రష్మికతో జాగ్రత్త అమ్మాయిలూ...

Update: 2018-08-14 07:13 GMT
హీరోలు స్టార్ ఇమేజ్ సంపాదించడానికి కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది. చాలా పెద్ద బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వారసులు త్వరగానే స్టార్లు అవుతారు కానీ.. బ్యాగ్రౌండ్ లేకుండా బరిలోకి దిగితే స్టార్లు కావడానికి చాలా ఏళ్లు పడుతుంది. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం ఇలా ఉండదు. వాళ్లు ఒకట్రెండు సినిమాలతోనే స్టార్లు అయిపోగలరు. ఇలియానా.. సమంత.. పూజా హెగ్డే లాంటి హీరోయిన్లే ఇందుకు ఉదాహరణ. ఇంకా చాలామంది హీరోయిన్లు రెండు మూడు సినిమాలతోనే పెద్ద రేంజికి వెళ్లిపోయారు. ఇప్పుడు బెంగళూరు భామ రష్మిక మందానా కూడా ఇదే జాబితాలో చేరేలా కనిపిస్తోంది. కన్నడలో చేసిన తొలి సినిమా ‘కిరిక్ పార్టీ’తోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుందా అమ్మాయి. ఇక తెలుగులో ‘ఛలో’ లాంటి సూపర్ హిట్‌ తో ఆమె అరంగేట్రం చేసింది. ఇప్పుడు ‘గీత గోవిందం’తో ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘గీత గోవిందం’ ప్రోమోలు చూస్తే ఇందులో రష్మిక క్యారెక్టర్ ఓ రేంజిలో పేలబోతోందని అర్థమవుతోంది. ఆమె అందం.. అభినయం రెండూ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రష్మిక పెర్ఫామెన్స్ గురించి అల్లు అరవింద్ అంతటి వాడే చాలా గొప్పగా చెప్పడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరగాయి. ఈ సినిమాకు హైప్ కూడా మామూలుగా లేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పెద్ద సినిమాల స్థాయిలో ఆడే అవకాశాలున్నాయి. అదే జరిగితే రష్మిక పెద్ద రేంజికి వెళ్లిపోవడం ఖాయం. ఇప్పటికే నాగార్జున-నానిల క్రేజీ మల్టీస్టారర్ ‘దేవదాస్’తో పాటు విజయ్ దేవరకొండ సరసన ‘డియర్ కామ్రేడ్’లోనూ నటిస్తున్న రష్మిక మున్ముందు మరిన్ని మంచి అవకాశాలు ఖాతాలో వేసుకునే అవకాశముంది. ఆమెతో మిగతా టాలీవుడ్ హీరోయిన్లు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రస్తుతం తెలుగులో వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరోయిన్లు ఎవరూ కనిపించడం లేదు. పూజా హెగ్డే.. ఖన్నాలకు మంచి క్రేజున్నప్పటికీ వాళ్లు నిలకడగా విజయాలు సాధించట్లేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి హీరోయిన్లందరికీ రష్మికతో ఇబ్బందులు తప్పేలా లేవు.
Tags:    

Similar News