చనిపోవడానికి ముందు భరత్ ఏం చేశాడంటే..

Update: 2017-06-26 13:07 GMT
హీరో రవితేజ సోదరుడు భరత్ యాక్సిడెంట్ కేసును విచారిస్తున్న పోలీసులకు కొత్త విషయాలు తెలిశాయి. అందరూ సందేహిస్తున్నట్లే భరత్ మద్యం తాగి కారు నడిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రమదానికి ముందు హోటల్ నోవాటెల్ లో భరత్ మద్యం తాగినట్లు తెలిసింది. ప్రమాదానికి ముందు భరత్ నోవాటెల్ లో గడిపిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

శనివారం భరత్ తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల కోసం నోవాటెల్ కు వచ్చాడు. మధ్యాహ్నం 2 గంటలకు హోటల్ కు వచ్చిన భరత్.. 4 గంటల ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ సమీపంలో మద్యం తాగడం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. భరత్ రాత్రి 9.25 గంటల వరకు నోవాటెల్‌ హోటల్లోనే ఉన్నాడు. తర్వాత అక్కడి నుంచి కార్లో బయల్దేరాడు.

మరో 20 నిమిషాలకే.. అంటే రాత్రి 9.45 గంటలకు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కొత్వాల్‌ గూడ వద్ద ఆగివున్న లారీని భరత్ కారు ఢీకొంది. భరత్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. ఆ సమయంలో కారు 145 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లుగా స్పీడ్ మీటర్ సూచించింది. లారీని కారు ఢీకొట్టిన వేగానికి ఎయిర్ బెలూన్లు కూడా పగిలిపోవడం.. కారు నుజ్జునుజ్జవడంతో భరత్ ప్రాణం నిలవలేదు. లారీని నిలబెట్టిన చోట ఇండికేటర్లు లేకపోవడం.. దీనికి తోడు అతి వేగం.. మద్యం తాగి ఉండటం భరత్ మృతికి కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News