మెగా మీట్ : జనసేన జెండా ఎత్తాల్సిందే...?

Update: 2022-05-22 11:02 GMT
మెగాభిమానులు అని అంటారు. అందులో మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోల అందరి అభిమానులు వచ్చేస్తారు. ఆ కుటుంబంలో ఎంతో మంది హీరోలు ఉన్నా తిరుగులేని స్టార్లుగా మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు. ఈ ముగ్గురి సినిమాలు రిలీజ్ అయితే ఆ కోలాహలమే వేరు. రికార్డులను బద్ధలు కొట్టే చరిత్ర వారిది.

ఇక ఈ ముగ్గురి ఫ్యాన్స్ వేరుగా ఉన్నట్లుగా కనిపించినా అందరూ ఒక్కటే. అయితే ఆ ఐక్యత అన్నది ఇపుడు కార్యరూపం తీసుకుంటోంది. ఇప్పటిదాకా జనసేనకు దూరంగా ఉన్న మెగాస్టార్ ఫ్యాన్స్ ఇపుడు జనసేన జెండాను ఎత్తబోతున్నారుట. అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా బాబాయ్ కి అబ్బాయ్ తోడు అని గట్టిగా చెప్పబోతున్నారుట.

ఆ మధ్య విశాఖ షూటింగ్ కి వచ్చిన రామ్ చరణ్ ని జనసేన నాయకులు కలసి తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. జై జనసేన అని కూడా అనిపించారు. ఇక వచ్చే ఎన్నికలను జనసేన సీరియస్ గానే తీసుకుంటోంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా తగిన విధంగానే పార్టీని సమాయత్తం చేస్తున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చాన్స్ ని వదులుకోకూడదని పవన్ ఆలోచనగా చెబుతున్నారు. ఇక 2019 ఎన్నికల వేళ పవన్ కి మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు మద్దతు మాత్రమే లభించింది. ప్రత్యక్షంగా నాగబాబు ఎన్నికలలో కూడా పాలుపంచుకున్నారు. నర్సాపురంలో ఆయన ఎంపీగా పోటీ చేసి లక్షలలో ఓట్లు రాబట్టారు. ఈ రోజుకూ ఆయన తమ్ముడుతో అడుగులు వేస్తున్నారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం నో పాలిటిక్స్ అని దూరంగానే ఉంటూ వస్తున్నారు. రామ్ చరణ్ అయితే బాబాయ్ మీద మనసులో అభిమానం ఉన్నా సరైన టైమ్ లో దాన్ని చూపించాలని చూస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజుకీ ఏపీలో అతి పెద్ద ఫ్యాన్ ఫోర్స్ గా ఉన్న ఈ ముగ్గురు హీరోల అభిమానులు ఒక చోట కలవడం ఇపుడు చర్చనీయాంశం అవుతోంది.

రాజకీయ రాజధానిగా ఉన్న విజయవాడలో ఒక హొటలో చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తాజాగా సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఈ ముగ్గురు హీరోల ఫ్యాన్స్ అండగా నిలవాలని కూడా డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

ఈ మెగా మీటింగునకు అన్ని జిల్లాల నుంచి మెగాభిమానులు హాజరు కావడం విశేషం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జనసేనను గెలిపించేందుకు ఇప్పటి నుంచే అంతా కలసికట్టుగా పనిచేయాలని కూడా సూత్రప్రాయంగా వారు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా సేవా కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా జనసేనను జనంలోకి వినూత్న‌ పద్ధతిలో తీసుకెళ్ళాలని కూడా చూస్తున్న్రు. మొత్తానికి మెగాభిమానులు అంతా ఒక త్రాటి మీదకు రావడం అంటే జనసేన సగం విజయం సాధించినట్లు అని అంటున్నారు. మరి ముందు ముందు ఈ కలయిక ఏ కొత్త సమీకరణలకు దారి తీస్తుందో చూడాలి.
Tags:    

Similar News