన్న ఏపీలో చిత్ర పరిశ్రమకు తగిన వసతులు, వృద్ధిని కల్పించడం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు.
గత చరిత్రను ప్రస్తావిస్తూ.. ఆ రోజుల్లో చలనచిత్ర నిర్మాణానికి, పంపిణీకి విజయవాడ నగరం ఎలాగైతే ఒక ప్రధాన కేంద్రంగా వెలిగిందో.. ఇప్పటికీ అదే ప్రాధాన్యతతో బాసిల్లుతోందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఏపీలో ఎంతోమంది ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉన్నారని.. అందుకే తాను నటిస్తున్న సినిమాల షూటింగులను స్థానిక లొకేషన్లలోనే జరుపుతున్నట్లు వెల్లడించారు. తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన `అఖండ` సినిమా మొదలుకొని.. ఇటీవల చేస్తున్న ఎన్నో చిత్రాల షూటింగులు స్థానికంగానే విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నాయని ఆయన ఉదహరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు.. పరిశ్రమ వృద్ధికి తాము సంపూర్ణంగా సహకరిస్తున్నామని బాలకృష్ణ భరోసా ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం, తన సోదర సమానుడైన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం కూడా ఇందుకు సానుకూలంగా ఉందనే సంకేతాలు ఇచ్చారు. మరి ఇప్పటికైనా బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యల స్ఫూర్తితో..పవన్ కళ్యాణ్ - ప్రభుత్వ పెద్దలు కలిసి ఆంధ్రప్రదేశ్‌లో టాలీవుడ్ అభివృద్ధికి కొత్త ప్రణాళికలు రచిస్తారేమో చూడాలి.
నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన `వీరసింహారెడ్డి`బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుత ప్రాజెక్టుపై నందమూరి అభిమానుల్లో - ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.