కూలిపోతున్న క‌పూర్ హ‌వేలీ!

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉన్న రాజ్ కపూర్ పూర్వీకుల చారిత్రాత్మక నివాసం కపూర్ హవేలీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతింది.;

Update: 2026-04-05 08:02 GMT

కపూర్ కుటుంబానికి సంబంధించి ఓ చేదు వార్త వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉన్న రాజ్ కపూర్ పూర్వీకుల చారిత్రాత్మక నివాసం కపూర్ హవేలీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతింది. ప్రకృతి వైపరీత్యాల ధాటికి ఐదు అంతస్తుల భవనంలోని ప్రధాన భాగం నేలమట్టమవ్వ‌డంతో క‌పూర్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ భవనం కేవలం ఇటుకలు, సిమెంట్ కట్టడం మాత్రమే కాదు. ఆ భ‌వ‌నం శతాబ్ద కాలపు సినిమా చరిత్రకు సాక్షి. రాజ్ కపూర్ తండ్రి పృథ్వీరాజ్ కపూర్ పుట్టి పెరిగిన ఇల్లు ఇది.

1918-1922 మధ్య కాలంలో నిర్మించబడింది. పెషావర్‌లోని కిస్సా ఖవానీ బజార్ లో ఉన్న అద్భుతమైన కట్టడం ఒకప్పుడు ఆ ప్రాంతపు వాస్తుకళా వైభవానికి చిహ్నంగా నిలిచింది. అయితే విభజన అనంతరం ఈ భవనం క్రమంగా శిథిలావస్థకు చేరుకుంటుంది. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ ప్రభుత్వం ఈ హవేలీని హెరిటేజ్ సైట్ గా ప్రకటిం చినప్పటికీ క్షేత్రస్థాయిలో సంరక్షణ చర్యలు మాత్రం శూన్యం. భవన యజమానులకు , పురావస్తు శాఖకు మధ్య ఉన్న న్యాయపరమైన వివాదాలు, నిధుల కొరత కారణంగా వారసత్వ సంపద గాలికి వ‌దిలేసిన‌ట్లు అయింది.

తాజాగా కురిసిన వర్షాలు, భూకంపం వంటి ప్రకృతి విపత్తులు బలహీనమైన కట్టడాన్ని మరింత దెబ్బతీస్తున్నాయి. రిషి కపూర్ , రణబీర్ కపూర్ వంటి వారు కూడా తమ పూర్వీకుల సంప‌ద‌ల‌ను చూడాలని గతంలో ఆశపడ్డారు. కానీ అశాంతి , రాజకీయ కారణాల వల్ల ఆ ప్రాంతాన్ని సందర్శించడం సాధ్యపడలేదు. ఇప్పుడు ఆ భవనం ముక్కలు ముక్కలుగా విడిపోతుండటం క‌పూర్ కుటుంబాన్ని ఎంతో బాధిస్తుంది. ఓ గొప్ప కళాకారుడి జ్ఞాపకాలు చరిత్ర పుటల నుండి చెరిగిపోతున్నట్లు అనిపిస్తోంది. ఇదే ప్రాంతంలో ఉన్న దిలీప్ కుమార్ నివాసం కూడా దాదాపు ఇదే స్థితిలో ఉండటం గమనార్హం.

సినీ సామ్రాజ్యానికి పునాది వేసిన కపూర్ హవేలీ ని కాపాడుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పాక్తిస్తాన్ లాంటి శ‌త్రు దేశంలో ఇలాంటి వైభ‌వ‌మైన భ‌వ‌న క‌ట్ట‌డం దుర‌దృష్ట‌క‌రంగా భావిస్తున్నారు. ఇప్ప‌టికే భవనాన్ని మ్యూజియంగా మార్చి భావితరాలకు సినిమా చరిత్రను అందించాలని క‌పూర్ కుటుంబ స‌బ్యులు, అభిమానుల కోరారు. కానీ స‌న్నివేశం చూస్తుంటే అది జ‌రిగేలా లేదు. ప్రభుత్వాలు తక్షణమే స్పందించకపోతే అరుదైన కట్టడం పూర్తిగా మట్టిలో కలిసిపోయే ప్రమాదం ఉంద‌న్న‌ది క్లియ‌ర్.

భార‌త్- పాకిస్థాన్ మధ్య ఉన్న సాంస్కృతిక వారధిగా నిలిచిన ఇటువంటి కట్టడాలు కూలిపోవడం ఒక దేశానికో లేదా ఒక కుటుంబానికో పరిమితమైన నష్టం కాదు. కళకు సరిహద్దులు లేవని నిరూపించిన కపూర్ ఖాందాన్ మూలాలు ఇలా మట్టిలో కలిసిపోతుంటే? సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసిపోతున్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికైనా అంతర్జాతీయ వారసత్వ సంస్థలు -స్థానిక ప్రభుత్వాలు సమన్వయంతో స్పందించి మిగిలి ఉన్న కపూర్ హవేలీ భాగాలను పునరుద్ధరించాలని కళాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. లేదంటే రాబోయే తరాలకు ఈ మహానటుల ఆనవాళ్లు కేవలం పాత ఫోటోల్లో, కథల్లో మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News