గంజాయితో చేసే 'సీబీడీ ఆయిల్'ని చట్టబద్ధం చేయాలని కోరిన ఇర్ఫాన్ ఖాన్ భార్య

Update: 2020-09-30 11:50 GMT
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. ఇప్పటికే నటి రియా చక్రవర్తి సహా పలువురిని అరెస్ట్ చేశారు. అలానే డ్రగ్స్ సంబంధాలపై స్టార్ హీరోయిన్లు దీపికా పదుకునే - శ్రద్ధా కపూర్ - రకుల్‌ ప్రీత్ సింగ్ - సారా అలీఖాన్ లను సైతం ఎన్సీబీ అధికారులు విచారించారు. శ్రధ్ధా కపూర్ కి ఆన్ లైన్ ద్వారా సీబీడీ ఆయిల్ ఆర్డర్ చేశానని సుశాంత్ మాజీ మేనేజర్ జయ సాహా ఎన్సీబీ విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సుశాంత్ కి ఎలా ఇవ్వాలో రియాకి వాట్సాప్ ద్వారా తెలియజేశానని వెల్లడించింది జయ సాహా. ఈ నేపథ్యంలో అసలు సీబీడీ ఆయిల్‌ అంటే ఏంటి.. దాని వినియోగం చ‌ట్టవిరుద్ధమా కాదా అనే విషయాలు చర్చనీయాంశమయ్యాయి.

కాగా, సీబీడీ ఆయిల్‌ ని గంజాయి ఆకుల నుంచి ప‌లు ప‌దార్థాల‌ను వెలికి తీసి త‌యారు చేస్తారు. దీన్ని కన్నాబిడియోల్ అని కూడా పిలుస్తారు. ఇందులో గంజాయి మోతాదు 40 శాతం వరకు ఉంటుంది. చాలా దేశాల్లో వైద్యులు సీబీడీ ఆయిల్‌ ని రోగులకు సూచిస్తుంటారు. మాన‌సిక స‌మ‌స్యలు - కీళ్ల నొప్పులు - నిద్రలేమి - గుండె సంబంధ స‌మ‌స్య‌ల‌కు దీన్ని ఔష‌ధంగా వాడతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దివంగత లెజెండరీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ భార్య సుతాపా సికదర్.. సీబీడీ ఆయిల్‌ ను ఇండియాలో చట్టబద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు. #LegalizeCBDoilinindia అని హ్యాష్ ట్యాగ్ పెట్టి ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ చికిత్స తీసుకున్న లండన్ హాస్పిటల్ ఫోటోను సుతాపా ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేశారు. ఈ ఆసుపత్రిలో ఇర్ఫాన్ చికిత్స తీసుకునే సమయంలో బయటి నుంచి అతడి రూమ్‌ ని ఎలా చూసేదాన్నో ఇప్పుడు అలానే చూస్తున్నా అని కామెంట్‌ పెట్టారు. అయితే ప్రస్తుతానికి సీబీడీ ఆయిల్‌ ఫై ఇండియాలో ఎలాంటి నిషేధం లేదని తెలుస్తోంది. పలు ఈ-కామర్స్ సైట్ల ద్వారా ఇది అందుబాటులో ఉన్నట్టు సమాచారం.
Tags:    

Similar News