టీజర్ టాక్: కిక్కిచ్చేలా ఉన్న తాగితే తందాన

Update: 2019-12-12 07:37 GMT
అదిత్.. సప్తగిరి..మధునందన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'తాగితే తందాన'.  రవి వర్మ.. బాహుబలి ప్రభాకర్.. సిమ్రన్ గుప్తా..సత్యం రాజేష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.  శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ కాసేపటి క్రితమే విడుదలైంది.  ఈమధ్య కాస్త డిమాండ్ ఎక్కువగా ఉన్న క్రైమ్ కామెడీ జోనర్లో ఈ సినిమా తెరకెక్కింది.

డాబాపై నియాన్ ల్యాంప్ వెలుతురులో ముగ్గురు కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు.  అంతలో "మీరో ముగ్గురిని కొట్టాలి. మినిమమ్ 3 మంత్స్ హాస్పిటల్ లో ఉండాలి" అంటూ మధునందన్ వాయిస్ ఓవర్ లో చెప్తాడు.  ఏదో పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటారు కానీ అంతా కామెడీగానే ఉంది. సత్యం రాజేష్ "హాయ్ అయాం విక్కీ భాయి" అంటాడు. మధునందన్ 'మిస్టర్ ఎ' అని.. అదిత్ 'మిస్టర్ బీ' అని పరిచయం చేసుకుంటారు. వెంటనే తెలివైనవాడిలా సత్యం రాజేష్ 'మిస్టర్ సీ నా" అంటూ సప్తగిరిని ఉద్దేశించి అంటాడు. "కాదు. మిస్టర్ ఎబీ' అంటూ తనదైన శైలిలో ఎవరూ ఊహించని జవాబిస్తాడు సప్తగిరి.  ఇలా సరదాగా.. ఆసక్తికరంగా ప్రారంభమయింది టీజర్.

 టైటిల్ తాగితే తందాన కదా.. దానికి తగ్గట్టే మద్యపానం హానికరం అయినప్పటికీ ఆ ముగ్గురూ బీర్లు లేపుతూ ఉంటారు. బీరు చేతిలో పట్టుకుని "కొంచెం భయంగా ఉందిరా" అని సప్తగిరి నంగనాచిలా అంటే.. మధునందన్ "నీచేతిలో ఏముంది?" అని అడుగుతాడు. సప్తగిరి "బీరు" అని బదులివ్వగానే .. కాదు అన్నట్టు మధునందన్ తల అడ్డంగా ఊపుతూ "ధైర్యం..  తాగు" అంటూ వ్యక్తిత్వ వికాస నిపుణుడి తరహాలో కర్తవ్యం బోధిస్తాడు.  ఈ టైటిల్ జస్టిఫికేషన్ పక్కన పెడితే.. బాహుబలి ప్రభాకర్ ఈ ముగ్గురి వెనక పడుతుంటాడు. ముగ్గురిని హింసిస్తూ ఉంటాడు.  ఈ ముగ్గురికి అరవింద సమేత "ఆ..కు కావాలా" యాక్టర్ తో కూడా ఏదో డీల్ ఉంటుంది. అసలు కథ ఏంటో రివీల్ చెయ్యకుండానే టీజర్ ను ముగించారు.  టీజర్ అయితే ఆసక్తికరంగా ఉంది.  నటీనటులు.. డైలాగ్స్.. కామెడీ పంచులు..  నేపథ్య సంగీతం అన్ని చక్కగా కుదిరినట్టు అనిపిస్తోంది.  ఆలస్యం ఎందుకు చూసేయండి.. ఈ 'తాగితే తందాన' హంగామా.

Full View


Tags:    

Similar News