సినీ కార్మికులకు అండగా నిలవనున్న 'నవరస' నిర్మాతలు..!

Update: 2021-06-07 05:32 GMT
ప్రస్తుతం దక్షిణాదిన తెరకెక్కనున్న ఆసక్తికరమైన వెబ్‌ సిరీస్‌ లలో ''నవరస'' ఒకటి. హాస్యం - రౌద్రం - కరుణ - బీభత్సం - శాంతం - శృంగారం - భయానకం - వీరం - అద్భుతం వంటి తొమ్మిది రసాల ఆధారంగా తొమ్మిది కథలను ఈ సిరీస్ ద్వారా చెప్పబోతున్నారు. దీనికి తొమ్మిది మంది తమిళ దర్శకులు పని చేస్తుండటం విశేషం.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం లెజండరీ డైరెక్టర్ మణిరత్నం ఈ ఐడియాతో ముందుకొచ్చారు. మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం నిర్మిస్తున్న ఈ ఆంథాలజీ నిర్మాణంలో ప్రొడ్యూసర్ జయేంద్ర పంచపకేషన్ భాగస్వామిగా ఉన్నారు. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఆంథాలజీ సిరీస్ ఆగస్టు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన వేలాది మంది తమిళ సినీ కార్మికులకు 'నవరస' నిర్మాతలు మణిరత్నం మరియు జయేంద్ర అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఈ సిరీస్ వల్ల వచ్చే లాభాలను విరాళంగా ఇవ్వనున్నట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

కాగా, 'నవరస' ఆంథాలజీ సిరీస్ కోసం ప్రముఖ తమిళ నటీనటులు, సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు. సూర్య - విజయ్ సేతుపతి - బాబీ సింహా - ప్రకాష్ రాజ్ - బొమ్మరిల్లు సిద్ధార్థ్ - నిత్యా మీనన్ - ఐశ్వర్య రాజేష్ - విక్రాంత్ - గౌతమ్ కార్తీక్ - శ్రీరామ్ - అశోక్ సెల్వన్ వంటి స్టార్స్ ఈ సిరీస్ లో నటిస్తున్నారు. పీసీ శ్రీరామ్ - సంతోష్ శివన్ - మనోజ్ పరమహంస - బాలసుబ్రహ్మనియన్ వంటి సినిమాటోగ్రాఫర్స్ వర్క్ చేస్తున్నారు.

ప్రియదర్శన్ - గౌతమ్ మీనన్ - వసంత్ - కార్తీక్ సుబ్బరాజ్ - అరవింద్ స్వామి - హాలితా సమీన్ - కార్తిక్ నరేన్ - బెయోజ్ నంబియార్ - ఆర్.ఆర్ ప్రసాద్ వంటి 9 మంది దర్శకులు ఇందులోని 9 కథలను చెప్పబోతున్నారు. ఏఆర్ రెహమాన్ - డి. ఇమ్మాన్ - జిబ్రాన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ సంగీతం సమకూరుస్తున్నారు.
Tags:    

Similar News