లెక్కల మాస్టర్ గా హృతిక్ అదిరిపోయే లుక్

Update: 2018-02-06 08:12 GMT
మొదటి సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని స్టార్ అయిపోయిన అరుదైన హీరో హృతిక్ రోషన్. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీగా ఇప్పటికీ తన చరిష్మా అలాగే మైంటైన్ చేస్తున్నాడు. గత ఏడాది అంధుడిగా నటించిన కాబిల్ నటుడిగా అతడిని మరో మెట్టు ఎక్కించింది కాని కమర్షియల్ గా ఆశించిన విజయం అందుకోలేదు. ప్రయోగాలకు ఎప్పుడు వెనుకాడని హృతిక్ రోషన్ చేస్తున్న కొత్త సినిమా సూపర్ 30. ఎందరో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన సుప్రసిద్ధ మ్యాథ్స్ టీచర్ ఆనంద్ కుమార్ బయోపిక్ గా ఈ సినిమా రూపొందుతోంది. కాశి, వారణాసి తదితర అవుట్ డోర్ లోకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లుక్ ఒకటి బయటికి వచ్చింది.

బాగా గుబురుగా పెరిగిన మాసిన గెడ్డం - తైల సంస్కారం మరిచిన హెయిర్ స్టైల్ తో కొత్తగా కనిపిస్తున్న హృతిక్ లుక్ ఫ్రెష్ గా ఉండటమే కాదు మరో ఛాలెంజింగ్ రోల్ చేసినట్టు చెప్పకనే చెబుతుంది. నెలకు లక్షలకు లక్షలు జీతాలు ఇస్తామని కార్పోరేట్ విద్యా సంస్థలు రెడ్ కార్పెట్ పరిచినా వాటిని లెక్క చేయకుండా ఫీజు కూడా కట్టలేని ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆనంద్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకొని ఎందరో ప్రముఖల చేతుల మీదుగా లెక్కలేనన్ని పురస్కారాలు అందుకున్నారు. పాట్నా వాస్తవ్యుడైన ఆనంద్ కుమార్ తండ్రి పోస్టల్ డిపార్టుమెంటులో క్లర్క్ గా పనిచేసారు.

చిన్నతనంలోనే అప్పడాలు అమ్ముతూ కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తూనే మరోవైపు పిల్లలకు లెక్కల పాఠాలు చెబుతూ విదేశీ పత్రికల్లో వచ్చే మ్యాథ్స్ ఆర్టికల్స్ చదవడం కోసం ప్రతివారం పూణే నుంచి వారణాసి దాకా ఆరు గంటల రైలు ప్రయాణం చేసి మరీ చదివి వచ్చేవాడు ఆనంద్ కుమార్. 2002లో మొదలు పెట్టిన సూపర్ 30 ప్రోగ్రాం ద్వారా వెనుకబడిన తరగతికి చెందిన పిల్లలను మాత్రమే చేర్చుకుని వారిని తీర్చిదిద్దేవాడు. పెద్ద పెద్ద మంత్రులు తమ పిల్లలకు చదువు చెప్పడానికి కోట్లు ఇస్తామన్నా తిరస్కరించిన ఆనంద్ కుమార్ పాత్రలో హృతిక్ రోషన్ ను చూడటం అంటే చిన్న విషయం కాదుగా.
Tags:    

Similar News