అంత మంది అతిథుల మధ్య 'మ్యాటర్' ఉంటుందా...?
ఇటీవల విడుదలైన ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్‌లో ఉన్న పరిస్థితులను ఈ వెబ్ సిరీస్‌లో చూపించడం కోసం దర్శకుడు ఆర్యన్ ఖాన్ చాలా లోతుగానే అధ్యయనం చేసినట్లు అనిపిస్తుంది.;
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనుకుంటే అందరికీ షాక్ ఇస్తూ దర్శకుడిగా ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. ఇప్పటికే ఈయన దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ రూపొందింది. ఆ వెబ్ సిరీస్‌ను ఈ నెల 18న ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. గత నెల రోజులుగా ఈ వెబ్ సిరీస్‌ను ప్రమోట్ చేస్తూ దర్శకుడు ఆర్యన్ ఖాన్ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. బాలీవుడ్‌లో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు గాను ఆర్యన్ ఖాన్ ఈ 'ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సిరీస్‌ను రూపొందించాడు. కథ అనుసారం ఈ వెబ్ సిరీస్‌లో చాలా మంది నటీనటులు కనిపించబోతున్నారు. అంతే కాకుండా షారుఖ్ ఖాన్ కి ఉన్న క్రేజ్ తో ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్‌కి చెందిన ఎంతో మందిని గెస్ట్ పాత్రల్లో నటింపజేయడం జరిగిందట.
బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్..
ఇటీవల విడుదలైన ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్‌లో ఉన్న పరిస్థితులను ఈ వెబ్ సిరీస్‌లో చూపించడం కోసం దర్శకుడు ఆర్యన్ ఖాన్ చాలా లోతుగానే అధ్యయనం చేసినట్లు అనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ కారణంగా ముందు ముందు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సినిమాలో చూపించలేని కంటెంట్ కనుకే ఈ కథను వెబ్ సిరీస్ రూపంలో దర్శకుడు ఆర్యన్ ఖాన్ తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అంటున్నారు. హీరోగా ఆర్యన్ ఖాన్ కి చాలానే అవకాశాలు వచ్చాయి. కానీ తాను దర్శకత్వం చేయాలి అనే పట్టుదలతో తన తండ్రిని ఒప్పించి, తన కథతో మెప్పించి ఆయన్నే నిర్మాతగా చేసి ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించాడు. ఈ వెబ్ సిరీస్ కంటెంట్ విషయంలో చాలా పాజిటివ్ టాక్ ఉంది. కానీ అతిథులు ఎక్కువగా ఉండటం కాస్త కలవరానికి గురి చేస్తుంది.
షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో..
సాధారణంగా జనం ఎక్కువ అయితే మజ్జిగ పలచన అవుతుంది అంటారు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌లోనూ అదే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో లెక్కకు మించిన అతిథి పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రల్లో ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. కనుక వారందరికీ మినిమం ప్రాధాన్యత ఇవ్వడం కోసం దర్శకుడు తన కథ, కథనం విషయంలో ఎక్కడో ఒక చోట అయినా రాజీ పడాల్సి ఉంటుంది. అందుకే ఈ వెబ్ సిరీస్‌లో ఎక్కువ మంది అతిథులు ఉన్న కారణంగా మ్యాటర్ ఏమైనా మారుతుందా, అసలు మ్యాటర్ ఉంటుందా అనే చర్చ కొందరు లేవనెత్తుతున్నారు. సినిమా కాన్సెప్ట్ బాలీవుడ్ కాబట్టి, అతిథుల రాక వల్ల ఇబ్బంది ఏమీ లేదు అనేది కొందరి అభిప్రాయం. అసలు విషయం ఏంటి అనేది సిరీస్ స్ట్రీమింగ్ అయితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
ఆర్యన్ ఖాన్ హీరోగా సినిమా చేయాలి...
బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో మంచితో పాటు, చెడును కూడా ప్రముఖంగా దర్శకుడు ఆర్యన్ ఖాన్ చూపిస్తాడు అంటూ యూనిట్ సభ్యులు అంటున్నారు. బాలీవుడ్‌లో చాలా ఏళ్లుగా ఉంటున్న వారికి ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ వంటి సూపర్ స్టార్ వారసుడు ఇలా చిన్న వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇవ్వడం ఏంటో అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో గత కొన్నాళ్లుగా ఈ వెబ్ సిరీస్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. కనుక ఇప్పటికే రావాల్సిన బజ్ వచ్చేసింది, కావాల్సిన విధంగా సిరీస్ కి ప్రమోషన్ దక్కింది. కనుక ముందు ముందు ఆర్యన్ ఖాన్ సినిమాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన దర్శకత్వంతో పాటు నటనపై శ్రద్ద పెట్టాలని షారుఖ్ అభిమానులు కోరుకుంటున్నారు.