తొలిసారి ఆర్జీవీకి దిమ్మ తిరిగే షాక్.. ఏపీ నుంచి నోటీసులు

Update: 2022-06-26 04:30 GMT
'అతి'తో వచ్చే చికాకులకు ఆయన అతీతమన్నట్లుగా ఉంటుంది. తానేం మాట్లాడినా.. ఎవరి గురించి ఏమన్నా సరే.. కాలం ఆయన పక్కనే ఉన్నట్లుగా ఇంతకాలం ఉండేది. ఆ తీరుతో మరింతగా చెలరేగిపోవటం.. తనకు సంబంధం లేని విషయాల్లోనూ కెలికి కంపు చేయటం అలవాటుగా మారింది రాంగోపాల్ వర్మకు. అలాంటి ఆయనకు తొలిసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తనకున్న మేధోతనంతో ఆయన పెట్టే పోస్టులు చాలామందికి కాలి కంకర ఎత్తేలా చేస్తుంటాయి. అయినప్పటికీ.. మాట్లాడకుండా మౌనంగా ఉంటారు.

చూస్తూ.. చూస్తూ వర్మతో పెట్టుకోలేక.. పెట్టుకున్న నాటి నుంచి అతగాడి కన్ను తమ మీద పెడితే మరింత టార్గెట్ అవుతామన్న ఆలోచనతో.. పెల్లుబికే ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటూ ఉంటారు. దీంతో.. తనకు మించిన తోపు మరొకరు ఉండరని.. తానేం మాట్లాడినా.. తనకున్న తెలివితో చెప్పే లాజిక్కులతో బండి లాగించేయొచ్చన్నట్లుగా ఉండే రాంగోపాల్ వర్మ.. తాజాగా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలతో తొలిసారి ఆత్మరక్షణలో పడిన పరిస్థితి.
Read more!

ఎప్పటిలానే తనకొచ్చిన కోతి ఆలోచనల్ని ప్రపంచం మీదకు వదిలేసే ఆయనకు.. అనరాని రీతిలో అన్నానన్న విషయాన్ని అర్థం చేసుకున్న వర్మ.. తన తీరుకు భిన్నంగా వివరణ ట్వీట్ పోస్టు చేయటం తెలిసిందే. వర్మ అతితో విసిగిపోయిన చాలామంది.. తాజాగా గళం విప్పుతున్నారు.

అనూహ్యంగా ఇలాంటి వారిలో ఆయన ఎంతగానో అభిమానించి.. ఆరాధించే రాజకీయ పార్టీకి చెందిన వారు కూడా ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా వర్మపై ఏపీ మహిళా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. ద్రౌపది ముర్ముపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. వర్మ తన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్న అల్టిమేటం జారీ చేశారు. ఇది చాలదన్నట్లు.. ఆర్జీవీకి నోటీసులు జారీ చేస్తున్న వైనాన్ని వెల్లడించారు ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సనర్ వాసిరెడ్డి పద్మ.

జాతీయ మహిళా కమిషన్ సెమినార్ కు హాజరైన ఆమె మీడియాతో మాట్లాడే సందర్భంలో ఆర్జీవీకి నోటీసులు ఇస్తున్నట్లు చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదా.. ఆయన సర్కారు మీదా కించిత్ మాట అనని ఆయన.. వారి అండతో విపక్ష చంద్రబాబును.. అందరికంటే ఎక్కువగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేయటం తెలిసిందే.

అవసరం లేకున్నా.. కెలికి మరీ పవన్ ను బజారులో నిలబట్టే కార్యక్రమాన్ని చేపట్టటం తెలిసిందే. ఫలానా సందర్భం అన్నది లేకుండా తన మనసులో పవన్ మెదిలిన ప్రతిసారీ.. ఏదో ఒక పాయింట్ ను.. లాజిక్ ను వెతికి మరీ పవన్ మీద ట్వీట్లు పోస్టు చేయటం.. దాన్నో ఇష్యూగా మార్చే ఆర్జీవీకి ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి మీద చేసిన వ్యాఖ్యలు ఆయనకు భారీ షాకిచ్చేలా మారాయని చెప్పక తప్పదు. తాజా ఎపిసోడ్ లో ఆయన అంతో ఇంతో మూల్యం చెల్లించుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News