'బ్రహ్మాస్త్ర- 2' కోసం `రామాయ‌ణం` నిర్మాత చుట్టూ తిరుగుతున్నాడు!

బాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన `బ్రహ్మాస్త్ర` ఫ్రాంచైజీ సీక్వెల్ `బ్రహ్మాస్త్ర 2` చుట్టూ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

Update: 2026-08-27 11:30 GMT

బాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన `బ్రహ్మాస్త్ర` ఫ్రాంచైజీ సీక్వెల్ `బ్రహ్మాస్త్ర 2` చుట్టూ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మొదటి భాగాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించిన దర్శకుడు అయాన్ ముఖర్జీ.. ఇప్పుడు రెండవ భాగాన్ని పట్టాలెక్కించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు బాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థలు వెనుకంజ వేస్తుండటంతో కొత్త స్టూడియో పార్ట్‌నర్ కోసం ఆయన అన్వేషణ మొదలైందని జాతీయ మీడియా పేర్కొంది.

మొదటి `బ్రహ్మాస్త్ర` చిత్రానికి సహ-నిర్మాతగా వ్యవహరించిన అయాన్ ముఖర్జీ సొంత ప్రొడక్షన్ హౌస్ `స్టార్‌లైట్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్` వద్దే ఈ సినిమా ఐపి (మేధో సంపత్తి) హక్కులు భద్రంగా ఉన్నాయి. ఈ బ్యానర్‌పైనే `బ్రహ్మాస్త్ర 2` నిర్మించాలని ప్లాన్ చేస్తున్నా.. సినిమాకు కావలసిన భారీ నిర్మాణ వ్యయాన్ని భరించడానికి ఒక బలమైన స్టూడియో తోడ్పాటు అత్యంత ఆవశ్యకంగా మారింది. కానీ అయాన్ ముఖర్జీ ఊహించే భారీ బడ్జెట్లను చూసి పెద్ద నిర్మాణ సంస్థలు భయపడుతుండటం ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యంగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన `వార్ 2` బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో (ఫ్లాప్ కావడంతో).. అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ఆయనతో మరో భారీ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తి చూపడం లేదని తాజా ప‌రిణామాలు చెబుతున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ మాత్రమే కాకుండా ధర్మ ప్రొడక్షన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి దూరంగా జరిగింది. మొదటి భాగానికి కీలక భాగస్వామిగా ఉన్న స్టార్ స్టూడియోస్ ఇప్పుడు `జియోస్టార్` వ్యవస్థలో భాగమైనా జియో స్టూడియోస్ కూడా `బ్రహ్మాస్త్ర 2` నుంచి తప్పుకోవడంతో నిర్మాతల వేట మరింత క్లిష్టంగా మారింది.

ఈ వరుస స‌న్నివేశాల‌ నేపథ్యంలో అయాన్ ముఖర్జీ ఇప్పుడు `రామాయణం` వంటి అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత, ప్రైమ్ ఫోకస్ అధినేతి నమిత్ మల్హోత్రా చుట్టూ తిరుగుతున్నారు. 2022లో వచ్చిన మొదటి `బ్రహ్మాస్త్ర` చిత్రానికి కూడా ప్రైమ్ ఫోకస్ ఒక భాగస్వామిగా వ్యవహరించింది. విజువల్ ఎఫెక్ట్స్‌కు (VFX) అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ ఫ్రాంచైజీకి.. అంతర్జాతీయ స్థాయిలో వీఎఫ్ఎక్స్ నైపుణ్యం కలిగిన నమిత్ మల్హోత్రా సరైన భాగస్వామి అవుతారని అయాన్ ముఖర్జీ భావిస్తున్నారు.

ప్రస్తుతం నమిత్ మల్హోత్రాతో `బ్రహ్మాస్త్ర 2` స్టూడియో భాగస్వామ్యం కోసం ప్ర‌య‌త్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. నమిత్ మల్హోత్రా ఈ సీక్వెల్‌లో భాగస్వామి కావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారా లేదా? ఒప్పందం ఖ‌రారైందా లేదా అనేదానిపై అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది. బడ్జెట్ భయాల నడుమ రామాయణం నిర్మాత ఇచ్చే తోడ్పాటుతోనైనా `బ్రహ్మాస్త్ర 2` వేగంగా పట్టాలెక్కుతుందో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News