వర్మకు కేటీఆర్ పంచ్ మామూలుగా పడలేదుగా?

Update: 2020-04-11 04:45 GMT
యావత్ ప్రపంచం ఇప్పుడో ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. ఎవరికి ఎప్పుడు కరోనా వైరస్ పట్టేస్తుందో అర్థం కాని దుస్థితి. ఇలాంటివేళ.. ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండేలా లాక్ డౌన్ ను విధించింది ప్రభుత్వం. ప్రాణాల్ని రక్షించుకునేందుకు ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాల్సిన వేళ ఇది. ఈ సమయంలోనూ కొందరు వ్యవహరిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. లాక్ డౌన్ పుణ్యమా అని మందుబాబులకు నిద్రలేని రోజులుగా మారాయి. చుక్క పడందే పూట గడవని వారి పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు.

ఖాళీగా ఉంటే చాలు చీర్స్ చెప్పేసే బ్యాచ్ అయితే లాక్ డౌన్ వేళ కిందామీదా పడుతున్న పరిస్థితి. ఎంతైనా సరే.. బ్లాక్ లో అయినా కొనేద్దామంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటివేళలో ఆసక్తికర పోస్టులకు కేరాఫ్ అడ్రస్ గా వ్యవహరించే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. కొన్ని రాష్ట్రాల మాదిరి పెద్ద మనసు చేసుకొని మద్యాన్ని ఇంటికి డెలివరీ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఈ విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేశారు. ‘‘ఇళ్లల్లో ఉంటున్న వాళ్లు ఏం చేయాలో తెలియక జట్టు పీక్కుంటున్నారు. చిన్న పిల్లల్లా ఏడుస్తున్నారు. మెంటల్ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఫస్ట్రేషన్ లో కొందరు భర్తలు భార్యల్ని కొడుతున్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతలా పెద్ద మనసు చేసుకొని మాకు చీర్స్ చెప్పండి’’ అంటూ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ స్పందించారు.

వర్మ అడుగుతున్నది బెంగాల్ లో మాదిరి మద్యం డోర్ డెలివరీ. కానీ.. అదేమీ తెలినట్లుగా స్పందించారు. చమత్కార ధోరణిలో.. రాముగారు మీరు అడుగుతోంది హెయిర్ కట్ గురించే అనుకుంటున్నా.. అంటూ ట్వీట్ చేశారు. వర్మ చేసిన ట్వీట్ కు ఇంతలా పంచ్ వేసిన ఘనత మాత్రం కేటీఆర్ కే దక్కుతుంది. మరి.. దీనికి ఆర్జీవీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News