బాలయ్య.. ఈసారి రిస్క్ తీసుకోవట్లే..

టాలీవుడ్‌ లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ మరో క్రేజీ కాంబినేషన్‌ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.;

Update: 2026-04-24 17:46 GMT

టాలీవుడ్‌ లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ మరో క్రేజీ కాంబినేషన్‌ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే యాక్షన్ ఎంటర్టైనర్స్‌ తో అభిమానులను అలరిస్తున్న బాలయ్య.. ఈసారి స్టార్ దర్శకుడు కొరటాల శివతో కలిసి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ ప్రాజెక్ట్‌ పై ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. అయితే ఈసారి బాలయ్య ఒక విషయంలో జాగ్రత్త పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

బాలకృష్ణ కుటుంబానికి చెందిన చిన్న కుమార్తె తేజస్విని గత కొంతకాలంగా సినిమాల్లో తెరవెనుక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ టాక్ షో అన్‌ స్టాపబుల్ కు క్రియేటివ్ కన్సల్టెంట్‌ గా, కాస్ట్యూమ్ డిజైనర్‌ గా ఆమె తన టాలెంట్ ఏంటో చూపించారు. అలాగే అఖండ 2 వంటి ప్రాజెక్టులకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రొడక్షన్ రంగంలోనూ అడుగులు వేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, బాలయ్య రెండు కొత్త ప్రాజెక్టుల్లో తేజస్విని భాగస్వామ్యం ఉండదని తెలుస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తెరకెక్కుతున్న NBK111 చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌ పై నిర్మాత సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో తేజస్విని ఎలాంటి బాధ్యతలు తీసుకోవడం లేదని స్పష్టమైంది. ఇప్పుడు కొరటాల శివతో ప్రారంభించబోతున్న కొత్త సినిమాలో కూడా ఆమె భాగస్వామ్యం ఉండదని సమాచారం.

ఆ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. మే 1న పూజా కార్యక్రమాలతో ఆ సినిమా అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సామాజిక సందేశంతో కూడిన కథలను కమర్షియల్ అంశాలతో మేళవించడం ఆయన ప్రత్యేకత.

హీరో పాత్రను పవర్‌ ఫుల్‌ గా చూపించడంలో ఆయనకు మంచి పేరుంది. ఇప్పుడు బాలయ్య మాస్ ఇమేజ్‌ కు కొరటాల శైలి జతకడితే ఆ సినిమా భారీ విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి సీజన్‌ లో బాలయ్య సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఆ ప్రాజెక్ట్‌ పై అంచనాలు మరింత పెరిగాయి.

అయితే తేజస్విని బాలయ్య అప్ కమింగ్ ప్రాజెక్టుల్లో లేకపోవడంపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవల అఖండ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో రిస్క్ తీసుకోకుండా ఈసారి బాలయ్య జాగ్రత్త పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి, కొరటాల శివ – బాలకృష్ణ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తేజస్విని భాగస్వామ్యం లేకపోయినా, కంటెంట్- కాంబినేషన్ బలం వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయని అంతా అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News