కోవిడ్ టైంలో కూడా జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్న యూత్ స్టార్..!

Update: 2020-11-28 09:30 GMT
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ 'జయం' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 'దిల్' 'సై' 'ఇష్క్‌' 'గుండెజారి గ‌ల్లంత‌య్యిందే' 'హార్ట్ అటాక్' 'అ ఆ' సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపించాడు. ఈ ఏడాది ప్రారంభంలో ‘భీష్మ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సక్సెస్ ఇచ్చిన జోష్ లో వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ దూకుడు చూపిస్తున్నాడు. ప్రస్తుతం మహానటి కీర్తి సురేష్ తో ''రంగ్ దే'' అనే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యాన‌ర్‌ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. అలానే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో 'చెక్' అనే సినిమా చేస్తున్నాడు నితిన్. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ సినిమాల చిత్రీకరణ ఇటీవలే తిరిగి ప్రారంభమయ్యాయి.

కోవిడ్ సంక్షోభంలో కూడా పక్కా ప్లానింగ్ తో షూటింగ్స్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న 'రంగ్ దే' షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 'చెక్' సినిమా కూడా ఓ సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలుస్తోంది. దీని తర్వాత బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన ''అంధాదున్'' మూవీని తెలుగులో రీమేక్ చేయనున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని హోమ్ ప్రొడక్షన్ శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డిలు నిర్మించనున్నారు.

అలానే 'చల్ మోహన్ రంగా' ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' అనే సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక అందరికి 2020 ఏడాది గుర్తుండి పోయినట్లే నితిన్ కి కూడా మరపురాయి ఏడాదిగా నిలిచిపోనుంది. ఈ ఏడాదిలోనే నితిన్ తన ప్రియసఖి షాలిని ని వివాహం చేసుకొని ఓ ఇంటివాడు అయ్యాడు. అలానే ఫస్ట్ కమర్షియల్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కి అగ్రిమెంట్ చేసుకున్నాడని తెలుస్తోంది. ఏదేమైనా కోవిడ్ సమయంలో కూడా నితిన్ కెరీర్ ని పక్కా ప్లానింగ్ తో జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తున్నాడని చెప్పవచ్చు.
Tags:    

Similar News