కండలవీరుడి సాయానికి అంతే లేదు...!
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో షూటింగ్స్ అన్నీ ఆగిపోయి.. సినిమాపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అయితే రోజూవారీ వేతన కార్మికులను ఆదుకునేందుకు టాలీవుడ్‌లో స్టార్స్ ముందుకు వచ్చినట్లే బాలీవుడ్ లోనూ స్టార్స్ అందరూ ముందుకు వచ్చారు. దాదాపు స్టార్ హీరోలందరూ భారీ మొత్తంలో ప్రజలను.. తమ సినిమాలకు పనిచేసే కార్మికులను ఆదుకునేందుకు విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగి ప్రజలకు సహాయాన్ని అందిస్తున్నాడు. సుమారు 25వేల మంది కార్మికులకు తను ఆర్థిక సహాయం అందించనున్నట్లుగా చెప్పి.. అందరి అకౌంట్లలోకి మనీ ట్రాన్స్‌ఫర్ చేశారు. అంతేకాకుండా ఈ కష్టకాలంలో ముందువరుసలో నిలబడి ప్రజల కోసం పోరాటం చేస్తున్న యోధుల కోసం ఆయనే స్వయంగా ఓ పాటను కూడా పాడి మద్దతు అందించారు. ఇప్పుడు తన ఫామ్ హౌస్ సమీపంలోని గ్రామాలకు కూడా ఆయన సహాయం అందించారు.
Full View
సల్మాన్ ఖాన్ తాజాగా తన పన్వెల్ ఫామ్ హౌస్ సమీపంలో ఉన్న నిరుపేదలకు ఆహార సామాగ్రిని అందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో సల్మాన్ ఖాన్ ఎద్దుల బండ్లు మరియు ట్రాక్టర్లను నిత్యావసరాలతో నింపి సమీప గ్రామాలకు పంపుతున్నారు. ఈ వీడియోలో బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ - లూలియా వంతూర్ - కమల్ ఖాన్ - నికేతన్ మాధోక్ - వాలూస్చా డిసౌసా తదితరులు కూడా నిత్యావసరాలను వాహనాలలో లోడ్ చేస్తుండటం విశేషం. ఈ కార్యక్రమంలో తనకు సహకారం అందించిన అందరికీ సల్మాన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.