'తలైవి' తమిళ వెర్షన్ సెన్సార్ పూర్తి..!

Update: 2021-06-22 08:45 GMT
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ''తలైవి''. తమిళులు 'పురచ్చి తలైవి'గా పిలుచుకునే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. తెలుగు తమిళ హిందీ భాషల్లో ఏప్రిల్ 23న విడుదల చేయడానికి ప్లాన్ చేసిన ఈ సినిమా కరోనా పరిస్థితుల్లో వాయిదా పడింది. అయితే చిత్ర బృందం తాజాగా 'తలైవి' సెన్సార్ కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.

''తలైవి'' సినిమా తమిళ వెర్షన్ సెన్సార్ పూర్తైనట్లు మేకర్స్ వెల్లడించారు. దీనికి సెన్సార్ బోర్డ్ క్లీన్ 'U' సర్టిఫికేట్ జారీ చేసినట్లు ప్రకటించారు. త్వరలోనే తెలుగు - హిందీ వర్షన్ సెన్సార్ పనులు జరుగుతాయని తెలిపారు. కాగా,  'బాహుబలి' రచయిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ చిత్రానికి కథ అందించారు. తమిళ రాజకీయాలను జయలలిత ఎలా శాసించగలిగింది?, 'అమ్మ' గా ఎలా ఎదిగింది?, ఆమెకు ఎంజీఆర్ కు మధ్య ఉన్న ప్రేమ - సాన్నిహిత్యం వంటివి ఈ చిత్రంలో ప్రధానంగా చూపించబోతున్నారు.

'తలైవి' చిత్రంలో ఎంజీఆర్ గా అరవింద స్వామి.. కరుణానిధిగా సముద్రఖని.. జయలలిత తల్లి సంధ్యగా భాగ్యశ్రీ.. జానకీ రామచంద్రన్ గా మధుబాల నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో విబ్రి మోషన్ పిక్చర్స్ - కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఈ సినిమా రూపొందుతోంది. విష్ణువర్థన్ ఇందూరి - శైలేష్ ఆర్. సింగ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హితేష్ ఠక్కర్ - తిరుమల్ రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Tags:    

Similar News