టాలీవుడ్ పెద్ద‌ల‌తో జ‌గ‌న్ స‌ర్కార్ భేటీ!

Update: 2021-09-17 09:30 GMT
టాలీవుడ్ పెద్ద‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ అధికారులు భేటీ అవుతార‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొస్తున్న నేప‌థ్యంలో మంత్రి పేర్ని నాని వివ‌ర‌ణ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈ భేటి జ‌రుగుతుంద‌ని మంత్రి తెలిపారు. ఇప్ప‌టికే ఒక ధ‌పా స‌మావేశంలో సీఎం పాల్గొన్నారు. అందులో ఏఏ అంశాలు చ‌ర్చ‌కొచ్చాయ‌న్న‌ది కాస్త క్లారిటీ లోపించిన నేప‌థ్యంలో మ‌రోసారి ఈ భేటీపై ఆస‌క్తి నెల‌కొంది. ఏపీలో టిక్కెట్ ధ‌ర‌లు పెద్ద స‌మ‌స్య‌.. టిక్కెట్ల ను ప్ర‌భుత్వ‌మే విక్ర‌యించాలా? లేక ప్ర‌యివేటు భాగ‌స్వామ్యంలో పోర్ట‌ల్ ఏర్పాటు చేసి అమ్మకాలు చేయ‌లా? లేక ఆ అవ‌కాశం సినిమా పెద్ద‌ల‌కే ఇవ్వాలా? అన్న దానిపై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగే అవకాశం క‌నిపిస్తోంది.

అలాగే థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌పై కూడా కూలంకుశంగా చ‌ర్చించే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే ఈ భేటీలో జ‌గ‌న్ పాల్గొంటారా? లేక మంత్రి నాని అధ్య‌క్ష‌త‌నే భేటీ నిర్వ‌హిస్తారా? అన్న దానిపై క్లారిటీ లేదు. అలాగే టాలీవుడ్ నుంచి పెద్ద‌లు ఎవ‌రెవ‌రు హ‌జ‌ర‌వు తారు? అన్న‌ది కూడా స్ప‌ష్ట‌త లేదు. నేరుగా సీఎంతో స‌మావేశం అంటే క‌చ్చితంగా మెగాస్టార్ చిరంజీవి..నాగార్జున‌.. సురేష్ బాబు లాంటి పెద్ద‌లు త‌ప్ప‌క హాజ‌రు కావాల్సి ఉంటుంది. అలా కాకుండా మంత్రి స‌మ‌క్షంలో భేటీ అంటే విజ‌య‌వాడ‌లోనా హైద‌రాబాద్ లోనా? అన్న‌ది క్లారిటీ రావాల్సి ఉంటుంది.

అయితే ఇప్ప‌టికే ప్ర‌భుత్వం 20వ తేదీన జ‌రిగే భేటీకి మంత్రి నాని అధ్వ‌ర్యంలో ఉంటుంద‌ని ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో స‌మావేశం స్వ‌రూపం ఎలా ఉంటుంద‌న్న‌ది తేలాల్సి ఉంది. గ‌తంలో జ‌గ‌న్ తో ఇలాంటి స‌మావేశం నిర్వ‌హించిన‌ప్పుడు చిరంజీవి స‌హా కీల‌క మైన వ్య‌క్తులంతా హాజ‌ర‌య్యారు. ఆ స‌మావేశంలోనే సినీప‌రిశ్ర‌మ స‌మస్య‌ల‌తో పాటు నంది అవార్డుల నిర్వ‌హ‌ణ‌ అలానే విశాఖ‌లో ఫిలిం సిటీ డెవ‌లెప్ మెంట్ పై సుదీర్ఘంగా చ‌ర్చించిన సంగ‌తి తెలిసిన‌దే.. స్థ‌లాల కేటాయింపుకు సంబంధించిన వివ‌రాలు కూడా సేక‌రించాల‌ని సీఎం అదేశాలిచ్చారు. ఒక వేళ జ‌గ‌న్ తో గ‌నుక భేటీ అయితే క‌చ్చితంగా మెగాస్టార్ స‌హా అంద‌రూ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉందని స‌మాచారం.

ఈసారి స‌మావేశం లో చ‌ర్చ‌లు ఇలా..!

ఆంధ్రప్ర‌దేశ్ లో టిక్కెట్టు రేట్ల స‌మ‌స్య ప్ర‌ధాన‌మైన‌ది.. దీనివ‌ల్ల‌నే చాలా పెద్ద సినిమాలు రిలీజ్ కావ‌డం లేదు. ఇటీవ‌ల టికెట్ ధ‌ర‌ల‌పై ఏపీలో వ‌చ్చిన స‌వ‌ర‌ణ‌ జీవోతో చిక్కుల‌పై సీఎం భేటీలో చ‌ర్చించ‌నున్నార‌ని తెలిసింది. గ్రామ పంచాయితీ- న‌గ‌ర పంచాయితీ- కార్పొరేష‌న్ ఏరియాల్లో టిక్కెట్టు ధ‌ర‌ల‌పై నా చ‌ర్చిస్తారు. ద‌ర్శ‌క‌న‌టుడు నిర్మాత‌ ఆర్.నారాయ‌ణ మూర్తి ఇత‌ర చిన్న నిర్మాత‌ల‌ డిమాండ్ మేర‌కు ఐదో షోని చిన్న సినిమాకి కేటాయించాల్సిందిగా సీఎంని కోర‌నున్నారు. అలాగే మునుప‌టిలాగే ప్ర‌తియేటా నంది అవార్డులతో క‌ళాకారుల‌ను ప్రోత్సహించాల‌ని కోర‌తారు. వినోద‌పు ప‌న్ను మినహాయింపులు..ఏపీ టాలీవుడ్ నిర్మాణానికి అవ‌స‌ర‌మ‌య్యే స్టూడియోలు నిర్మించడానికి అవసరమైన భూముల రాయితీలపైనా చ‌ర్చిస్తార‌ని తెలిసింది. క‌రోనా క్రైసిస్ క‌ష్ట‌కాలంలో థియేట‌ర్లు మూత ప‌డి ఉన్నాయి. ఆ స‌మ‌యంలో క‌రెంటు బిల్లుల మాఫీ అంశం ప్ర‌స్థావ‌న‌కు తెస్తార‌ట‌. ఎగ్జిబిష‌న్ రంగాన్ని కాపాడ‌టానికి త‌క్ష‌ణ సాయం సీఎంని కోర‌తార‌ని తెలిసింది.

విడుదలైన మొదటి వారంలో సినిమాల కోసం అదనపు బెనిఫిట్ షోలను నడపడం వంటి అంశాల్ని టాలీవుడ్ ప్రతినిధి బృందం సీఎం దృష్టికి తీసుకెళుతుంది. ప్రభుత్వం వైపు నుండి థియేటర్లలో ఆన్ లైన్ సినిమా టికెట్ అమ్మకాన్ని చేపట్టాలని జగన్ తన ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్రతినిధి బృందానికి వివరిస్తారని గుస‌గుస వినిపిస్తోంది. ప్రభుత్వం నిర్ణయం దాని చట్టపరమైన చిక్కులను క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు క‌మిటీ ప‌ని చేస్తుంద‌ట‌.

ఈసారి కూడా ఫిలింస్టూడియోల‌పై చ‌ర్చ‌!

ఇంత‌కుముందు లానే వైజాగ్ ఫిలింఇండ‌స్ట్రీపై భేటీలో చ‌ర్చ సాగ‌నుంద‌ని స‌మాచారం. సీఎం జ‌గ‌న్ తో భేటీలో విశాఖ‌లో ఫిలింస్టూడియోల నిర్మాణానికి స్థ‌లాల సేక‌రణ.. స్థ‌లాల సేక‌ర‌ణ‌లో స‌బ్సిడీ అంశాలు వ‌గైరా వ‌గైరా చ‌ర్చించేందుక ఆస్కారం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి


Tags:    

Similar News