నాని - శేష్ లతో రవితేజ కుస్తీ..!

Update: 2022-11-11 16:54 GMT
మాస్ మహారాజా రవితేజ సమర్పణలో వస్తోన్న తాజా చిత్రం ''మట్టి కుస్తీ''. కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ నటించిన ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ని బట్టి ఇదొక రూరల్ స్పోర్ట్స్ డ్రామా అని అర్థమైంది. అయితే మేకర్స్ తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని లాక్ చేసారు.

'మట్టి కుస్తీ' చిత్రాన్ని డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా వదిలిన అనౌన్స్‌ మెంట్ పోస్టర్‌ లో ఐశ్వర్య కుర్చీపై కూర్చుని ఇంటెన్స్ గా చూస్తుండగా.. విష్ణు విశాల్ ఆమె వెనుక నిలబడి ఉన్నాడు. ఫస్ట్ లుక్ ద్వారా సినిమాలో యాక్షన్ ని సూచించగా.. లేటెస్ట్ పోస్టర్ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది.

'సార్' 'అమిగోస్' వంటి సినిమాలు వాయిదా పడటంతో.. రవితేజ 'మట్టి కుస్తీ' కోసం ఆ డేట్ ని లాక్ చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే అదే రోజున టాలీవుడ్ వర్సటైల్ హీరో అడవి శేష్ ''హిట్ 2'' సినిమా విడుదల కాబోతోంది. నేచురల్ స్టార్ నాని ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది.

అలాంటి చిత్రానికి పోటీగా ఇప్పుడు 'మట్టి కుస్తీ' వంటి డబ్బింగ్ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. దీంతో డిసెంబర్ 2న నాని మరియు శేష్ లతో రవితేజ కుస్తీ పట్టాల్సిన పరిస్థితి వస్తోంది. మరి ఈ పోటీలో ఎవరు విజేతలుగా నిలుస్తారో వేచి చూడాలి.

'మట్టి కుస్తీ' మూవీని విష్ణు విశాల్ స్టూడియోస్ మరియు RT టీమ్‌ వర్క్స్ బ్యానర్‌లపై రవితేజతో కలిసి హీరో స్వయంగా నిర్మిస్తున్నారు. ఇంతకముందు విష్ణు నటించిన 'ఎఫ్‌ఐఆర్' సినిమాని మాస్ రాజా తెలుగులో రిలీజ్ చేసారు. ఇప్పుడు వీరిద్దరూ మరో చిత్రం కోసం చేతులు కలిపారు.

యాక్షన్‌ తో కూడిన 'మట్టి కుస్తీ' సినిమాలో విష్ణు విశాల్ ఒక రెజ్లర్‌ గా కనిపించనున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ప్రసన్న జికె ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇకపోతే RT టీమ్ వర్క్స్ బ్యానర్ ని స్థాపించి నిర్మాణంలోకి దిగిన రవితేజ.. 'ఖిలాడీ' 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి పరాజయాలు చవిచూశారు. కానీ విష్ణు విశాల్ 'FIR' చిత్రాన్ని రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు 'మట్టి కుస్తీ' చిత్రంతో మరో విజయాన్ని అందుకుంటారో లేదో చూడాలి.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News