'వకీల్ సాబ్' కలెక్షన్స్ లో 'వసూల్ సాబ్' అనిపించుకుంటాడా..?

Update: 2021-04-10 15:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్ళు రాబడుతుంటాయి. 'అజ్ఞాతవాసి' వంటి డిజాస్టర్ మూవీ కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టగలిగిందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ రీ ఎంట్రీ ఇచ్చిన ''వకీల్ సాబ్'' సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా రిలీజైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌ లోనూ మంచి కలెక్షన్లు రాబడుతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పటికే పవన్ కెరీర్లో ఫస్ట్ డే ఎక్కువ వసూళ్ళు రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు. అలానే కోవిడ్ లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్‌ లో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా 'వకీల్ సాబ్' నిలవనుంది. ఈ సినిమా మరింత వసూలు చేయడానికి 6 రోజుల వీకెండ్ ప్లస్ అవుతుందని చెప్పాలి. దీనికి తోడు ఏప్రిల్ 16న విడుదల కావాల్సిన 'లవ్ స్టోరీ' సినిమా వాయిదా పడటం కూడా వకీల్ కు కలిసిరానుంది. ఏప్రిల్ 23 వరకు మరో కొత్త సినిమా లేదు కాబట్టి 'వకీల్ సాబ్' మంచి వసూళ్లు సాధించి 'వసూల్ సాబ్' గా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం దీంతో పాటుగా నాగార్జున 'వైల్డ్ డాగ్' - నితిన్ 'రంగ్ దే' సినిమాలు థియేటర్స్ లో ఉన్నాయి. కాకపోతే ఈ రెండూ తక్కువ స్క్రీన్స్ లోనే అందుబాటులో ఉండటం వల్ల ఈ సినిమా కలెక్షన్స్ కు పోటీ కాదనే చెప్పాలి.

ఇకపోతే 'వకీల్ సాబ్' సినిమా యూఎస్ఏ లో 260కి పైగా లోకషన్లలో విడుదల చేయగా.. ప్రీమియర్ల ద్వారా ఏకంగా 3 లక్షల డాలర్ల కలెక్షన్స్ వచ్చినట్లు వీకెండ్ సినిమా వెల్లడించింది. ఇప్పటి వరకు అక్కడ 4 లక్షల డాలర్లు వసూళ్లయ్యాయని తెలుస్తోంది. అలానే ఆస్ట్రేలియాలో 55 లొకేషన్స్ లో విడుదలైన ఈ చిత్రం 84.07 లక్షలు రాబట్టింది. ఇక న్యూజిలాండ్ లో 13 లొకేషన్స్ లో 5.61 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.

కాగా, 'పింక్‌' చిత్రానికి రీమేక్‌ గా తెరకెక్కిన ''వకీల్ సాబ్'' కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. బోనీకపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేయేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. పవన్ కు జోడీగా శ్రుతి హసన్ నటించగా.. నివేదా థామస్ - అంజలి - అనన్య - ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.
Tags:    

Similar News