మరో ‘రియ‌ల్ స్టోరీ’తో రాబోతున్న సూర్య‌?

Update: 2021-06-28 02:30 GMT
‘ఆకాశం నీ హద్దురా’ వంటి సినిమాతో తమిళ్ స్టార్ హీరో సూర్య ఎలాంటి స‌క్సెస్ ను అందుకున్నాడో తెలిసిందే. కెప్టెన్ గోపీనాథ్ నిజ జీవిత కథతో రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. ఒక రియ‌ల్ స్టోరీకి క‌మ‌ర్షియ‌ల్ హంగులు అద్దిన ద‌ర్శ‌కురాలు సుధాకొంగ‌ర‌.. ఆద్యంత బిగి స‌డ‌ల‌కుండా ప్రేక్ష‌కుల‌ను తెర‌కు అతుక్కుపోయేలా చేసింది.

ఓటీటీలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఇండియాలోనే నెంబ‌ర్ 2గా నిలిచింద‌ని సాక్షాత్తూ గూగుల్ ప్ర‌టించిందంటే.. ఎంత‌టి ప్ర‌జాద‌ర‌ణ పొందిందో అర్థం చేసుకోవ‌చ్చు. సామాన్యుడికోసం ఆకాశంలో ఉన్న విమానాన్ని, విమాన టికెట్‌ ధ‌ర‌ల‌ను నేల‌కు దించిన వైనం అందరినీ అబ్బుర ప‌రిచింది. ఈ చిత్రం త‌ర్వాత ద‌ర్శ‌కుడు పాండిరాజ్ తో ఓ చిత్రం చేస్తున్నాడు సూర్య.

ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ను త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇది సూర్య‌కు 40వ చిత్రం కావ‌డంతో అంచ‌నాలు భారీగా సెట్ట‌య్యి ఉన్నాయి. అయితే.. ఈ చిత్రం కూడా రియ‌ల్ స్టోరీ కాబోతోంద‌నే ప్ర‌చారం సాగుతోంది. గ‌తంలో పొల్లాచ్చిలో సామూహిక అత్యాచారాల ఘ‌ట‌న చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఎంతో సంచ‌ల‌నం సృష్టించిన సంఘ‌ట‌న ఆధారంగా.. ఈ చిత్రం తెర‌కెక్కబోతోంద‌ని టాక్‌.

ఈ మూవీలో మ‌హిళ‌ల‌పై అత్యాచారాల‌కు పాల్ప‌డుతున్న దుర్మార్గుల బండు తీసే యువ‌కుడి పాత్ర‌లో సూర్య క‌నిపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. జూలైలో టైటిల్ రిలీజ్ చేస్తాన‌ని ఈ మధ్య‌నే సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించారు ద‌ర్శ‌కుడు. మ‌రి, ఇది రియ‌ల్ స్టోరీనేనా? కాదా? అనేది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాలి.
Tags:    

Similar News