తమన్ దరువుకు పదేళ్లు

Update: 2018-06-03 11:30 GMT
ఎస్.ఎస్.తమన్.. తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరుకో ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. చాలా తక్కువ సమయంలో పెద్ద స్థాయికి ఎదిగి స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్నాడీ ప్రతిభాశాలి. అతను టాలీవుడ్లో అరంగేట్రం చేసి పదేళ్లు పూర్తి కావడం విశేషం. సరిగ్గా దశాబ్దం కిందట తెలుగులో అతడి తొలి సినిమా ‘కిక్’ రిలీజైంది. అందులో గోరో గోగోరే.. ఇటు చూడొద్దన్నానా లాంటి పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో తెలిసిందే. అతడి ట్యూన్లు చాలా కొత్తగా అనిపించాయి అప్పట్లో. ‘కిక్’ మ్యూజిక్ సూపర్ హిట్ కావడంతో తమన్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. వరుసగా స్టార్లతో సినిమాలు చేశాడు. కెరీర్ ఆరంభంలోనే మహేష్ బాబు లాంటి పెద్ద హీరోతో పని చేసే అవకాశం రావడంతో తమన్ దశ తిరిగింది. ‘దూకుడు’ అతడిని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని చేసింది.

ఆపై జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్.. రవితేజ.. నాగార్జున.. బాలకృష్ణ.. వెంకటేష్.. ఇలా చాలామంది బడా హీరోలతో పని చేసి మెప్పించాడు తమన్. పూరి జగన్నాథ్.. శ్రీను వైట్ల.. సురేందర్ రెడ్డి.. బోయపాటి శ్రీను.. ఇలా చాలామంది స్టార్ డైరెక్టర్లతోనూ సినిమాలు చేశాడు. ఐతే తమన్ రొటీన్ దరువులతో మొనాటనీ తెప్పించేస్తున్నాడనే ఫీలింగ్ కొన్నేళ్ల కిందట కలిగింది. దీంతో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అతడిపై విమర్శలు పెరిగాయి. ఐతే అలాంటి సమయంలోనే తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు తమన్. తాను కూడా ఫీల్ గుడ్ మ్యూజిక్ తో మెప్పించగలనని చాటి చెప్పాడు. ‘శ్రీరస్తు శుభమస్తు’.. ‘మహానుభావుడు’ లాంటి సినిమాలు సరికొత్త తమన్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాయి. ఈ క్రమంలోనే అతడి తీరని కోరికల్లో ఒకటి తీర్చుకుంటున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పని చేయాలన్న అతడి కల నెరవేరబోతోంది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’కు అతను పని చేస్తున్నాడు. ఈ సినిమాతో తమన్ తనదైన ముద్ర వేయాలని చూస్తున్నాడు. ఈ కల తీరింది కానీ.. పవన్ తో పని చేయాలన్న కోరిక మాత్రం నెరవేరలేదు. పవన్ మళ్లీ సినిమాల్లోకి వస్తే ఆ కల నెరవేర్చుకుంటాడేమో చూడాలి. ఏదైతేనేం టాలీవుడ్లో పదేళ్ల ఘన ప్రస్థానాన్ని  పూర్తి చేసుకున్న తమన్ కు ఈ సందర్భంలో శుభాకాంక్షలు చెబుతోంది తుపాకి.కామ్.

Tags:    

Similar News