ఎన్టీఆర్ ప్రతిభకు ఫ్లాట్ అయిన విదేశీ భామ

Update: 2015-10-03 13:30 GMT
యాక్టింగ్ విషయంలో కావొచ్చు.. డ్యాన్స్ విషయంలోనూ తారక్ ను వంక పెట్టాల్సిందే లేదు. ఇవాల్టి రోజున రెండు పేజీల డైలాగుల్ని ఆపకుండా చెప్పగలిగిన సత్తా ఉన్న అతి కొద్దిమందిలో జూనియర్ ఎన్టీఆర్  ఒకరు. అలాంటి ఆయన.. తన నటనతో ఓ విదేశీ నటి మనసును కొల్లగొట్టేశాడు.

లండన్ లో స్థిరపడిన డచ్ నటి లిజా వాన్ డర్ సిమ్సిన్.. ఎన్టీఆర్ ను తెగ పొగిడేస్తోంది. ఆకాశానికి ఎత్తేస్తోంది. అతనితో కలిసి పని చేయటం అద్భుతమని చెప్పటమే కాదు.. బ్రిలియంట్.. ఫెంటాస్టిక్ పర్సన్ అంటూ ఆపకుండా చెప్పేస్తోంది. అక్కడెక్కడో డచ్ నటి.. మన జూనియర్ ను అలా పొగిడేయటం ఏమిటి? ఆమెకు ఎలా తెలుసన్న డౌట్లు అక్కర్లేదు.

ఎన్టీఆర్ తాజాగా చేస్తున్న ‘‘నాన్నకు ప్రేమతో’’ చిత్ర షూటింగ్ లండన్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ లో లిజా (అంత పొడుగును కాస్త కత్తిరిస్తే) కీలక భూమిక పోషించిందట. లండన్  షూట్ లో ఆమె రోల్ చాలానే ఉందట. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన ఆమె.. ఎన్టీఆర్ ప్రతిభ గురించి గొప్పలు చెప్పేస్తూ.. ‘‘వరల్డ్ క్లాస్’’ యాక్షన్ అని భారీ స్టేట్ మెంట్ ఇచ్చేసింది.

నాన్నకు ప్రేమతో యూనిట్ తో ఎంతగానో కలిసిపోయిన ఆమె.. షెడ్యూల్ పూర్తి అయిపోయి వెళ్లిపోతుంటే.. విపరీతమైన భావోద్వేగానికి గురైందట. ఈ సందర్భంగా పలువురు యూనిట్ సభ్యులతో కలిసి ఫోటోలు దిగిన ఆమె.. నాన్నకు ప్రేమతో యూనిట్ తో కలిసి పని చేసిన రోజుల్ని తాను మర్చిపోలేనని చెబుతోంది. ఎన్టీఆర్ తన ప్రతిభతో ఒక విదేశీ నటి అంతలా మెప్పించటం గ్రేటే సుమి.
Tags:    

Similar News